Flood Relief Released: ముంపు బాధితుల ఖాతాలకు చేరిన వరద సాయం.. ఎలా తెలుసుకోవాలంటే?-how to know the flood relief that has reached the beneficiary accounts ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Flood Relief Released: ముంపు బాధితుల ఖాతాలకు చేరిన వరద సాయం.. ఎలా తెలుసుకోవాలంటే?

Flood Relief Released: ముంపు బాధితుల ఖాతాలకు చేరిన వరద సాయం.. ఎలా తెలుసుకోవాలంటే?

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 26, 2024 05:58 AM IST

Flood Relief Released: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన పరిహారం బాధితుల ఖాతాలకు చేరుతోంది. బుధవారం ఉదయం విజయవాడలో రూ.600కోట్ల వరద సాయాన్ని ముఖ్యమంత్రి విడుదల చేయగా సాయంత్రం నుంచి వరద ముంపు బాధితుల ఖతాలకు నిర్దేశిత మొత్తం జమ అవుతోంది.గురువారం నగదు అందుకున్న వారికి ధృవీకరణ సందేశాలు పంపుతారు.

వరద బాధితులకు  చేరిన ప్రభుత్వ సాయం
వరద బాధితులకు చేరిన ప్రభుత్వ సాయం

Flood Relief Released: ఏపీ ప్రభుత్వం వరద బాధితులకు ప్రకటించిన ఆర్థిక సాయం ముంపు బాధితులకు ఖాతాలకు ప్రత్యక్ష బదిలీ పథకం ద్వారా నేరుగా చేరుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో విజయవాడ నగరాన్ని ముంచెత్తిన వరదల్లో ప్రజలు పెద్ద ఎత్తున నష్టపోయారు. అల్పపీడన ప్రవాహంతో కృష్ణా, గోదావరి బేసిన్‌లలోని పలు ప్రాంతాల్లోన తీవ్ర నష్టం వాటిల్లింది.

బుడమేరుకు వచ్చిన వరదలతో ప్రధానంగా విజయవాడ నగరం పది రోజుల పాటు ముంపుకు గురైంది. నగరంలోని 32 డివిజన్లు పూర్తిగా జలమయం అయ్యాయి. 179 వార్డు సచివావాలయాల పరిధిలో దాదాపు ఆరు లక్షల మంది ప్రజలు వరద ముంపుకు గురయ్యారు. చాలామంది కట్టుబట్టలతో నిరాశ్రయులుగా మిగిలారు.

సర్వం కోల్పోయిన బాధితుల్ని ఆదుకోడానికి ఏపీ ప్రభుత్వం ఉదారంగా స్పందించింది. వరద బాధితులను ఆదుకోడానికి కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు మించి నష్టపరిహారాన్ని ప్రకటించింది. వరదల్లో మునిగి పోయిన వారిలో ఎక్కువ మంది నిరుపేదలు, రోజువారీ కార్మికులు ఉండటంతో వారిని ఆర్థికంగా ఆదుకోవాలని నిర్ణయించింది. మొదటి అంతస్తులోపు ఉన్న అన్ని నివాసాలు పూర్తిగా నీట మునిగిపోవడంతో వారికి రూ.25వేల పరిహారం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రెండో అంతస్తు నుంచి ఆపైన ఉండే వారికి రూ.10వేలు చొప్పున చెల్లిస్తున్నారు.

వరదల్లో మునిగి పోయిన బైకులకు రూ.3వేలు, ఆటోలకు పదివేలు, కిరాణా దుకాణాలకు రూ.25వేల చొప్పున పరిహారం చెల్లిస్తున్నారు. ఈ మొత్తం ఆధార్ ఆధారిత నగదు చెల్లింపుల ద్వారా లబ్దిదారుడి బ్యాంకు ఖాతాలకు నేరుగా జమ చేస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో నగదు విడుదల చేసిన వెంటనే రాష్ట్ర ఖజానా నుంచి నేషనల్ పేమెంట్స్‌ కార్పోరేషన్‌కు రూ 500కోట్లను బదిలీ చేశారు. ప్రభుత్వం ఆర్‌బిఐకు అందించిన జాబితా ప్రకారం లబ్దిదారులకు బుధవారం సాయంత్రం నుంచి చెల్లింపులు మొదలయ్యాయి.

ఎలా తెలుస్తుంది అంటే..

వరద బాధితులకు పరిహారం చెల్లింపు విషయంలో ఏపీ ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తోందని అధికారులు చెబుతున్నారు. విమర్శలకు తావివ్వకుండా, ఎవరి ప్రమేయం లేకుండా నేరుగా బాధితుల ఖాతాలకు నగదు చెల్లింపులు జరుపుతున్నారు. బుధవారం రాత్రికే మెజార్టీ బాధితులకు నగదు చెల్లింపులు పూర్తయ్యాయి. గురువారం ఉదయంలోగా అందరి ఖాతాలకు చెల్లింపులు పూర్తవుతాయని రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా హిందుస్తాన్‌ టైమ్స్‌కు తెలిపారు.

ఆధార్‌ ఆధారిత చెల్లింపులు పూర్తైన వెంటనే ఆర్‌బిఐ నుంచి పరిహారం చెల్లింపుల ధృవీకరణ సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికిి చేరుతుందని, దాని ఆధారంగా వరద ముంపు పరిహారం చెల్లింపుకు సంబంధించిన సందేశాలను లబ్దిదారుల మొబైల్ నంబర్లకు పంపనున్నట్టు సిసోడియా వివరించారు.

వరద పరిహారం చెల్లింపు విషయంలో ప్రభుత్వం పలు జాగ్రత్తలు తీసుకుంది. వరదల్లో నష్టపోయిన వాహనాలకు సంబంధించిన పరిహారాన్ని వాటి యజమానుల ఖాతాలకు నేరుగా జమ చేస్తోంది. వాహనం రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన మొబైల్ నంబర్లకు పరిహారం జమ చేస్తున్నారు.

ఆధార్‌తో కార్డుతో లింకైన బ్యాంకు ఖాతాలు, ఆధార్‌ బేస్డ్ పేమెంట్‌లను అమోదించిన ఖాాతాలు పరిహారం జమ చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పరిహారం చెల్లింపు కోసం పలుమార్లు క్షేత్ర స్థాయిలో ఎన్యుమేరషన్ నిర్వహించినట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

తమ పేర్లు నమోదు కాలేదని 18వేల మంది ఫిర్యాదు చేయడంతో వాటిని కూడా తాసీల్దర్‌ స్థాయి అధికారులతో వెరిఫై చేయిస్తున్నారు. డబుల్ ఎంట్రీలు తొలగించిన తర్వాత 13,500 ఫిర్యాదుల్ని ఇంకా పరిశీలించాల్సి ఉందని ప్రకటించారు. తిరస్కరించిన ఫిర్యాదులకు కూడా సహేతుకమైన సమాధానాలు చెప్పాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. మరోవైపు నగదు పరిహారం అందుకున్న వారి వ్యక్తిగత మొబైల్ నంబర్లకు గురువారం నుంచి ప్రభుత్వం సందేశాలను పంపించనుంది.

Whats_app_banner

సంబంధిత కథనం