Liquor : 2 కోట్ల విలువైన మద్యం ధ్వంసం-2crores worth liquor demolished in kurnool district of andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Liquor : 2 కోట్ల విలువైన మద్యం ధ్వంసం

Liquor : 2 కోట్ల విలువైన మద్యం ధ్వంసం

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 08:12 AM IST

కర్నూలు జిల్లాలో రెండు కోట్ల రుపాయల విలువైన మద్యాన్ని రోడ్డు రోలరుతో తొక్కించి ధ్వంసం చేశారు. జిల్లా స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో పరిధిలో 2021-22 సంవత్సరాల్లో స్వాధీనం చేసుకున్న మద్యాన్ని రోడ్డు రోలరుతో తొక్కించి ధ్వంసం చేశారు.

<p>కర్నూలులో పోలీసులు ధ్వంసం చేసిన మద్యం</p>
కర్నూలులో పోలీసులు ధ్వంసం చేసిన మద్యం

ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన మద్యాన్ని కర్నూలు జిల్లాలో పోలీసులు, సెబ్ సిబ్బంది ధ్వంసం చేశారు. దాదాపు2 కోట్ల విలువైన 66 వేల మద్యం బాటిళ్ళను రోడ్డు రోలరుతో తొక్కించి ధ్వంసం చేశారు. 2021 -2022 సంవత్సరాలకు సంబంధించి కర్నూలు స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో స్టేషన్ పరిధిలోని 593 కేసులలో పట్టుబడిన 66 వేల మద్యం బాటిళ్ళను రోలరుతో తొక్కించారు. కర్నూలు మండలం, పంచలింగాల గ్రామం నుండి ఈ. తాండ్రపాడు గ్రామానికి వెళ్లే దారిలో రైల్వే బ్రిడ్జి వద్ద మద్యం బాటిళ్ళను ధ్వంసం చేశారు. పోలీసులు ధ్వంసం చేసిన మద్యంలో ఎక్కువగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించని బ్రాండ్లే ఎక్కువగా కనిపించాయి. మూడేళ్ల క్రితం వరకు ఏపీ లిక్కర్‌ మార్కెట్లలో డిమాండ్ ఉన్న బ్రాండ్లను పొరుగు రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి విక్రయిస్తుండటం స్పష్టమైంది.

yearly horoscope entry point

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి మద్యాన్ని తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించింది. గతంలో పొరుగు రాష్ట్రాల నుంచి ఐదు బాటిళ్ల వరకు తెచ్చుకునేందుకు వీలుండేది. దశల వారీ మద్య నిషేధాన్ని ప్రకటించిన ప్రభుత్వం అందులో భాగంగా పలు ఆంక్షలు విధించింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మద్యపానాన్ని గణనీయంగా తగ్గించేందుకు ధరలు భారీగా పెంచింది. దాదాపు 125శాతం మద్యం ధరల పెరుగుదలతో రకరకాల సమస్యలు తలెత్తాయి.

ఏపీలో మద్యం ధరలు పెరగడంతో పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం తరలింపు పెరిగింది. దీంతో మద్య నిషేధ చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం పోలీసులు, ఎక్సైజ్‌ సిబ్బందితో కలిపి స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. తమిళనాడు, కర్ణాటక, చత్తీస్‌గడ్‌, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలతో సరిహద్దులున్న ఏపీలో పొరుగు రాష్ట్రాల కంటే మద్యం ధరలు అధికంగా ఉన్నాయనే విమర్శలు ఉన్నాయి. దీంతో పాటు ఎక్కువగా వినియోగించే బ్రాండ్లు ఏపీలో అందుబాటులో ఉండటం లేదు. దీంతో రాయలసీమ జిల్లాలకు కర్ణాటక, తమిళనాడు, గోవాల నుంచి మద్యం ప్రవహిస్తోంది.

ఏపీ మద్యం ధరలతో పోలిస్తే గోవాలో మద్యం సగం కంటే తక్కువ ధరలకు ప్రముఖ బ్రాండ్లు లభిస్తుండటంతో ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలకు భారీగా తరలిస్తున్నారు. స్పెషల్‌ ఎన్‌‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో ఏడాది వ్యవధిలో రెండు కోట్ల రుపాయల విలువైన మద్యాన్ని పట్టుకుని ధ్వంసం చేసినా రవాణా మాత్రం ఎక్కడ ఆగట్లేదు. ధరలు, నాణ్యత, బ్రాండ్ల లభ్యత వంటి కారణాలతో పొరుగు రాష్ట్రాల నుంచి అక్రమ తరలింపు యథేచ్ఛగా సాగుతోంది. మరోవైపు మద్యం తరలింపుతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో నాటుసారా తయారీ యథేచ్ఛగా సాగుతోంది.

అధిక ధరల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు నాటుసారా వినియోగం వైపు మళ్లుతున్నారనే విమర్శలు ఉన్నాయి. మద్యం వినియోగాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు పేదల జేబులు ఖాళీ చేసేలా ఉందనే ఆరోపణ కూడా ఉంది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో వినియోగదారుడు కోరిన మద్యం కాకుండా అందుబాటులో ఉండే రకాన్ని మాత్రమే కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. వైన్‌షాపుల్లో ఏ రోజుకారోజు కొత్త బ్రాండ్లు ప్రత్యక్ష మవుతుండటంతో పేర్లతో కాకుండా మద్యం ధరల ఆధారంగా కొని తాగడానికి జనం అలవాటు పడ్డారు.

Whats_app_banner