Andhra pradesh Rains: తడిచి ముద్దైన ఏపీ, రాష్ట్రమంతటా భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న వాగులు… అర్థరాత్రి సిఎం సమీక్ష-heavy rains drenched ap torrential rains across the state overflowing rivers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh Rains: తడిచి ముద్దైన ఏపీ, రాష్ట్రమంతటా భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న వాగులు… అర్థరాత్రి సిఎం సమీక్ష

Andhra pradesh Rains: తడిచి ముద్దైన ఏపీ, రాష్ట్రమంతటా భారీ వర్షాలు, పొంగి ప్రవహిస్తున్న వాగులు… అర్థరాత్రి సిఎం సమీక్ష

Sarath chandra.B HT Telugu
Jul 19, 2024 06:46 AM IST

Andhra pradesh Rains: ఏపీలో వానలు దంచి కొడుతున్నాయి. గత మూడు నాలుగు కురుస్తున్న భారీ వర్షాలతో రాష్ట్రమంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాల్లో బారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి.

వెలేరుపాడు మండలం నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో  రక్షిస్తున్న దృశ్యం
వెలేరుపాడు మండలం నారాయణపురం కట్ట మైసమ్మ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల చిక్కుకున్న వారిని హెలికాప్టర్ సాయంతో రక్షిస్తున్న దృశ్యం

Andhra pradesh Rains: ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలతో తడిచి ముద్దవుతోంది. గత కొద్ది రోజులుగా వాన జాడ లేక ఆందోళన ఉన్న రైతాంగం వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అవుతోంది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఐఎండి సూచనల ప్రకారం పశ్చిమమధ్య మరియు దానిని ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఇది రానున్న రెండుమూడు రోజుల్లో మరింత బలపడి వాయువ్య దిశగా ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉందన్నారు.

అల్ప పీడన ప్రభావంతో శుక్రవారం ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. అలాగే విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

శనివారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి సీతారామరాజు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నెల్లూరు, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ప్రజలు వరద ప్రవహించే వాగులు,కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్లు క్రింద, పోల్స్, టవర్స్ క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు.

గురువారం సాయంత్రం 7 గంటల నాటికి ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం లో137మిమీ, కొయ్యలగూడెంలో 111మిమీ, కోనసీమ జిల్లా మండపేటలో 96మిమీ, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92మిమీ, నిడదవోలులో 91మిమీ, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో 78మిమీ చొప్పున వర్షపాతం నమోదైందన్నారు. 18 ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదైంది.

గురువారం కోస్తాంధ్రలో అక్కడక్కడ, ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో కొన్ని చోట్ల కుండపోతగా వాన పడింది. ఉదయం 8 నుంచి రాత్రి 7 గంటల వరకు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో 137.25 మి.మీ, కొయ్యలగూడెంలో 111, కోనసీమ జిల్లా మండపేటలో 96.75, తూర్పుగోదావరి జిల్లా కడియంలో 92, నిడదవోలులో 91, తాడేపల్లిగూడెంలో 95.8, కూనవరంలో 74, పెంటపాడులో 73.5, కొవ్వూరులో 71.25 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బంగాళాఖాతంలో గురువారం ఏర్పడిన అల్పపీడనం రాత్రికి బలపడి తీవ్ర అల్పపీడనంగా మారినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది.

ఇది వాయువ్యంగా పయనించి శుక్రవారం నాటికి వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ప్రవేశించి వాయుగుండంగా బలపడుతుందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత వాయువ్యంగా పయనించి శనివారం ఒడిశాలో తీరం దాటుతుందని పేర్కొంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండడంతో గురువారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.

కొండవాగులో కారు..రక్షించిన స్థానికులు..

భారీ వర్షాల కారణంగా ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం కొండవాగు ఉధృతిలో ఒక కారు కొట్టుకుపోయింది. రాజమహేంద్రవరం నుంచి వేలేరుపాడు మండలం రుద్రంకోటకు వెళ్తుండగా కొండ వాగు ప్రవాహంలో కారు కొట్టుకుపోయింది. ఇందులో ముగ్గురు పెద్దలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కారు నీటి ప్రవాహంలో కొందదూరం వెళ్లిపొదల్లో చిక్కుకుంది. గమనించిన గ్రామస్థులు హుటాహుటిన భారీ మోకులు, తాళ్లతో నీళ్లలో ఈదుకుంటూ వెళ్లి వారిని కాపాడారు.

సిఎం టెలికాన్ఫరెన్స్‌…

రాష్ట్రంలో వర్షాలు‌ తీవ్రంగా నమోదు కావడంతో అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు అలర్ట్‌ చేశారు. గురువారం రాత్రి సీఎంవో అధికారులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఏలూరు జిల్లా కలెక్టర్, ఎస్పీలతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పెద్దవాగుకు రెండు చోట్ల గండిపడడంపై పలు సూచనలు చేశారు. ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా చూడాలని అధికారులకు సీఎం ముందస్తు ఆదేశాలు జారీ చేశారు. ఏపీలో 15 గ్రామాలు, తెలంగాణలో 3 గ్రామాల్లో వరద నీరు చేరే ప్రమాదం ఉండటంపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.

Whats_app_banner