Ap Polycet Coaching: ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో పాలిసెట్ ప్రవేశ పరీక్షకు ఉచితశిక్షణ
Ap Polycet Coaching: ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించే పాలిటెక్నిక్ ప్రవేశపరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్ తెలిపారు. ఏప్రిల్ 24నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కాలేజీల్లో శిక్షణ అందించనున్నారు.
Ap Polycet Coaching: ఏపీలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలలో పాలిసెట్ – 2023 ప్రవేశ పరీక్ష కోసం ఉఛిత శిక్షణ అందిస్తున్నట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ నెల 24 నుండి నూతన బ్యాచ్‌లను ప్రారంభిస్తున్నట్లు తెతలిపారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్ధులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందచేస్తారు.
మరోవైపు పాలిటెక్నిక్ విద్య, ఉపాధిపై రాష్ట్ర వ్యాప్తంగా నిరంతర అవగాహనా సదస్సులు నిర్వహిస్తున్నట్లు వివరించారు. పిన్న వయస్సులోనే ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పొందడానికి “పాలిటెక్నిక్ విద్య” ఉత్తమ మార్గమని రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమీషనర్ చదలవాడ నాగరాణి తెలిపారు.
యువతను పాలిటెక్నిక్ విద్య వైపు మళ్లించే చర్యలలో భాగంగా అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో పాలిసెట్ – 2023 కోసం ఉచిత శిక్షణ అందిస్తున్నామన్నారు. పదవ తరగతి విద్యార్ధులలో అవగాహన కలిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు.
పాలిసెట్ తొలివిడత కోచింగ్ ప్రక్రియ ఏప్రిల్ 17న ప్రారంభించి, 24వ తేదీ నుండి మరో బ్యాచ్ ప్రారంభిస్తున్నామని వివరించారు. శిక్షణ పొందిన ప్రతి విద్యార్ధికి ఇంగ్లీష్, తెలుగు మీడియంలలో ఉచిత స్టడీ మెటీరియల్ అందిస్తున్నట్లు తెలిపారు.
30వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ…
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ ప్రవేశాల కోసం మే 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రములలో పాలీసెట్ 2023 నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షకు సుమారు 1,50,000 మంది విద్యార్థులు హాజరవుతారన్నారు. ప్రవేశ పరీక్షకు ప్రభుత్వం నిర్దేశించిన పదవ తరగతి సిలబస్ నుండి గణితంలో 50 మార్కులు , భౌతిక శాస్త్రము 40 మార్కులు, రసాయన శాస్త్రము 30 మార్కులు మొత్తం కలిపి 120 మార్కులకు రెండు గంటల వ్యవధిలో పరీక్ష ఉంటుందన్నారు.
పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యే ఓసి, బిసి విద్యార్ధులు రూ.400, ఎస్టి ఎస్సీ విద్యార్ధులు రూ.100 ప్రవేశ రుసుమును దగ్గరలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ లోగాని, https://polycetap.nic.in వెబ్ సైట్ ద్వారా కాని ఏప్రిల్ 30 సాయంత్రం 5గంటల లోపు చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 84 ప్రభుత్వ పాలిటెక్నిక్ లు, 176 ప్రైవేటు పాలిటెక్నిక్ లతో పాటు, ఈ విద్యా సంవత్సరము నుండి నూతనముగా ప్రారంభిస్తున్న నంద్యాల జిల్లా- బేతంచెర్ల, కడప జిల్లా-మైదుకూరు, అనంతపురం జిల్లా - గుంతకల్లులో ప్రభుత్వ పాలిటెక్నిక్ లలో ప్రవేశాలు పొందగలుగుతారు.
రాష్ట్ర వ్యాప్తంగా బాలికల కోసం ప్రత్యేకంగా 10 ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ లు , 2 మైనారిటి పాలిటెక్నిక్ లు ఉన్నాయి. ఎస్టి ఎస్పి విద్యార్ధుల అభ్యున్నతి కోసం మరో 9 ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ లను, ఉచిత వసతి, బోజన సదుపాయాలతో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి విద్యార్ధినికి ఏడాదికి రూ.50,000 చొప్పున మూడేళ్ళు ప్రగతి స్కాలర్ షిప్ లభిస్తుందన్నారు. పాలిసెట్-2023 ద్వారా ప్రవేశము పొందిన విద్యార్ధులందరికీ స్కాలర్ షిప్ సదుపాయం అందుబాటులో ఉందన్నారు.
జగనన్న విద్యదీవేన, వసతి దీవెన ద్వారా విద్యార్ధులకు ఫీజు రియింబర్స్‌మెంట్ సదుపాయం కల్పిస్తున్నామని చెప్పారు. ఆధునిక సాంకేతిక అవసరాలకు అనుగుణంగా రూపొందించిన పాలిటెక్నిక్ కోర్సులకు అనుభవము కలిగిన అధ్యాపకులతో విద్యాబోధన సాగుతుందని వివరించారు.
24 రకాల కోర్సులలో చివరి సంవత్సరం విద్యార్ధులందరికీ ఆరునెలల పాటు అయా సంస్ధలలో పారిశ్రామిక శిక్షణ ఇప్పించటం ద్వారా ఉత్తమ నైపుణ్యాభివృద్ది సాధించేలా కృషి చేస్తున్నామన్నారు. 3 సంవత్సరముల పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్ధులకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు సాంకేతిక విద్య శాఖ ప్రత్యేక ప్రణాళిక అమలు చేస్తుందన్నారు.
పదవ తరగతి పరీక్షలు ముగిసినందున విద్యార్దులు పాలిసెట్-2023కు దరఖాస్తు చేసుకోవాలని, మరిన్ని వివరములకు హెల్ప్ లైన్ నెంబర్ 08645-293151, 7901620551/557/567 లద్వారా సంప్రదించవచ్చన్నారు.