Tirupati Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్-four died on the spot in a road accident in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Tirupati Accident : తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

Basani Shiva Kumar HT Telugu
Sep 12, 2024 03:34 PM IST

Tirupati Accident : తిరుపతి జిల్లాలో తీవ్ర విషాదం జరిగింది. ఓ కంటైనర్ లారీ అదుపు తప్పి బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరికొందరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం
తిరుపతి జిల్లాలో రోడ్డు ప్రమాదం

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రగిరి మండలం భాకరాపేట కనుమ రహదారిలో.. కంటైనర్‌ లారీ అదుపు తప్పింది. కారు, బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు చనిపోయారు. కలకడ నుంచి చెన్నైకి టమాటా లోడ్‌తో వెళ్తున్న కంటైనర్ అదుపు తప్పిందని పోలీసులు చెబుతున్నారు. ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్టు వివరించారు. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు వివరించారు.

మంత్రి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం..

విజయనగరం జిల్లాలో మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్‌ వాహనానికి ప్రమాదం జరిగింది. మంత్రి సంధ్యారాణి ఎస్కార్ట్‌ వాహనాన్ని మరో వ్యాను ఢీకొట్టింది. విజయనగరం జిల్లా రామభద్రపురం మండలం భూసాయివలసలో ఈ ఘటన జరిగింది. ఇద్దరు భద్రతా సిబ్బంది, ఢీకొట్టిన వ్యానులో ముగ్గురికి స్వల్పగాయాలు అయ్యాయి. మంత్రి సంధ్యారాణి మెంటాడ మండలం పర్యటనకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులను అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించారు మంత్రి సంధ్యారాణి. ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులకు చికిత్స చేయిస్తున్నారు.

మరో విషాదం..

విజ‌య‌న‌గరం జిల్లా గంట్యాడ మండ‌లంలో బుధ‌వారం సాయంత్రం విషాదం జరిగింది. విజ‌య‌న‌గరం జిల్లా ఎల్‌ కోట మండ‌లం చందులూరి గ్రామానికి చెందిన అప్ప‌ల‌బ‌త్తుల స‌తీష్ (35), భార్య వ‌ర‌ల‌క్ష్మితో క‌లిసి అత్త‌వారి గ్రామం గంట్యాడ మండ‌లం చంద్రంపేట‌కు మంగ‌ళ‌వారం వెళ్లారు. బుధ‌వారం భార్య పేరు మీద వ‌చ్చిన డ్వాక్రా డ‌బ్బులు తీసుకుని ద్విచ‌క్ర వాహ‌నంపై గ్రామానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో పెద్ద‌గెడ్డ వాగు క‌ల్వ‌ర్టు దాటుతున్నారు. నీటి ప్ర‌వాహం, అందులో నాచు కార‌ణంగా అదుపుత‌ప్పి ప‌డిపోయారు.

స‌తీష్ వాగులోకి కొట్టుకుపోయారు. ర‌క్ష‌ణ స్తంభాన్ని ప‌ట్టుకుని వేలాడుతున్న వ‌ర‌ల‌క్ష్మిని స్థానికులు ర‌క్షించారు. ఆ తర్వాత పోలీసులకు స‌మాచారం అందించారు. స‌తీష్ క‌రెంటు, ఇనుప వ‌స్తువుల‌కు సంబంధించిన ప‌నులు చేస్తుంటారు. చాలా ఏళ్ల కిందట విద్యుదాఘాతానికి గురై ఒక చేతిని కోల్పోయారు. ప్లాస్టిక్ చేతిని అమ‌ర్చుకుని ప‌నులు చేస్తూ జీవ‌నం సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో దిచ‌క్రవాహ‌నం అదుపు త‌ప్పిన స‌మ‌యంలో.. ఒక్క చేతితో ప‌ట్టు కోల్పోయాడ‌ని, అందుకే వ‌ర‌ద ప్ర‌వాహ‌నికి కొట్టుకుపోయాడ‌ని స్థానికులు చెబుతోన్నారు.

ఆర్డీవో సూర్య‌క‌ళ‌, ఎమ్మార్వో నీల‌కంఠేశ్వ‌ర‌రావు, ఎస్ఐ సాయికృష్ణ ఘ‌టనా స్థ‌లానికి చేరుకున్నారు. ఏపీఎస్‌డీఆర్ఎఫ్ బృందాల‌ను రంగంలోకి దింపి గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టారు. ఎంత‌సేప‌టికి సతీష్ ఆచూకీ దొర‌క‌లేదు. రాత్రి కావ‌డంతో గాలింపు చర్య‌లు ఆపేశారు. ఎస్‌.కోట ఎమ్మెల్యే కోళ్ల ల‌లిత కుమారి, క‌లెక్ట‌ర్ బీఆర్ అంబేద్క‌ర్‌ కూడా ఘ‌ట‌నా స్థ‌లాన్ని ప‌రిశీలించారు.

Whats_app_banner