Budameru High Alert: బుడమేరుకు మళ్లీ వరద.. ఆ ప్రాంతాలకు మళ్లీ ముంపు ముప్పు, 7 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చే ఛాన్స్-flood again in budameru there is a threat of flooding in those areas again there is a chance of 7 feet high flow ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Budameru High Alert: బుడమేరుకు మళ్లీ వరద.. ఆ ప్రాంతాలకు మళ్లీ ముంపు ముప్పు, 7 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చే ఛాన్స్

Budameru High Alert: బుడమేరుకు మళ్లీ వరద.. ఆ ప్రాంతాలకు మళ్లీ ముంపు ముప్పు, 7 అడుగుల ఎత్తున ప్రవాహం వచ్చే ఛాన్స్

Bolleddu Sarath Chandra HT Telugu
Sep 09, 2024 07:02 AM IST

Budameru High Alert: విజయవాడ నగరానికి మళ్లీ వరద ముప్పు పొంచి ఉంది. ఎన్టీఆర్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరు పరివాహక ప్రాంతంలో నీటి ప్రవాహం గణనీయంగా పెరిగింది. బుడమేరు గండ్లు పూడ్చినా సోమవారం తెల్లవారు జాము నుంచి వరద ప్రవాహం పెరగడంతో హై అలర్ట్‌ హెచ్చరికలు జారీ చేశారు.

బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ దిగువున మళ్లీ వరద ముప్పు, ఏడు అడుగుల ఎత్తున నీరు వస్తుందని అలర్ట్
బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌ దిగువున మళ్లీ వరద ముప్పు, ఏడు అడుగుల ఎత్తున నీరు వస్తుందని అలర్ట్

Budameru High Alert: విజయవాడలో బుడమేరు పరివాహక ప్రాంతాలకు హై అలర్ట్‌ జారీ చేశారు. కృష్ణా ఇరిగేషన్ సర్కిల్ అధికారులు ఆదివారం అర్థరాత్రి అత్యవసర హెచ్చరికలను జారీ చేశారు. దీంతో సోమవారం తెల్ల వారుజాము నుంచి పోలీసులు, రెవిన్యూ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

సెప్టెంబర్ 8వ తేదీ ఆదివారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో బుడమేరుకు వరద నీరు వచ్చి చేరుతోంది. పరీవాహక ప్రాంతంలో నిరంతరంగా మరియు భారీ వర్షాలు కురుస్తుండటంతో పాటు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో భారీ వర్షపాతం అంచనా వేసినందున, బుడమేరు నదికి ఎప్పుడైనా భారీ మరియు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం, వెలగలేరు రెగ్యులేటర్ 2.7 అడుగుల ఎత్తులో నీరు ఉంది. బుడమేరు డైవర్షన్‌ ఛానల్‌కు గండ్లు పడటం, వరద ముంపు ముంచెత్తడం వంటి ఘటనల నేపథ్యంలో మరోసారి వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. బుడమేరు ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయాల్సి ఉండటంతో ముందే అలర్ట్‌ జారీ చేశారు. బుడమేరు ప్రవాహం ఏడు అడుగుల ఎత్తుకు చేరుతుందని అంచనా వస్తున్నారు.

వరద దిగువకు విడుదల చేస్తే బుడమేరు పక్కనే ఉన్న ఈలప్రోలు, రాయనపాడు, గొల్లపూడి, జక్కంపూడి కాలనీ, సింగ్ నగర్, గుణదల, ఎన్టీఆర్ జిల్లా రామవరప్పాడు తదితర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు.

వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలను తక్షణమే తరలించి, అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని, సంబంధిత అధికారులు మరియు ప్రజలందరినీ అప్రమత్తం చేయాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరించారు. తాజా హెచ్చరికల నేపథ్యంలో ఉదయం నుంచి పోలీసులు, రెవిన్యూ యంత్రాంగం అయా ప్రాంతాల్లో వరద హెచ్చరికలతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.

సంబంధిత కథనం