Guntur Park Selfie Fight : గుంటూరు పార్కులో సెల్ఫీల రగడ, జుట్టుపట్టుకుని కొట్టుకున్న యువతులు
Guntur Park Selfie Fight : గుంటూరు గాంధీ పార్కులో సెల్ఫీల కోసం మహిళలు గొడవపడ్డారు. జుట్టుపట్టుకుని దాదాపు గంటపాటు తీవ్రంగా కొట్టుకున్నారు. ఈ వీడియోలు వైరల్ అవుతున్నాయి.
Guntur Park Selfie Fight : సెల్ఫీలో కోసం అమ్మాయిలు ఘోరంగా కొట్టుకున్న ఓ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటన ఆదివారం గుంటూరు నగరంలో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం సరదాగా పార్కులో గడపడానికి వచ్చిన అమ్మాయిల మధ్య సెల్ఫీ కోసం ఓ చిన్న వివాదం మొదలై కొట్టుకునే స్థాయికి వెళ్లింది. గుంటూరులో ఇటీవలే ప్రారంభించిన గాంధీ పార్కులో ఈ ఘటన చోటుచేసుకుంది. పార్కులోని ఓ లొకేషన్ వద్ద సెల్ఫీలు, రీల్స్ తీసుకునేందుకు యువతులు పోటీ పడ్డారు. ఈ క్రమంలో వారి మధ్య ఘర్షణ తలెత్తి జుట్లు పట్టుకుని ఘోరంగా కొట్టుకున్నారు. పలువురు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా జుట్లు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. పార్కులోని కొందరు ఈ ఘటనను వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. ఈ వీడియోలు వైరల్ అయ్యాయి.
అసలేం జరిగింది?
గుంటూరు నగరంలోని గాంధీ పార్కును ఆధునీకరించి ఈ నెల 6న తిరిగి ప్రారంభించారు. నగరంలో పెద్ద పార్కు కావడంతో ఆదివారాలు, సెలవు రోజుల్లో పార్కు సందడిగా మారుతుంది. పిల్లలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పార్కుకు వచ్చి కాసేపు సేదతీరుతుంటారు. ఆధునీకరించిన పార్కులో చిన్న పిల్లల కోసం గేమ్ జోన్, టాయ్ ట్రైన్, సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చే స్థానికులు సెల్ఫీ పాయింట్ వద్ద సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతుంటారు. చిన్నారులతో పాటు పెద్దలు సైతం వింగ్స్ ఆకారంలోని సెల్ఫీ పాయింట్ వద్ద ఫొటో దిగేవందుకు పోటీ పడుతున్నారు. తాజాగా ఈ సెల్ఫీ పాయింట్ యువతుల మధ్య గొడవకు కారణమైంది. నిన్న ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున స్థానికులు గాంధీ పార్కుకు వచ్చారు. పార్కులోని వింగ్స్ సెల్పీ పాయింట్ వద్ద ఫొటోలు, రీల్స్ కోసం రద్దీ పెరిగింది.
సెల్ఫీల కోసం రగడ
సెల్ఫీల కోసం రద్దీ పెరడగంతో... యువతుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ మాటల యుద్ధం ముదిరి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. యువతులు ఒకరి జుట్టూ మరొకరు పట్టుకుని తీవ్రంగా కొట్టుకున్నారు. అయితే మహిళలు తీవ్రంగా కొట్టుకుంటుంటే పక్కనున్న వారు ఆపే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం. చివరికి సెక్యూరిటీ సిబ్బంది కూడా మహిళలను విడిపించే ప్రయత్నం చేయలేదు. చాలాసేపు మహిళల ముష్టియుద్ధం కొనసాగింది. కాసేపటికి మహిళల బంధువులు వారిని విడిపించే ప్రయత్నం చేశారు. ఈ ఘర్షణను కొంతమంది సెల్ ఫోన్లలో వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. గొడవలను ఆపాల్సిన భద్రతా సిబ్బంది పట్టించుకోకపోవడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.