Vizag Steel Plant : విశాఖలో ఉద్రిక్తత.. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగుల ఆందోళన
Vizag Steel Plant : విశాఖపట్నంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అటు స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగాయి.
విశాఖలో ఉద్రిక్తత నెలకొంది. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యోగులు ఆందోళన చేశారు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలను పోలీసులు ఈడ్చిపడేశారు. వందలాది మందిని అరెస్టు చేశారు. వీరికి సంఘీభావంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఉద్యోగులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేపట్టారు.
ఉద్యోగ సంఘాల ఆందోళన నేపథ్యంలో.. పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. ఆందోళన చేస్తున్న నేతలను పోలీసులు ఈడ్చి పడేశారు. వందలాది మంది ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలను అరెస్టు చేసి వివిధ పోలీస్‌స్టేషన్లకు తరలించారు. విశాఖపట్నం కూర్మన్నపాలెం జంక్షన్‌లో వైజాగ్ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ ఆందోళనకు దిగారు.
వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ఆందోళనకు కార్మిక సంఘాలు, వామపక్షపార్టీలు మద్దతు తెలిపాయి. కూర్మన్నపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై బైఠాయించారు. సీఐటియూ రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు, 78వ వార్డు కార్పొరేటర్ బీ.గంగారావు, ఉద్యోగ నేతలు ఎం.రామారావుతో పాటు 150 మంది ఉద్యోగ సంఘ నేతలు, కార్మిక సంఘ నేతలను పోలీసులు అరెస్టు చేశారు.
విశాఖ జీవీఎంసీ మహాత్మా గాంధీ విగ్రహం వద్ద నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు స్టీల్‌ప్లాంట్ కార్మికులు రాస్తారోకో నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి. పెందుర్తి, అచ్చుతాపురం నెల్లూరు, తిరుపతి, గూడురు ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయి.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)