East Godavari Tonsure Incident : భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలో భర్త అమానుషం!-east godavari crime news in telugu husband tonsures wife rounding in streets ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  East Godavari Tonsure Incident : భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలో భర్త అమానుషం!

East Godavari Tonsure Incident : భార్యకు శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ, తూర్పుగోదావరి జిల్లాలో భర్త అమానుషం!

Bandaru Satyaprasad HT Telugu
Feb 03, 2024 03:51 PM IST

East Godavari Tonsure Incident : తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. భార్యకు శిరోముండనం చేసి ఊరంతా ఊరేగించాడో భర్త. ఈ ఘటన స్థానికంగా సంచలనం అయ్యింది. మరో అమ్మాయి మోజులో భర్త ఇలా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపిస్తుంది.

తూర్పుగోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం
తూర్పుగోదావరి జిల్లాలో భార్యకు శిరోముండనం

East Godavari Tonsure Incident : తూర్పుగోదావరి జిల్లాలో ఓ మృగాడు రెచ్చిపోయాడు. మరో అమ్మాయి మోజులో ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యకు శిరోముండనం చేశాడు. భార్యను వీధుల్లో తిప్పుతూ నానా హంగామా చేశాడు. భార్యను వదిలించుకునేందుకు అతడు ఇలా ప్రవర్తించాడని స్థానికులు అంటున్నారు. ఈ దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన వారిపై కూడా బెదిరింపులకు దిగాడు. ఈ అమానుష ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజవర్గం సీతానగరం మండలం పెద్ద కొండేపూడి గ్రామంలో శుక్రవారం నాడు చోటుచేసుకుంది. ఈ గ్రామానికి చెందిన కర్రి రాంబాబు అలియాస్ అభిరామ్ హైదరాబాద్ లో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేస్తున్నాడు. ఆరేళ్ల క్రితం నెల్లూరుకు చెందిన జూనియర్ ఆర్టిస్ట్ షేక్ ఆషాతో అభిరామ్ కు పరిచయం ఏర్పడింది. అనంతరం వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ఒక బాబు కూడా పుట్టాడు. అప్పటి నుంచి అభిరామ్ ముఖం చాటేశాడు. వేరే అమ్మాయి మోజులో భార్యను వదిలించుకునేందుకు ప్రయత్నించాడు.

మరో పెళ్లికి సిద్ధమైన భర్త

ఈ క్రమంలో అభిరామ్, ఆషా మధ్య తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. తనని వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని తెలుసుకున్న ఆషా... హైదరాబాద్ లో పోలీసులను ఆశ్రయించింది. దీంతో అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన అభిరామ్ తల్లిదండ్రులు కోడలిని ఒప్పించి కేసు వెనక్కి తీసుకునేలా చేశారు. ఆ తర్వాత వీరిద్దరినీ పెద్ద కొండేపూడి గ్రామానికి తీసుకొచ్చారు. కొన్నాళ్లు బాగానే ఉన్న అభిరామ్ ... నాలుగేళ్ల క్రితం భార్యను ఇంట్లోంచి బయటకు గెంటేశాడు. దీంతో ఆమె అత్తమామలు, భర్తపై వరకట్న వేధింపులు కేసు పెట్టింది. కొన్నాళ్లు గిరిజన ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. ఆ తర్వాత హైదరాబాద్ వెళ్లి పోయి అక్కడ తన బిడ్డను పోషించుకుంటూ జీవనం సాగిస్తోంది. అయితే తన భర్తకు రెండో పెళ్లి చేస్తున్నారన్న విషయం తెలుసుకుని రెండు నెలల క్రితం ఆమె సీతానగరం వచ్చి న్యాయం కోసం పోరాడింది.

శిరోముండనం చేసి ఊరంతా తిప్పుతూ

మూడు రోజుల క్రితం పెదకొండేపూడిలోని తన భర్త ఇంటికి వెళ్లింది ఆషా. ఇంటికి వచ్చిన ఆషాపై అభిరామ్ ఒక మృగంలా పైశాచికంగా వ్యవహరించాడు. ఇష్టం వచ్చినట్లు ఆమెపై దాడి చేసి ట్రిమ్మర్ తో ఆమెకు గుండు గీశాడు. ఆ తర్వాత ఆ జట్టును ఒక చేతితో పట్టుకుని, ఆమెను మరో చేతితో లాక్కుంటూ ఊరంతా హల్ చల్ చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు, అక్కడికి చేరుకుని బాధితురాలికి చికిత్స కోసం రాజమండ్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదుతో నిందితుడు అభిరామ్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరచగా రిమాండు విధించింది. ప్రేమించి పెళ్లి చేసుకుని షేక్‌ ఆషా అనే మహిళను మోసం చేయడమే కాకుండా, శిరోముండనం చేసి ఇంటి బయటకు ఈడ్చుకుంటూ వచ్చి అమానుషంగా ప్రవర్తించి, చంపుతానని బెదరింపులకు దిగడంతో నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండుకు పంపించినట్లు సీతానగరం ఎస్సై రామకృష్ణ తెలిపారు.

బాధితురాలికి ఎమ్మెల్యే పరామర్శ

శిరోముండనం బాధితురాలు షేక్‌ ఆషాను పోలీసులు జీజీహెచ్‌కు తరలించి వైద్యం అందించారు. రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా బాధితురాలిని పరామర్శించారు. నిందితుడికి శిక్షపడేలా చేస్తామన్నారు. బాధితురాలిని ప్రభుత్వపరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆమెను శిశు సంక్షేమశాఖ స్టేట్‌ హోంకు తరిలించారు పోలీసులు.