IAS Praveen Prakash On GER : ఆ డేటా తప్పు అయితే ఐఏఎస్‌కు రాజీనామా చేస్తా!
IAS Praveen Prakash On GER: వంద శాతం జీఈఆర్(Gross Enrolment Ratio) పూర్తయ్యాక డేటాబేస్ తప్పు ఉందనిగాని, ఏ పిల్లలైనా ఈ డేటాబేస్‌లో లేరనిగానీ నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమన్నారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్. సెప్టెంబరు 4లోపు వంద శాతం స్థూల ప్రవేశాల నిష్పత్తి సాధించాలన్నారు.
Senior IAS officer Praveen Prakash: విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తిపై కీలక వ్యాఖ్యలు చేశారు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్. సెప్టెంబర్ 2005 నుంచి ఆగస్టు 2018 మధ్య జన్మించిన వారంతా రాష్ట్రంలోని ఏదో ఒక పాఠశాల/కాలేజీలో నమోదై ఉండాలని స్పష్టం చేశారు. శుక్రవారం సచివాలయంలో విద్యాశాఖ అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... దేశంలో విద్యార్థుల నమోదులో నూరు శాతం స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) సాధించిన తొలిరాష్ట్రంగా ఏపీ నిలవాలని ఆకాంక్షించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్లు, ఉపాధ్యాయులు, జూనియర్ లెక్చరర్లు, జిల్లా అధికారులు అందరూ కలిసి సెప్టెంబరు 4వ తేదీలోపు వంద శాతం స్థూల ప్రవేశాల నిష్పత్తి (జీఈఆర్) సాధించాలని సూచించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 63,993 మంది వాలంటీర్లు వంద శాతం జీఈఆర్ పూర్తి చేశారని పేర్కొన్నారు. 100 శాతం జీఈఆర్ పూర్తయ్యాక డేటాబేస్ తప్పు ఉందనిగాని... ఏ పిల్లలైనా ఈ డేటాబేస్‌లో నమోదు కాలేదని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ జీఈఆర్ పై దృష్టి పెట్టాలని సూచించారు. జీఈఆర్ సాధించడంలో ఎక్కడా పొరపాట్లు జరగకూడదని, పాదర్శకంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు.
“రాష్ట్రంలొ ఇంటర్ లోపు వయస్సు ఉన్న ప్రతి చిన్నారి... విద్యార్ది వివరాలు పక్కాగా నమోదు చేయాలి. ప్రతి పిల్లల వివరాలు ఖచ్చితంగా ప్రభుత్వం వద్ద డేటా బేస్‌లో ఉండే విధంగా నిబద్దతో సర్వే చేసి డేటా తయారు చేయాలి. తప్పులు లేకుండా డేటా అందరు తయారు చేస్తే ప్రపంచం దృష్టి ఆంధ్రప్రదేశ్‌పై పడుతుంది. అందరు నిజాయతీతో డేటాను సిద్దం చేసే దానిపై విద్యాశాఖ ఉన్నతాధికారిగా నేను తప్పులు చూపించమని మీడియా వేదికగా ఛాలెంజ్ చేస్తాను. అంతకు ముందు అందరు నిజాయతీగా పనిచేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నా సోషల్ మీడియాలో ఛాలెంజ్ పోస్టు పెడితే ఇక తాను వెనక్కు వెళ్ళడం ఉండదు. ఎందుకంటే తనపై ఉన్న నమ్మకాన్ని తాను పొగొట్టుకోలేను” అని వీడియోలో చెప్పారు.