Chittoor District : విషాదం... కోనేరులో జారిపడిన మనవడు, కాపాడబోయిన అవ్వ, ఇద్దరూ మృతి..!
Chittoor district Crime News : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనేరులో జారిపడిన మనవుడిని కాపాడబోయి నానమ్మ కూడా ప్రాణాలు కోల్పోయింది.
Chittoor district Crime News : చిత్తూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. కోనేరులో జారిపడిన మూడేళ్ల మనవుడిని కాపాడేందుకు యత్నించిన నానమ్మ కూడా కోనేరులో పడిపోయింది. మనువడితో నానమ్మ కూడా అనంతలోకానికి వెళ్లిపోయింది. దీంతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
ఈ విషాద ఘటన చిత్తూరు జిల్లా సదుం మండలం కొత్తపల్లెలో చోటు చేసుకుంది. కొత్తపల్లె గ్రామానికి చెందిన తులసమ్మ (59), కుమారుడు చరణ్‌తో కలిసి తిరుపతి నగరంలో నివాసం ఉంటున్నారు. కుమారుడు చరణ్‌కు ఇద్దరు పిల్లలు అద్విక్ (3), కుమార్తె ఉన్నారు. అయితే స్వగ్రామం కొత్తపల్లె గ్రామంలో కొత్తగా ఇళ్లు నిర్మిస్తున్నారు. దాని పనులు జరుగుతోన్నాయి. ఇళ్లు నిర్మాణ పనులను దగ్గరుండి చూసుకునేందుకు తులసమ్మ ఐదు రోజుల క్రితం స్వగ్రామం కొత్తపల్లెకు వెళ్లారు.
ఇదే సమయంలో మనవుడు అద్విక్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. అయితే శనివారం గ్రామంలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయానికి అద్విక్‌తో కలిసి వెళ్లారు. అక్కడ స్వామివారిని దర్శించుకుని తిరిగి ఇంటికి వెళ్తుండగా గ్రామంలోనే విరూపాక్షమ్మ ఆలయ సమీపంలోనే కోనేరు వద్ద కొద్దిసేపు ఆగారు. అక్కడ మనవుడు అద్విక్ ఆడుకుంటున్నాడు. ఉన్నట్టుండి మనవుడు అద్విక్ కోనేరులో జారిపడ్డాడు.
దీన్ని గమనించిన తులసమ్మ మనువడిని కాపాడేందుకు యత్నించారు. ఈ ప్రయత్నంలో తులసమ్మ కూడా కోనేరులో జారిపడింది. ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో స్థానికులు వీరు కోనేరులో పడిపోయారని అనుమానం వచ్చింది. దీంతో కోనేరు వద్దకు వెళ్లే సరికి వారితోపాటు తెచ్చుకున్న వస్తువులు అక్కడ ఉన్నాయి. కానీ నానమ్మ, మనవుడు అక్కడ లేరు. దీంతో స్థానికులు కోనేరులో దిగి గాలింపు చర్యలు చేపట్టారు.
దీంతో నానమ్మ, మనవుడు మృతి చెందారు. వారి మృతదేహాలను బయటకు తీశారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. వారి రోదనలు మిన్నంటాయి.
సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గ్రామస్థులను ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేశారు. మృత దేహాలను సదుం ఆసుపత్రికి తరలించారు.