వివాహేతర బంధం బయటపడి వదిన, మరిది ఆత్మహత్య
వివాహేతర సంబంధం ఇద్దరి చావు కోరకుంది. కుటుంబానికి అన్యాయం చేసి సంబంధం పెట్టుకున్న వదిన, మరిది రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. వివాహేతర సంబంధం బయటపడటంతోనే వారు ఈ చర్యకు పాల్పడ్డారు.
అనంతపురం జిల్లా గుత్తి మండలం బేతాపల్లికి చెందిన నిజామీ (35), అదే గ్రామానికి చెందిన జిలాన్ భార్యభర్తలు. జిలాన్ ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. వీరిది ఉమ్మడి కుటుంబం కావడంతో జిలాన్ తమ్ముడు మహ్మద్ బాషా (25) కూడా వారి ఇంట్లోనే ఉండే వాడు. మహ్మద్ బాషా కార్పెంటర్ వర్క్ చేసేవాడు. కుటుంబ జీవనం రీత్యా కొన్నేళ్ల క్రితం వీరు తాడిపత్రికి మకాం మార్చారు. అప్పటి నుంచి వీరి కుటుంబం అనంతపురం జిల్లా తాడిపత్రిలో నివాసం ఉంటోంది.
జిలాన్ తమ్ముడు మహ్మద్ బాషా, జిలాన్ భార్య నిజామీ మధ్య వివాహేతర సంబంధం కొంత కాలంగా సాగుతోంది. కొద్ది రోజులకు ఈ వ్యవహారం కుటుంబ సభ్యులకు తెలిసింది. ఇదే విషయమై జిలాన్ తన తమ్ముడు మహ్మద్ బాషాను, భార్య నిజామీని మందలించాడు. అయినా వారిద్దరిలో ఎలాంటి మార్పు రాలేదు.
ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం మహ్మద్ బాషా, నిజామీ ఇద్దరూ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీనిపై జిలాన్ ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకున్న పోలీసులు కేసు నమోద చేశారు. అనంతరం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంతకీ వారిద్దరి ఆచూకీ తెలియలేదు. సోమవారం ఉదయం చాగల్లు రిజర్వాయర్ వద్ద ద్విచక్రవాహనాన్ని స్థానికులు చూశారు. రిజర్వాయర్‌లోకి చూస్తే నీటిలో మహిళ మృతదేహం తేలుతూ కనిపించింది. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మహిళ మృతదేహాన్ని బయటకు తీశారు. ద్విచక్ర వాహనంలో ఉన్న సెల్‌ఫోన్ ఆధారంగా మృతురాలు జిలాన్ భార్య నిజామీగా గుర్తించారు. మహ్మద్ బాషా కోసం గాలింపు చర్యలు చేపట్టగా సోమవారం సాయంత్రం మృతదేహం కూడా రిజర్వాయర్‌లోనే లభ్యమైంది.
వివాహేతర సంబంధం నేపథ్యంలో ఇద్దరూ రిజర్వాయర్‌లో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించామని పెద్దపప్పూరు ఎస్ఐ గౌస్ బాషా తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాషా తెలిపారు.
- రిపోర్టింగ్: జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు