Tirumala Vaikunta Ekadashi : తిరుమలలో ముక్కోటి ఏకాదశి వేడుకలు…భక్తుల కిటకిట
Tirumala Vaikunta Ekadashi ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైష్ణవ ఆలయాలు భక్తులతో కిటకిట లాడుతున్నాయి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి స్వామి వారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. అర్థరాత్రి నుంచి క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. టీటీడీ గత వారం రోజులుగా ముక్కోటి ఏకాదశి కోసం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఆర్జిత సేవల్ని రద్దు చేసింది. విఐపి దర్శనాలు లేకుండా సామాన్యులకు స్వామి వారి దర్శనం కల్పిస్తోంది.
Tirumala Vaikunta Ekadashi ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి పుణ్య క్షేత్రం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారు జాము నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. తెలంగాణలోని యాదాద్రితో పాటు, ద్వారకా తిరుమల, సింహాచలం వంటి పుణ్య క్షేత్రాల్లో కూడా ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది.
తిరుమలలో శ్రీవారి దర్శనానికి అర్ధరాత్రి 12.05 గంటలకు దర్శనాలను ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా అత్యంత ప్రముఖులు, ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ధర్మకర్తల మండలి సభ్యులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఉదయం 5 నుంచి 6 గంటల వరకు శ్రీవాణి ద్వారా టోకెన్లు పొందిన భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇక ఉదయం 6 గంటల నుంచి సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. తిరుమలలో ఈ నెల 11 వరకు వైకుంఠద్వారం ద్వారా భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించేలా తితిదే ఏర్పాట్లు చేసింది.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తమిళనాడు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండే, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి, రోజా, ఉషశ్రీ, మేరుగ నాగార్జున, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్, మల్లారెడ్డి తదితర ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నవారిలో ఉన్నారు.
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని రెండు రాష్ట్రాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటికిటలాడుతున్నాయి. తెల్లవారు నుంచే భక్తులు దేవాలయాలకు పోటెత్తారు. తిరుమల, యాదాద్రి, అన్నవరం, భద్రచలం, ద్వారక తిరుమల, మంగళగిరి, విజయవాడ, అనంతపురం, ధర్మపురి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి.
భద్రాద్రి ఆలయానికి కూడా వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు పోటెత్తారు. ఉత్తర ద్వారం ద్వారా రామయ్యను దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. దీంతో ఆలయం భక్తజనసంద్రంగా మారింది. సింహాచలంలో స్వామివారి ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభమయ్యాయి. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక గజపతిరాజు తొలిదర్శనం చేసుకున్నారు.
జనవరి 2వ తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని టిటిడి స్థానిక ఆలయాలలో భక్తుల సౌకర్యార్థం విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. అన్ని ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు, రంగవల్లులు తీర్చిదిద్ది వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో…
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 8.30 నుండి 10 గంటల వరకు శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో కల్యాణోత్సవం, బ్రేక్ దర్శనం, అష్టదళ పాదపద్మారాధన సేవలను టిటిడి రద్దు చేసింది. జనవరి 3వ తేదీ ద్వాదశి నాడు ఉదయం 7 నుండి 9 గంటల వరకు శ్రీసుదర్శన చక్రత్తాళ్వార్‌కు తిరుమంజనం, చక్రస్నానం జరుగనుంది.
శ్రీనివాసమంగాపురంలో …
జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువజామున 12.05 గంటల నుండి 2 గంట వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. వేకువజామున 2 నుండి రాత్రి 8.30 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. ఈ సందర్భంగా జనవరి 2న ఆర్జిత కల్యాణోత్సవం రద్దు కానున్నాయి.
అదేవిధంగా జనవరి 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 4 నుండి 6 గంటల వరకు ధనుర్మాస కైంకర్యాలు, తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం తోమాల సేవ, కొలువు, పంచాంగ శ్రవణం నిర్వహిస్తారు. ఉదయం 10 నుండి 11 గంటల వరకు చక్రస్నానం నిర్వహిస్తారు.
అప్పలాయగుంటలో ….
అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేకువ జామున 3 నుండి 4 గంటల వరకు తిరుప్పావైతో స్వామివారిని మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు నిర్వహిస్తారు. ఉదయం 5 నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు తిరువీధి ఉత్సవం జరగనుంది. అనంతరం రాత్రి కైంకర్యాలు నిర్వహిస్తారు.
జనవరి 3న వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. తిరుపతిలోని గోవిందరాజస్వామివారి ఆలయం, కోదండరామాలయం, చంద్రగిరిలోని కోదండరామాలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయం, పిఠాపురంలోని పద్మావతి సమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కీలపట్ల కోనేటిరాయస్వామివారి ఆలయం, బెంగుళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, అమరావతిలలో వేంకటేశ్వరస్వామివారి ఆలయాల్లో వైకుంఠ ఏకాదశికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
టాపిక్