YS Avinash Reddy : 7 గంటల పాటు అవినాష్ రెడ్డి విచారణ, హత్య జరిగిన రోజు వాట్సాప్ కాల్స్ పై సీబీఐ ఆరా-hyderabad ys viveka murder case mp avinash reddy questioned cbi enquired whats app calls ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Avinash Reddy : 7 గంటల పాటు అవినాష్ రెడ్డి విచారణ, హత్య జరిగిన రోజు వాట్సాప్ కాల్స్ పై సీబీఐ ఆరా

YS Avinash Reddy : 7 గంటల పాటు అవినాష్ రెడ్డి విచారణ, హత్య జరిగిన రోజు వాట్సాప్ కాల్స్ పై సీబీఐ ఆరా

Bandaru Satyaprasad HT Telugu
Jun 03, 2023 08:13 PM IST

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డిని సుమారు 7 గంటలపాటు విచారించిన సీబీఐ... హత్య జరిగిన రోజు వాట్సాప్ కాల్స్ పై ఆరా తీసింది.

ఎంపీ అవినాష్ రెడ్డి
ఎంపీ అవినాష్ రెడ్డి

YS Avinash Reddy : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు సుమారు 7 గంటల పాటు ప్రశ్నించారు. వివేకా హత్య రోజు అవినాష్ రెడ్డి వాట్సాప్ కాల్స్‌పై సీబీఐ విచారించింది. అదేవిధంగా అవినాష్ రెడ్డి వాంగ్మూలాన్ని రికార్డు చేసినట్లు తెలుస్తోంది. ప్రతి శనివారం సీబీఐ విచారణకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశించడంతో ఇవాళ ఎంపీ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య జరిగిన అర్ధరాత్రి టైంలో అవినాష్ రెడ్డి వాట్సాప్ యాక్టివ్‌గా ఉందన్న అంశాన్ని కౌంటర్ అఫిడవిట్‌లో సీబీఐ అధికారులు ప్రస్తావించారు. దీనిపై అవినాశ్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించినట్లు సమాచారం. ఉదయం 10 గంటలకు విచారణ ప్రారంభం అవ్వగానే అవినాష్ రెడ్డి వ్యక్తిగత మొబైల్‌ను సీబీఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వివేకా హత్య జరిగిన రోజు వాట్సాప్ కాల్స్, వాట్సాప్ చాట్ సంబంధించిన అంశాలపైన సీబీఐ అధికారులు విచారణ చేపట్టారు.

ఆ ఆయుధం ఎక్కడుందో అవినాష్ రెడ్డికి తెలుసా?

మరో ఆరు అంశాలపై అవినాష్ రెడ్డి స్పష్టత ఇవ్వాల్సి ఉందని గతంలో సీబీఐ తెలిపింది. వీటి ఆధారంగా సీబీఐ విచారణ సాగుతున్నట్లు తెలుస్తోంది. వచ్చే శనివారం కూడా ఇదే స్థాయిలోనే విచారణ జరిగే అవకాశం ఉంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ చేసి, వాంగ్మూలాన్ని రికార్డు చేస్తున్నారు అధికారులు. వివేకా హత్య సమయంలో వాడిన ఆయుధాన్ని సునీల్‌యాదవ్ దాటిపెట్టాడన్న అభియోగాలు ఉన్నాయని సీబీఐ తెలిపింది. ఈ ఆయుధం ఎక్కడ దాచిపెట్టారన్న అంశం అవినాష్ రెడ్డి తెలుసని సీబీఐ భావిస్తుంది. ఆ ఆయుధానికి సంబంధించి గతంలో కూడా సీబీఐ విచారణ చేసింది. ఇప్పుడు మరోసారి ఆయుధం గురించి అవినాష్ రెడ్డి నుంచి సమాచారాన్ని రాబట్టేందుకు సీబీఐ ప్రయత్నిస్తుంది.

వేసవి సెలవుల తర్వాతే ముందస్తు బెయిల్ పై పిటిషన్లు

ఉమాశంకర్ రెడ్డి సోదరుడైన జగదీశ్వర్ రెడ్డి కూడా ఇవాళ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో జగదీశ్వర్ రెడ్డి పాత్రపై కొంత అనుమానం ఉండంతో వివేకా ఆస్తులకు సంబంధించి, భూ వ్యవహారంలో జగదీశ్వర్ రెడ్డికి, ఉమాశంకర్ రెడ్డికి, వివేకాకు మధ్య కొంత వివాదం ఉందనే సమాచారం కూడా ఉండడంతో సీబీఐ దర్యాప్తు చేస్తుంది. ఈ వివాదానికి సంబంధించి జగదీశ్వర్ రెడ్డిని విచారించి సీబీఐ అధికారులు స్టేట్మెంట్ రికార్డు చేశారు. జగదీశ్వర్ రెడ్డిని సీబీఐ అధికారులు రెండు గంటలు మాత్రమే విచారించారు. ప్రస్తుతం సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు కారణంగా వెకేషన్ బెంచ్‌లు మాత్రమే విచారణ జరుపుతున్నాయి. అత్యవసర కేసులు అయితేనే వెకేషన్ బెంచ్ లు విచారిస్తాయి. అందుకే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై సీబీఐ, సునీత సుప్రీంకోర్టుకు వెళ్లలేదని సమాచారం. వేసవి సెలవుల తర్వాతనే వారు పిటిషన్లు వేసే అవకాశం ఉందని తెలుస్తోంది.

ప్రత్యేక కేటగిరీ ఖైదీగా భాస్కర్ రెడ్డి

వివేకా హత్యకేసులో అరెస్టైన ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని ప్రత్యేక కేటగిరి విచారణ ఖైదీగా చూడాలని సీబీఐ కోర్టు సూచించింది. ఈ మేరకు హైదరాబాద్‌ జిల్లా మేజిస్ట్రేట్‌కు సీబీఐ న్యాయస్థానం సిఫార్స్ చేసింది. ఈ కేసులో అరెస్టైన భాస్కర్ రెడ్డి.. తనను ప్రత్యేక కేటగిరీ ఖైదీగా పరిగణించాలని సీబీఐ కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను సీబీఐ కోర్టు అంగీకరించింది. అవినాష్ తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి చంచల్ గూడ జైల్లో ఉన్నారు.