AOB Maoist Sympathisers : పోలీసులకు లొంగిపోయిన 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు-in andhra odisha border 700 maoist sympathisers surrender to police ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aob Maoist Sympathisers : పోలీసులకు లొంగిపోయిన 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు

AOB Maoist Sympathisers : పోలీసులకు లొంగిపోయిన 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు

HT Telugu Desk HT Telugu
Sep 18, 2022 07:05 PM IST

Maoist Sympathisers In AOB : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్న తరుణంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోయారు. దీంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.

<p>లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు</p>
లొంగిపోయిన మావోయిస్టు సానుభూతిపరులు (HT_PRINT)

తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ మావోయిస్టుల కదలికలు మొదలవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో 700 మంది మావోయిస్టు సానుభూతిపరులు లొంగిపోవడంతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వీరిలో 300 మంది మిలీషియా సభ్యులు కూడా ఉండటం గమనార్హం. లొంగిపోయిన తర్వాత మావోయిస్టులు ఇచ్చిన దుస్తులను తగులబెట్టి మావోయిస్టు కార్యకలాపాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచింగ్‌పుట్‌ ​​పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పడల్‌పుట్‌, కుసుంపుట్‌, మటంపుట్‌, జోడిగుమ్మ గ్రామాల మిలీషియా సభ్యులు లొంగిపోయారు. దీంతో పాటు ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా భజగూడ, బైసెగూడ, ఖల్‌గూడ, పాత్రపుట్‌, వందేపదర్‌, సంబల్‌పూర్‌, సింధిపుట్‌ ​​గ్రామాలకు చెందిన మిలీషియా సభ్యులు లొంగిపోయారు. కోరాపుట్ డీఐజీ రాజేష్ పండిట్, బీఎస్ఎఫ్ డీఐజీ మదన్‌లాల్, మల్కన్‌గిరి ఎస్పీ నితేశ్ వాధ్వానీ, 65వ బెటాలియన్ సీఓ టీఎస్ రెడ్డి సమక్షంలో మావోయిస్టులు లొంగిపోయారు. ఏఓబీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై జీవన స్రవంతిలోకి వచ్చామని తెలిపారు.

మరోవైపు తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో మావోయిస్టుల కదలికలు ఉన్నట్టు సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రాణహిత, గోదావరి నదుల తీరం వెంబడి తిరుగుతూ వాహనాల తనిఖీలు, ప్రయాణికులను ప్రశ్నిస్తున్నారు. ఆదివాసీ గూడేల్లోని కొన్ని ప్రాంతాల్లో కొన్ని రోజులుగా సోదాలు నిర్వహిస్తున్నారు.

ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. మావోయిస్టుల బృందం ఆదిలాబాద్‌లోకి ప్రవేశించి అంతర్గత ప్రాంతాల్లో తిరుగుతున్నట్లు సమాచారం. అయితే ఇంకోవైపు తగిన కారణాలు లేకుండానే పోలీసు యంత్రాంగం మావోయిస్టుల కదలికల చుట్టూ హైప్ క్రియేట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 10-15 మంది మావోయిస్టుల బృందం ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించినట్లు అంచనాలు ఉన్నాయి. కానీ ఈ ప్రాంతంలో మావోయిస్టుల ఉనికి గురించి నిర్దిష్ట సమాచారం లేదు.

కొంతమంది పోలీసు ఇన్‌ఫార్మర్లు డబ్బు సంపాదించేందుకు మావోయిస్టుల కదలికలకు సంబంధించిన విషయాలను చెబుతున్నారని తెలిసింది. కానీ అందులో వాస్తవం ఎంత అని నిర్ధారించకుండా కేవలం సమాచారాన్ని పంపిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.

Whats_app_banner