AP Govt Employees: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పోరుబాట..-employees unions have announced that the agitation will continue until the issues are resolved ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt Employees: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పోరుబాట..

AP Govt Employees: సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగుల పోరుబాట..

HT Telugu Desk HT Telugu
May 22, 2023 06:54 AM IST

AP Govt Employees: ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందని ఏపీజేఏసీ అమరావతి, ఏపీ గవర్నమెంట్‌ ఎంప్లాయిస్ అసోసియేషన్‌లు విడివిడిగా ప్రకటించాయి.పలు డిమాండ్లతో కొద్ది రోజులుగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంపై సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు
ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగ సంఘాలు

AP Govt Employees: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో నాలుగేళ్లుగా రాష్ట్రప్రభుత్వానికి పూర్తిగా సహకారం అందించినా, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి పలిశెట్టి దామోదరరావు ఆరోపించారు. సమస్యల పరిష్కారం కోసం 73 రోజులుగా ఉద్యమిస్తున్నామని, సమస్యలు పరిష్కారం అయ్యేవరకూ ఉద్యమాన్ని ఆపేది లేదని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ 27వ రాష్ట్ర మహాసభలను ఈ నెల 24న కృష్ణాజిల్లా నిడమానూరులో నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విజయవాడలోని రెవెన్యూ అసోసియేషన్‌ భవన్‌లో జేఏసీ నాయకులు ఆవిష్కరించారు. ఫిబ్రవరి 13న సీఎస్‌కు 50పేజీలతో కూడిన మెమోరాండంలో తాము ఇచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఉద్యోగ సంఘాల కోరారు.

ఉద్యోగుల జీపీఎఫ్‌, ఏపీజీఎల్‌ఐ కింద దాచుకున్న రూ.3,500 కోట్లను ప్రభుత్వం వాడుకుందని, దానిని ఏపీ ఐకాస అమరావతి చేస్తున్న ఉద్యమ ఫలితంగా తిరిగి వెనక్కి జమ చేసిందని గుర్తుచేశారు. సీపీఎస్‌ ఉద్యోగులకు చెల్లించాల్సిన రూ.2,450 కోట్లు, పోలీసులకు గతంలో ఉన్న టీఏలు, ఆర్టీసీ ఉద్యోగులకు ఓటీ డ్యూటీ సొమ్ము చెల్లింపులు కూడా ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ఇంకా పలు సమస్యలను ఉద్యమంతోనే పరిష్కరించుకున్నట్లు వివరించారు.

ఓపీఎస్‌ పునరుద్ధరణే లక్ష్యం…

పాత పెన్షన్ పథకాన్ని పునరుద్ధరించడమే ప్రతి ప్రభుత్వ ఉద్యోగి లక్ష్యమని ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు. ఓల్డ్‌ పెన్షన్‌ స్కీం(ఓపీఎస్‌) సాధన సమితి ప్రథమ కార్యవర్గ సమావేశంలో సాధన సమితి లోగోను నేతలు విడుదల చేశారు. ప్రభుత్వం కేవలం ఎగ్జిక్యూటివ్‌ ఉత్తర్వుల ద్వారానే లక్షలాది ఉద్యోగులకు సీపీఎస్‌ అమలు చేయడం చట్ట విరుద్ధమన్నారు.

ఓపీఎస్‌ సాధన కోసం సమితి ఈ నెల 22 నుంచి చేపట్టిన దశలవారీ ఆందోళనకు ఏపీజీఈఏ సంపూర్ణ మద్దతు ఇస్తోందన్నారు. సాధన సమితి నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన యగంధర్‌తో పాటు ఇతర నాయకులు సమావేశంలో పాల్గొన్నారు.

Whats_app_banner