Fibergrid Scam Attachments: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌-home ministry issues orders attaching properties of accused in fiber grid case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Fibergrid Scam Attachments: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌

Fibergrid Scam Attachments: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌

Sarath chandra.B HT Telugu
Nov 02, 2023 09:44 AM IST

Fibergrid Scam Attachments: ఆంధ్రప్రదేశ్‌లో వెలుగు చూసిన ఫైబర్‌ గ్రిడ్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రూ.114కోట్ల రుపాయల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై నిందితులకు చెందిన ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఫైబర్ గ్రిడ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌
ఫైబర్ గ్రిడ్‌ కేసులో నిందితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌

Fibergrid Scam Attachments: ఫైబర్‌ గ్రిడ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసకుంది. ఫైబర్‌ నెట్‌ ప్రాజెక్టు మొదటి దశలో అక్రమాలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో నిందితుల ఆస్తులను అటాచ్‌ చేస్తూ ఏపీ హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు జీవో 180ను హోంశాఖ కార్యదర్శి హరీష్ గుప్తా జారీ చేశారు.

yearly horoscope entry point

సిఐడి ఏడీజీ నేతృత్వంలో జరిగిన దర్యాప్తులో కుట్రకు సంబంధించిన వాస్తవాలు వెలుగు చూశాయని, నేరపూరిత చర్యల వల్ల ప్రభుత్వానికి రూ.114కోట్ల రుపాయల నష్టం వాటిల్లేలా చేశారని సిఐడి గుర్తించింది.ఏపీఎస్‌ఎఫ్‌ఎల్ ఎండి మధుసూదన్ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు.

ఫైబర్‌ నెట్‌ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏ25 గా ఉన్నారు.చంద్రబాబు సహకారంతో ఏ1గా ఉన్న వేమూరి హరికృష్ణ ప్రసాద్‌, ఏ11గా ఉన్న టెరా సాఫ్ట్‌వేర్‌ లిమిటెడ్‌ సంస్థ డైరెక్టర్ తుమ్మల గోపీచంద్‌ కుట్రకు పాల్పడ్డారని పేర్కొన్నారు. నకిలీ ఎక్స్‌పీరియన్స్ సర్టిఫికెట్స్‌తో పనులు దక్కించుకున్నారని సిఐడి దర్యాప్తులో వెల్లడైంది.

ప్రభుత్వ ప్రాజెక్టును దక్కించుకునేందుకు అక్రమాలకు పాల్పడినట్లు వెల్లడైంది. విప్లవ్‌కుమార్‌, విజయ్‌కుమార్‌ రామ్మూర్తి, కనుమూరి వెంకటేశ్వరరావు వంటి వారికి చెందిన సంస్థలు కుట్రలో పాల్గొన్నాయని తెలిపారు. నాసిరకం పరికరాలతో ప్రభుత్వాన్ని మోసం చేశారని టెరాసాఫ్ట్‌కు నిధుల విడుదల ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.114కోట్ల నష్టం వాటిల్లినట్టు పేర్కొన్నారు.

సిఐడి దర్యాప్తు ఆధారంగా కుట్రలో పాల్గొన్న పలు సంస్థలకు చెందిన స్థిరాస్తుల అటాచ్‌మెంట్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీటిలో ఏడు స్థిరాస్తులను అటాచ్ చేయాలని సిఐడి అధికారులు ప్రతిపాదించారు. సీఐడీ ప్రతిపాదనకు హోంశాఖ ఆమోదం తెలుపుతూ జీవో విడుదల చేసింది.

ఫైబర్ నెట్ స్కాంలో నిందితులైన టెర్రా సాఫ్ట్ ఎండీ తుమ్మల గోపీచంద్ కి ఆస్తులతోపాటు పలు కంపెనీల ఆస్తులు అటాచ్ చేయాలని సిఐడి హోంశాఖను కోరింది. తుమ్మల గోపీచంద్, ఆయన భార్య పావని పేర్లపై హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ, యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్ కాలనీ, చిన్న మంగళారంలో ఇల్లు, వ్యవసాయ క్షేత్రాలు అటాచ్ చేశారు.

ఇదే కేసులో నిందితులైన నెటాప్స్ ఫైబర్ సొల్యూషన్స్ డైరక్టర్ కనుమూరి కోటేశ్వరరావుకి చెందిన గుంటూరు, విశాఖ కిర్లంపూడి లే అవుట్ లోని ఇళ్లు అటాచ్ చేశారు. గుంటూరులో ఇంటిస్థలం, విశాఖపట్నంలో ఓ ప్లాట్, హైదరాబాద్ లోని 4 ప్లాట్లు, రంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ భూమిని హోంశాఖ అటాచ్‌ చేసింది. స్థిరాస్తుల అటాచ్‌మెంట్ కు అనుమతించాలని కోరుతూ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో సీఐడీ పిటిషన్ దాఖలు చేయనుంది.

Whats_app_banner