Mtm Doctor Murder: వైద్యురాలి హత్యలో భర్తపైనే అనుమానాలు..నేడోరేపో అరెస్ట్ చేసే అవకాశం
Mtm Doctor Murder: కృష్ణాజిల్లాలో సంచలనం సృష్టించిన పిల్లల వైద్యురాలు రాధా హత్య కేసులో భర్త ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వైద్యురాలి హత్యలో ఇప్పటికే డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు భర్తతో పాటు అతని స్నేహితుల్ని ప్రశ్నిస్తున్నారు.
Mtm Doctor Murder: కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జరిగిన పిల్లల వైద్యురాలు హత్య కేసు మిస్టరీ వీడుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు భర్తేనని పోలీసులు అంచనాకు వచ్చారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో భార్యను హతమార్చినట్టు గుర్తించారు. నెపం దోపిడీ దొంగలపై వేసేందుకు చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో భర్త ప్రమేయంపై సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు.
వైద్యురాలిని హత్య చేసింది ఎవరనే విషయంలో బలమైన ఆధారాలు లభించిన రెండు వారాలుగా నిందితుల్ని అరెస్ట్ చేయకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న వైద్యురాలి భర్తను కాపాడేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మచిలీపట్నంలో పిల్లల వైద్యులైన మాచర్ల రాధ, ఆమె భర్త ఉమామహేశ్వరరావులు చాలా కాలంగా క్లినిక్ నడుపుతున్నారు. ఆస్పత్రి నిర్వహణతో ప్రాక్టీస్ ద్వారా ఇద్దరు బాగా ఆస్తులు సంపాదించారు. హత్యకు గురైన రాధ పుట్టింటి నుంచి ఇటీవల పెద్ద మొత్తంలో ఆమెకు ఆస్తులు, నగదు సంక్రమించినట్లు బంధువులు చెబుతున్నారు.
వైద్యురాలిగా వ్యక్తిగత సంపాదనతో పాటు పుట్టింటి నుంచి సంక్రమించిన రూ. కోట్లాది రుపాయల ఆస్తిని ధార్మిక, సేవా కార్యక్రమాలకు వినియోగించాలని భావించారు. ఇదే ఆమె ప్రాణాలను బలిగొని ఉంటుందని బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ పరంగా, వ్యక్తిగతంగా ఎవరితో ఎటువంటి విభేదాలు లేకపోయినా, రాధ కొన్ని నెలలుగా ప్రాక్టీసు వదిలేసి ఇంటికే పరిమితం అయ్యారు.
హత్య వెనుక ఆర్థిక అంశాలు మినహా ఇతర కారణాలు లేవని ఆమె బంధువర్గం స్పష్టం చేసింది. కేసు దర్యాప్తులో భాగంగా భర్త ఉమామహేశ్వరరావు, 15ఏళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్న కారు డ్రైవర్, ఆస్పత్రి సిబ్బంది, ఇతర అనుమానితులను విచారించారు. ఈ క్రమంలో డ్రైవర్ పాత్రపై అనుమానాలు రావడంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. హత్యకు ముందు డ్రైవర్ సూపర్ మార్కెట్‌లో కారం కొనుగోలు చేసినట్టు సీసీ కెమెరాల్లోని దృశ్యాలను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో కొన్న కారాన్ని సంఘటనా స్థలంలో చల్లినట్లు గుర్తించారు. పోలీసు జాగిలాలను తప్పుదారి పట్టించేందుకు ఇలా చేసినట్లు తేలింది. హత్యచేసి దోచుకుపోయారని చెబుతున్న నగలను కూడా ఇప్పటికే అతని వద్ద స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ కేసులో మృతురాలి భర్తను కాపాడేందుకు మచిలీపట్నంకు చెందిన ప్రముఖ వైద్యుడితో పాటు మెడికల్ డిస్ట్రిబ్యూటర్‌లు రాజకీయ నాయకుల్ని ఆశ్రయించినట్లు చెబుతున్నారు. మృతురాలి భర్తను కేసు నుంచి బయటపడేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పోలీస్ విచారణలో భర్తపై ఒత్తిడి తీసుకురాకుండా ఉండేందుకు భారీ ఎత్తున నగదు ఖర్చు పెట్టినట్టు మచిలీపట్నంలో ప్రచారం జరుగుతోంది. విచారణలో కారు డ్రైవర్ పొంతన లేని సమాధానాలు ఇవ్వడం, కేసు తప్పదోవ పట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాట్టు విమర్శలున్నాయి.
పక్కా ప్రణాళికతో మర్డర్…
వైద్యురాలిని హత్య చేయడానికి మూడు నెలల క్రితమే ప్రణాళిక వేసుకుని దానిని అమలు చేసినట్టు గుర్తించారు. సీసీటీవీలను పనిచేయకుండా చేయడంతో పాటు కుమారుడు ఇంట్లో లేని సమయం చూసి హత్యకు ప్లాన్ చేశారు. భారీ మొత్తంలో నగదు ఇస్తానని ప్రలోభ పెట్టడంతో వైద్యుడి డ్రైవర్ హత్యకు సిద్దపడ్డాడు.
డాక్టర్ ఇంటి పై అంతస్తులో ఒంటరిగా ఉన్న సమయంలో ఆమె తలపై ఇనుప వస్తువుతో మోదడంతో కుప్పకూలిపోయింది. ఈ క్రమంలో అతడి నుంచి తప్పించుకోడానికి జరిగిన పెనుగులాటలో ఆమె చేతిలో ఉమామహేశ్వరరావు తల వెంట్రుకలు చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వీటిని పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపగా అవి డ్రైవర్‌వేనని నిర్ధారణ అయింది. ఇప్పటికే నిందితులు వాడిన వస్తువులు, ఆమె ఒంటిపై ఆభరణాలు పోలీసులు రికవరీ చేసినా హత్యకు పథక రచిన చేసి భర్తను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా దర్యాప్తను ఆలస్యం చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం