AP Water Projects : ఎగువన వర్షాలు ..! తుంగభద్ర, గాజులదిన్నెలోకి వరద నీరు - శ్రీశైలంలో తాజా పరిస్థితి ఏంటంటే..?
AP Water Projects Latest Updates: వర్షాలు పడటం ప్రారంభం కావటంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతుంది. దీనివల్ల గతేడాది కంటే నీటి నిల్వలు పెరిగే అవకాశం ఉంది. గతేడాది తీవ్రవ వర్షాభావంతో రాష్ట్రంలోని ప్రాజెక్టుల్లో కనిష్ట నిల్వలకు నీటి మట్టాలు పడిపోయాయి.
AP Water Projects Latest Updates: ఈ ఏడాది జూన్ మొదటి వారంలోనే నైరుతి రుతుపవనాల రాకతో రాష్ట్రంలోనూ, ఎగువ రాష్ట్రాల్లోనూ వర్షాలు పెరిగాయి. దీంతో ప్రాజెక్టుల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు పెరగడానికి అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఎగువ నుంచి తుంగభద్రకు నీరు….
తుంగభద్ర ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు వచ్చిచేరుతోంది. దీంతో ఇదే నెలలో గతేడాది కంటే ఈ ఏడాది నీటి నిల్వ పెరిగింది. తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 135 టీఎంసీలు ఉండగా, ఒండ్రు చేరడంతో దాని సామర్థ్యం 30 టీఎంసీలు తగ్గింది. దీంతో ప్రస్తుత తుంగభద్ర ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 105.78 టీఎంసీలు ఉంది. అయితే గతేడాది ఇదే సమయానికి 5.029 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 5.59 టీఎంసీల నీటి నిల్వ ఉంది. తుంగభద్ర ప్రాజెక్టు గరిష్ట నీటి మట్టం 1,633 అడుగులు కాగా, నీటి మట్టం 1,582.13 అడుగులుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి నీటి మట్టం 1581.10 అడుగులుగా ఉంది.
ఎగువ రాష్ట్రం కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు ఎగువ నుంచి వరద నీరు వచ్చి తుంగభద్ర ప్రాజెక్టులో చేరుతోంది. ప్రస్తుతం 3,215 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. గతేడాది ఇదే సమయానికి కేవలం 405 క్యూసెక్కుల నీరు మాత్రమే వచ్చి చేరింది. గత పదేళ్ల సరాసరి ఇన్‌ఫ్లో 1,501 క్యూసెక్కులుగా ఉందని అధికారులు తెలిపారు.
గాజులదిన్నెప్రాజెక్టుకు వరద నీరు
గాజులదిన్నె ప్రాజెక్టు (దామోదరం సంజీవయ్య సాగర్)కు వరద నీరు వచ్చి చేరుతోంది. హంద్రీనదిపై ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు ప్రస్తుతం 800 క్యూసెక్కుల నీరు గాజుల దిన్నె ప్రాజెక్టులోకి వచ్చి చేరింది. ప్రాజెక్టు నీలి నిల్వ సామర్థ్యం 4.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం జలాశయం నీటి నిల్వ 0.9 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టుల్లో 0.8 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
శ్రీశైలానికి చేరని వరద….
మరోవైపు శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద నీరు ఇంకా రాలేదు. ఈనెల 10న ఒక్క రోజే సుంకేసుల నుంచి 4,052 క్యూసెక్కుల నీరు వచ్చి ఆగిపోయింది. శ్రీశైలం ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం 809 అడుగులుగా ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటి మట్టం 809 అడుగులుగానే ఉంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 263 టీఎంసీలు కాగా, అందులో ప్రస్తుతం 215.807 టీఎంసీలు సామర్థ్యమే ఉంది. కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 33.7180 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో నీటి నిల్వ 33 టీఎంసీలు ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి మహాత్మగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,283 క్యూసెక్యుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు.
జూరాలకు కృష్ణా నీరు
తెలంగాణలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టకు వరద ప్రవాహం మొదలైంది. కృష్ణా నది ఎగువ రాష్ట్రాలు కర్ణాటక, మహారాష్ట్ర నుంచి వదర ఉధృతి పెరుగుతోంది. ప్రతి రోజూ 7,735 క్యూసెక్కుల నీరు రిజర్వాయర్‌లోకి వచ్చి చేరుతోంది. జూరాల ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 9.68 టీఎంసీలుగా ఉంది. వరద నీరు వచ్చి చేరడంతో 1.5 టీఎంసీల నుంచి నీటిమట్టం 2.495 టీఎంసీలకు చేరుకుంది. వరద ఉధృతి మరింత పెరిగి సగం వరకు నీటి మట్టం చేరితే ఆయకట్టుకు నీరు వదిలే అవకాశాలు ఉన్నాయి.
ప్రతి రోజూ లక్ష క్యూసెక్కుల నీరు వచ్చి చేరితే, వారం రోజుల్లోనే రిజర్వాయర్ నిండుతుంది. నీరు తక్కువగా వస్తుండటంతో స్పిల్‌వే, విద్యుత్, కాల్వలకు నీటిని వదలడం లేదు. పుష్కలంగా వరదలు వస్తే, కేఎల్ఐ, జూరాలతో పాటు ఇతర ప్రాజెక్టుల కింద మొత్తం ఎనిమిది లక్షల ఎకరాలు సాగు అవుతుంది. గత రబీలోనూ ఆశించిన స్థాయిలో సాగునీరు అందలేదు.