Karthika Deepam Chandu: కార్తీక దీపం చందు ఆత్మహత్య - పవిత్ర జయరాం చనిపోయిన ఐదు రోజులకే బలవన్మరణం
Karthika Deepam 2 Chandu: టీవీ సీరియల్ ఆర్టిస్ట్ చంద్రకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. చాలా కాలంగా టీవీ ఆర్టిస్ట్ పవిత్రా జయరాంతో చందు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం. పవిత్రా జయరాం మరణాన్ని తట్టుకోలేక అతడు సూసైడ్ చేసుకున్నట్లు చెబుతోన్నారు.
Karthika Deepam 2 Chandu బుల్లితెర నటుడు చంద్రకాంత్ అలియాస్ చందు ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని అల్కాపుర్‌లోని తన నివాసంలో ఉరివేసుకొని చందు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో త్రినయని సీరియల్ ఫేమ్, బుల్లితెర నటి పవిత్రా జయరాం కన్నుమూసింది.
ఆమెతో చందుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, ఆరేళ్లుగా వీరిద్దరు సహజీవనం చేస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది. పవిత్రా జయరాం మరణాన్ని తట్టుకోలేక చందు సూసైడ్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంట్లో సీలింగ్ ఫ్యాన్స్‌కు డోర్ కర్టెన్‌తో ఉరేసుకొని చందు సూసైడ్ చేసుకున్నట్లు తెలిసింది.
మనస్పర్థలతో భార్యాపిల్లలకు దూరం...
చందుకు పెళ్లయింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కానీ మనస్పర్థల కారణంగా భార్యాపిల్లలకు అతడు చాలా కాలంగా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. త్రినయని సీరియల్‌లో పవిత్రా జయరాంతో కలిసి చంద్రకాంత్ నటించాడు. ఈ సీరియల్‌లో తిలోత్తమగా పవిత్రా జయరాం నటించగా...నరసింహం పాత్రలో చందు కనిపించాడు.
ఐదు రోజుల క్రితం...
ఐదు రోజుల క్రితం బెంగళూరు నుంచి కారులో హైదరాబాద్‌లో వస్తోండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్రా జయరాం కన్నుమూసింది. ఈ సమయంలో కారులో ఆమెతో పాటు చందు కూడా ఉన్నాడు. స్వల్ప గాయాలతో అతడు బయటపట్టాడు. మహబూబ్‍నగర్ జిల్లా భూత్పూర్ పరిధిలోని శేరిపల్లి వద్ద ప్రమాదం చోటుచేసుకున్నది.
సోషల్ మీడియాలో పోస్టులు...
తన కళ్ల ముందే పవిత్ర కన్నుమూయడం చందు జీర్ణించుకోలేకపోయాడు. ఆమె చనిపోయినప్పటి నుంచి చంద్రకాంత్ మానసికంగా చాలా కృంగిపోయినట్లు సన్నిహితులు చెబుతోన్నారు. పవిత్రతో తనకున్న అనుబంధాన్ని, ఆమె దూరమైన బాధను గుర్తుచేసుకుంటూ సోషల్ మీడియాలో చంద్రకాంత్ వరుసగా పోస్టులు పెట్టాడు.
రెండు రోజులు ఆగు...
గురువారం పవిత్రా జయరాం పుట్టినరోజు సందర్భంగా ఆమెతో దిగిన పలు ఫోటోలను పోస్ట్‌చేశాడు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్ ఆఫ్ ది డే మామా అంటూ పోస్ట్ పెట్టాడు. నీతో ముడిపడిన అందమైన జ్ఞాపకాలు ఇవే అంటూ ఫొటోలను ఉద్దేశించి కామెంట్స్ చేశాడు. రెండో రోజులు ఆగు అంటూ ఈ పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఈ పోస్ట్‌ను బట్టి చందు ఆత్మహత్య చేసుకోవాలని ముందుగానే నిర్ణయించుకున్నాడని సన్నిహిత వర్గాలు అంటున్నాయి.
కార్తీక దీపం సీరియల్‌లో...
చందు తెలుగులో శ్రావణ సమీరాలు, త్రినయనితో పాటు సీరియల్స్ చేశాడు. ప్రస్తుతం కార్తీక దీపం ఇది నవ వసంతం సీరియల్‌లో బంటు పాత్రలో నటిస్తున్నాడు.