Jagan at Atchutapuram: అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించిన జగన్.. ప్రభుత్వంపై ఫైర్
Jagan at Atchutapuram: అచ్యుతాపురం ప్రమాద బాధితులను పరామర్శించేందుకు మాజీ సీఎం జగన్.. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రికి వెళ్లారు. ప్రమాదం జరిగిన తీరును బాధితులను అడిగి తెలుసుకుని.. ధైర్యం చెప్పారు. బాధితులకు అందుతున్న వైద్యం.. వాళ్ల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన వారిని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరామర్శించారు. అనకాపల్లిలోని ఉషా ప్రైమ్ ఆస్పత్రికి వెళ్లి బాధితులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని.. తామంతా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు జగన్ సూచించారు. క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు తమ పార్టీ నేతలు అందుబాటులో ఉంటారని చెప్పారు. పరామర్శించిన తర్వాత జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
'అచ్యుతాపురం ఘటనలో ప్రభుత్వం వ్యవహరించిన తీరు, ప్రభుత్వం స్పందించిన తీరు చూస్తే.. ఈ ఘటన గురించి ఎక్కువ స్పందించకూడదు అనే తాపత్రయం కనపడింది. 17 మంది చనిపోతే.. సాయంత్రం 4 గంటలకు హోంమంత్రి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా సహాయక చర్యలను పర్యవేక్షించడానికి అనకాపల్లి వెళ్తున్న అనేమాట మాట్లాడలేదు. ఇంకో గంట తరువాత కార్మికశాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టి ఎంత మంది చనిపోయారో వివరాలు లేవు అని మాట్లాడాడు. అంత పెద్ద ఘటన జరిగితే.. ఘటనా స్థలానికి కలెక్టర్ ఎప్పుడు పోయారు? అధికారులు ఎప్పుడు పోయారు? కమిషనర్ ఎప్పుడు పోయారు అనేది చూస్తే చాలా బాధ కలుగుతుంది' అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్‌లోని ఎసైన్షియా అడ్వాన్స్‌డ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బుధవారం మధ్యాహ్నం 2:15 గంటలకు జరిగిన ప్రమాదంలో 17 మంది మృతి చెందారని.. హోంమంత్రి అనిత వెల్లడించారు. ఈ ఘటనలో దాదాపు 60 మంది వరకు గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని సీఎం చంద్రబాబు గురువారం పరామర్శించారు. మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారాన్ని ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిమాండ్‌తో కూటమి ప్రభుత్వం దిగొచ్చిందని వైఎస్సార్సీపీ పార్టీ పేర్కొంది. ఎల్జీ పాలిమర్స్ బాధితులకి జగన్ ప్రభుత్వంలో కోటి రూపాయలు పరిహారం ఇచ్చారని.. అదే తరహాలో అచ్యుతాపురం ప్రమాద బాధితులకి ఇవ్వాలని జగన్ డిమాండ్ చేసినట్టు వెల్లడించింది. జగన్ డిమాండ్‌కి తలొగ్గి.. అచ్యుతాపురం ప్రమాద బాధితులకి కోటి రూపాయల పరిహారాన్ని కూటమి ప్రభుత్వం ప్రకటించిందని వైఎస్సార్సీపీ స్పష్టం చేసింది.