NTR District : భార్యని గొడ్డలితో నరికి చంపిన భర్త - వివాహేతర సంబంధమే కారణమా..?
NTR District Crime News : ఎన్టీఆర్ జిల్లాలో దారుణం వెలుగు చూసింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొడ్డలితో నరికి చంపాడు భర్త. కేసు నమోదు చేసుకున్న పోలీసులు…దర్యాప్తు చేస్తున్నారు.
NTR District Crime News : కట్టుకున్న భార్యని గొడ్డలితో నరికి చంపాడు ఓ భర్త. ఈ దారుణ ఘటన ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు జుజ్జూరు గ్రామంలో చోటు చేసుకుంది. అర్ధరాత్రి సమయంలో నిద్రిస్తుండగా భార్యను గొడ్డలితో నరికి హత్య చేశాడు.
ప్రాథమిక వివరాల ప్రకారం…. జుజ్జూరు గ్రామానికి చెందిన మేడి వెంకటేశ్వరరావు, నళినీ భార్య భర్తలు. వీరి మధ్య కొంతకాలంగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అర్ధరాత్రి రెండు గంటల సమయంలో గొడ్డలితో నళినీ మెడపై నరికి హత్య చేశాడు వెంకటేశ్వరరావు. ఆ తర్వాత అక్కడ్నుంచి పరారీ అయ్యాడు. అయితే హత్యకు వివాహేతర సంబంధం కారణమై ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ పరిధిలో విషాద ఘటన వెలుగు చూసింది. ప్రసాదంపాడులో కన్నతల్లి తన నాలుగేళ్ల కుమార్తెను వైరుతో ఉరేసి చంపేసింది. అనంతరం కత్తితో పీక కోసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్త ఇచ్చిన సమాచారం మేరకు విజయవాడ పటమట పోలీసులు ఘటన స్థలికి చేరుకొని…. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వరంగల్ డ్యాన్సర్ ఎం.అశ్విని(20) మృతి చెందింది. యువతి ప్రయాణిస్తున్న బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డ్యాన్సర్ అశ్వినితో పాటు బైక్ ఉన్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం తెల్లవారుజామున పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడు సమీపంలో వీరిద్దరూ ప్రయాణిస్తు్న్న బైక్ కు ప్రమాదం జరిగింది. సోమవారం రాత్రి రొంపిచర్లలో వినాయక నిమజ్జనం కార్యక్రమంలో నరసరావుపేటకి చెందిన సోనీ ఈవెంట్స్ డ్యాన్స్ ప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ లో నర్సంపేటకు చెందిన ఎం.అశ్విని డ్యాన్స్ చేసేందుకు వచ్చింది.
ఈ కార్యక్రమం ముగిసిన తర్వాత అశ్విని వరంగల్ కు చెందిన మున్నా అనే యువకుడి బైక్ పై తిరుగుప్రయాణం అయింది. ఈ క్రమంలో తుంగపాడు వద్దకు రాగానే వీరి బైక్ అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న సిమెంట్ స్తంభాన్ని వేగంగా ఢీకొట్టింది. బైక్ వెనుక కూర్చొన్న అశ్విని రోడ్డు పక్కన కాలువలో పడి తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. బైక్ నడిపిన మున్నాకు తీవ్ర గాయాలయ్యాయని తెలుస్తోంది. ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. అశ్విని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన యువకుడ్ని కూడా ఆసుపత్రికి తరలించారు. యువతి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.