Vizianagaram : బంగారం వ‌ర్త‌కుల‌పై తుపాకీ కాల్పులు - కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో దాడి-gunfire on gold traders in vizianagaram district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Vizianagaram : బంగారం వ‌ర్త‌కుల‌పై తుపాకీ కాల్పులు - కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో దాడి

Vizianagaram : బంగారం వ‌ర్త‌కుల‌పై తుపాకీ కాల్పులు - కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో దాడి

HT Telugu Desk HT Telugu
Aug 23, 2024 08:04 PM IST

విజ‌య‌నగరం జిల్లాలో కాల్పులు క‌ల‌క‌లం రేపాయి. బంగారం వ‌ర్త‌కుల‌పై ఇద్దరు దుండగులు తుపాకీ కాల్పులు జరిపారు. క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో దాడి చేశారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దుండ‌గుల కోసం ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు వెల్లడించారు.

విజ‌య‌నగరం జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం
విజ‌య‌నగరం జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం

విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కాల్పుల క‌ల‌క‌లం సృష్టించాయి. బంగారం వ‌ర్త‌కుల‌పై తూపాకీతో కాల్పులు జ‌రిపి, వారి వ‌ద్ద నుంచి బంగారం దోచుకున్నారు. క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లి, ఇనుప రాడ్డుతో కొట్టారు. ఈ ఘ‌ట‌న‌లో ఇద్ద‌రికి గాయాలు అయ్యాయి. పోలీసులు కేసు న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

ఈ ఘ‌ట‌న విజ‌య‌న‌గ‌రం జిల్లా గ‌రివిడి మండ‌లం ఉల్లివ‌ల‌స మెట్ట వ‌ద్ద చోటు చేసుకుంది. క‌ల‌క‌త్తాకు చెందిన షేక్ న‌జీర్ గ‌త 15 ఏళ్లుగా రాజాంలో స్వ‌ర్ణ‌కారునిగా స్థిర‌ప‌డి దుకాణాన్ని నిర్వ‌హిస్తున్నారు. షేక్ న‌జీర్ ప‌ట్ల అంద‌రూ న‌మ్మ‌కంగా ఉంటారు. ఆయ‌న వ‌ద్ద ఎటువంటి తేడా లేకుండా ఉంటుంద‌ని అక్క‌డి వారి న‌మ్మకం. క‌నుక‌నే 15 ఏళ్లుగా ఏ తేడా లేకుండా షాప్‌ను న‌డుపుతున్నాడు.

తన షాప్‌లో ప‌ని చేసే డిల్వ‌ర్ హుస్సేన్‌తో క‌లిసి న‌గ‌ల‌కు న‌గిషీ ప‌ట్టించేందుకు ద్విచ‌క్ర వాహ‌నంపై బుధ‌వారం రాజాం నుంచి విజ‌య‌న‌గరం వెళ్లారు. విజ‌య‌న‌గ‌రంలో ప‌ని ముగించుకుని తిరిగి రాత్రి 9.30 గంట‌ల‌కు ద్విచ‌క్ర వాహ‌నంపై రాజాం బ‌య‌లుదేరారు. గ‌రివిడి మండ‌లం ఉల్లివ‌ల‌స గ్రామంలోని మెట్ట వ‌ద్ద‌కు వ‌చ్చేస‌రికి రాత్రి 11.30 గంట‌లు అయింది. అక్క‌డ ఇద్ద‌రు గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు ద్విచ‌క్ర వాహ‌నంపై వ‌చ్చి వీరిపై దాడి చేశారు.

వీరిద్ద‌రి క‌ళ్ల‌ల్లో కారం చ‌ల్లారు. అనంత‌రం ఇనుప రాడ్డుతో కొట్టారు. మీ వ‌ద్ద ఉన్న‌ది మాకు ఇవ్ాలని గట్టిగా దుండ‌గులు అరిచారు. అయితే అప్ప‌టికే దుండ‌గుల‌ను చూడ‌గానే స్వ‌ర్ణ‌కారులు త‌మ వ‌ద్ద ఉన్న 50 గ్రాముల (దాదాపు రూ.4 ల‌క్ష‌ల విలువ చేసే ఐదు తులాలు) బంగారాన్ని రోడ్డు ప‌క్క‌న ఉన్న తుప్ప‌ల్లోకి విసిరేశారు. త‌మ వ‌ద్ద బంగారం లేద‌ని.. కావాలంటే త‌నిఖీ చేసుకోండ‌ని ఇద్ద‌రూ చెప్పారు. దీంతో కోపోద్రికులై దుండ‌గులు తుపాకీతో కాల్పులు జ‌రిపారు.

ఈ కాల్పుల్లో హుస్సేన్ వైపు బుల్లెట్ దూసుకెళ్లింది. అయితే ఆయ‌న త‌ప్పించుకోవ‌డంతో ప్ర‌మాదం త‌ప్పింది. కానీ ఎడ‌మ చేతికి బుల్లెట్ త‌గిలి గాయం అయింది. ఆ త‌రువాత వారి వ‌ద్ద నుంచి రెండు సెల్‌ఫోన్లు, కొంత న‌గ‌దు తీసుకుని దుండ‌గులు ప‌రార‌య్యారు. అప్ప‌టికే ఇద్ద‌రికీ తీవ్ర గాయాలయ్యాయి. ఎలాగోలా అక్క‌డి నుంచి బ‌య‌ట‌ప‌డ్డారు.

రోడ్డు ప‌క్క‌న తుప్ప‌ల్లోకి విసిరేసిన బంగారాన్ని తీసుకుని వ‌ర్త‌కులిద్ద‌రూ రాజాం వెళ్లిపోయారు. అక్క‌డ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. న‌జీర్ రాజాం ప్ర‌భుత్వ ఆసుప‌త్రిలో చేరారు. హుస్సేన్ చీపురుప‌ల్లి ప్ర‌భుత్వ ఆసుప్ర‌తిలో చికిత్స పొందుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేర‌కు చీపురుప‌ల్లి సీఐ మోహ‌నరావు, గ‌రివిడి ఎస్ఐ దామోద‌ర‌రావు ఘ‌ట‌నా స్థలానికి వెళ్లి ప‌రిశీలించారు.

సీసీఎస్ ఇన్‌స్పెక్ట‌ర్ ఏఎస్ సత్య‌నారాయ‌ణ‌, క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్‌ల‌తో ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించి ఆధారాలు సేక‌రించారు. దుండ‌గుల కోసం ప్ర‌త్యేక బృందాల‌తో గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు పోలీసులు చెబుతున్నారు. ఆసుప‌త్రిల్లో చికిత్స పొందుతున్న బాధితుల వ‌ద్ద పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. ఈ సంద‌ర్భంగా దుండ‌గులిద్ద‌రూ మాల్ నికాల్‌, మాల్ నికాల్ (మీ ద‌గ్గ‌ర ఉన్న మాల్ తీయండి) అంటూ హిందీలో అరిచార‌ని బాధితులు చెప్పారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

టాపిక్