Insurance Drama: బీమా డబ్బుల కోసం… మరొకరి మృతదేహం తగులబెట్టించిన ధాన్యం వ్యాపారి-grain merchant burnt anothers dead body for insurance money ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Insurance Drama: బీమా డబ్బుల కోసం… మరొకరి మృతదేహం తగులబెట్టించిన ధాన్యం వ్యాపారి

Insurance Drama: బీమా డబ్బుల కోసం… మరొకరి మృతదేహం తగులబెట్టించిన ధాన్యం వ్యాపారి

Sarath chandra.B HT Telugu
Jan 31, 2024 08:57 AM IST

Insurance Drama: ఇన్స్యూరెన్స్‌ డబ్బుల కోసం మరొకరి మృతదేహాన్ని పెట్రోల్‌ పోసి తగులబెట్టించిన ధాన్యం వ్యాపారి చివరకు కటకటాల పాలయ్యాడు.

ఇన్స్యూూరెన్స్ డబ్బుల కోసం ధాన్యం వ్యాపారి డ్రామా
ఇన్స్యూూరెన్స్ డబ్బుల కోసం ధాన్యం వ్యాపారి డ్రామా

Insurance Drama: అప్పుల పాలైన ధాన్యం వ్యాపారి వాటి నుంచి బయట పడటానికి వేసిన పథకం బెడిసికొట్టింది. పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూడటంతో జైలు పాలయ్యాడు.

yearly horoscope entry point

తూర్పు గోదావరి జిల్లా రంగపేట మండలంలో గత వారం పొలం గట్టుపై కాలిపోయిన శవం మిస్టరీని పోలీసులు చేధించారు. ఈ కేసులో ఫిర్యాదుదారుడే అసలు నిందితుడిగా తేల్చారు. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ఆడిన నాటకంలో రకరకాల మలుపులు తిరిగినట్టు గుర్తించారు.

అప్పుల పాలై వాటిని తీర్చే దారి లేక చని పోయినట్లు నమ్మించేందుకు చేసిన పథకం బెడిసి కొట్టింది. బీమా డబ్బుల కోసమే కేతమళ్ల వెంకటేశ్వరరావు డ్రామా ఆడినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుడి పథకం బెెడిసికొట్టి పోలీసులకు దొరికి పోయాడు.

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం వీరంపాలెంలో ఈ నెల 26న గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం కాలిపోయిన స్థితిలో గుర్తించారు. ఈ కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన కేతమళ్ల వెంకటేశ్వరరావు అలియాస్ పూసయ్య వీరంపాలెంలో ధాన్యం వ్యాపారం చేస్తున్నాడు.

వ్యాపార అవసరాలకు భారీగా అప్పులు చేశాడు. చని పోయినట్టు డ్రామా ఆడి కొన్నాళ్లు అజ్ఞాతంలో ఉంటే తన పేరిట రూ.40లక్షల బీమా సొమ్ము వస్తుందని భావించాడు. ప్రమాదవశాత్తు చనిపోయినట్టు అందరినీ నమ్మించాలని ప్లాన్‌ చేశాడు.

తన స్థానంలో మరో మృతదేహాన్ని ఉంచి ఎవరూ గుర్తించకుండా చేయాలని భావించాడు. ఇందుకోసం రాజ మహేంద్రవరం రూరల్‌ మండలం మోరంపూడికి చెందిన ఇద్దరు యువకులతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. పాత బొమ్మూరులో ఈ నెల 23న ఓఎన్‌జీసీ ఇంజినీర్‌ నెల్లి విజయరాజు చనిపోయారు.

24వ తేదీన స్థానిక శ్మశానవాటికలో అతడి మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. విషయం తెలుసుకున్న ఇద్దరు యువకులూ పూడ్చిపెట్టిన శవపేటిక నుంచి విజయరాజు మృతదేహాన్ని 25వ తేదీన అపహరించారు.

పూసయ్య సూచించనట్టు దాన్ని వీరంపాలెం తీసుకెళ్లి పొలంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ వద్ద పెట్రోలు పోసి తగలబెట్టారు. పూసయ్య చెప్పులు, సెల్‌ఫోన్‌ను అక్కడే విడిచి పరారయ్యారు. ఘటనా స్థలంలో దొరికిన ఆధారాలను బట్టి మృతదేహం పూసయ్యదేనని గ్రామస్థులు భావించి పోస్టుమార్టం కోసం తరలించారు.

భర్త మరణించడంతో పూసయ్య భార్య తీవ్రంగా కలత చెందింది. తాను చనిపోతానని రోదిస్తున్న వైనాన్ని స్థానిక యువకులు పూసయ్యకు ఎప్పటికప్పుడు ఫోన్లో చేరవేసేవారు. భార్యను ఓదార్చడానికి బతికే ఉన్నానని చెప్పాలనుకున్నాడు.

ఆ నెల 28న గుర్తుతెలియని యువకులు పొలంలో మృతదేహాన్ని కాలుస్తుండగా తాను అడ్డుకున్నానని, తనను కొట్టి ఆటోలో తీసుకెళ్లి దూరంగా తుప్పల్లో పడేసినట్టు మరో కథ అల్లాడు. అతడి శరీరంపై గాయాలు లేకపోవడంతో పోలీసులు అనుమానించారు.

దీంతో పోలీసులు పూసయ్యను గట్టిగా నిలదీయడంతో అసలు విషయం చెప్పాడు. పూసయ్యకు సహకరించి స్మశానంలో శవాన్ని అపహరించిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసినట్టు అనపర్తి సీఐ శివగణేష్‌ తెలిపారు.

Whats_app_banner