Illegal liquor: రూ. 5.47 కోట్ల అక్రమ మద్యం ధ్వంసం చేసిన ఏపీ పోలీసులు
Illegal liquor in Andhra pradesh: అక్రమంగా రవాణా చేసిన మద్యాన్ని పోలీసులు ధ్వంసం చేశారు.
విజయవాడ, సెప్టెంబర్ 15: తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 2.43 లక్షల మద్యం బాటిళ్లను ఆంధ్రప్రదేశ్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు.
రూ. 5.47 కోట్ల విలువైన మద్యం ఈ బాటిళ్లలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ వద్ద మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. పోలీసు ఉన్నతాధికారుల సమక్షంలో మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.
తెలంగాణ నుంచి అక్రమంగా మద్యం బాటిళ్లను రవాణా చేశారని, ఇప్పటి వరకు 2 వేల లీటర్ల అక్రమ మద్యాన్ని ధ్వంసం చేసి 226 కేసులు పెట్టామని విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ పోలీసులు నగర శివార్లలోని చెక్‌పోస్టుల వద్ద ఆకస్మిక దాడులు నిర్వహిస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌కు అక్రమంగా మద్యం తరలిస్తున్నారనే వార్తల నేపథ్యంలో ఈ చర్య తీసుకున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో కర్నూలులో దాదాపు రూ. 2 కోట్ల విలువైన 66,000 మద్యం బాటిళ్లను స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో (ఎస్‌ఈబీ) స్వాధీనం చేసుకుంది.
దేశవ్యాప్తంగా మద్యం అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న వారిపై నిఘా ఉంచాలని ఎస్‌ఈబీ పోలీసులకు సూచించింది.
గత జూన్ నెలలో ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏలూరు జిల్లాలో రూ. 80 లక్షల విలువైన 33,934 అక్రమ మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు.
ఏలూరు పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) రాహుల్ దేవ్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోకి బయటి రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యంపై చర్యలు తీసుకున్నామని, గత రెండేళ్లుగా చర్యలు తీసుకుంటున్నామని, సరిహద్దుల్లో దాడులు నిర్వహిస్తున్నామని తెలిపారు. అక్రమ మద్యం గురించి సమాచారం అందినప్పుడల్లా దానిపై చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.