APSRTC TGSRTC Dasara Special Buses : దసరాకు ఏపీఎస్ఆర్టీసీ 6100, టీజీఎస్ఆర్టీసీ 5304 ప్రత్యేక బస్సులు, టికెట్లపై రాయితీలు
APSRTC TGSRTC Dasara Special Buses : దసరా పండగ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ, టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నాయి. ఏపీఎస్ఆర్టీసీ 6100, టీజీఎస్ఆర్టీసీ 5304 స్పెషల్ బస్సులు నడపనున్నట్లు పేర్కొన్నాయి. ఇరువైపులా టికెట్లు, ఏసీ బస్సుల్లో టికెట్ రాయితీ ఇస్తున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది.
APSRTC TGSRTC Dasara Special Buses : ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో ప్రయాణికుల ఇబ్బందులను తగ్గించేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి దసరాకు ప్రత్యేక బస్సులను నడపాలని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. సొంతూళ్లకు వెళ్లే వారి కోసం ఎంజీబీఎస్, జేబీఎస్, ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, సంతోష్ నగర్, కేపీహెచ్బీ, తదితర ప్రాంతాల నుంచి స్పెషల్ సర్వీసులను అందుబాటులో ఉంచనుంది. ఐటీ కారిడార్ ఉద్యోగుల సౌకర్యార్థం గచ్చిబౌలి ఓఆర్ఆర్ మీదుగా విజయవాడ, బెంగళూరు, తదితర ప్రాంతాలకు బస్సులను నడిపేలా ప్లాన్ చేసింది.
దసరా పండుగకు ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో ప్రయాణికులకు కల్పించాల్సిన సౌకర్యాలపై తమ క్షేత్ర స్థాయి అధికారులతో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ సమావేశమయ్యారు. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేయడంలో ఆర్టీసీ ఉద్యోగుల కృషి అభినందనీయమన్నారు. గత దసరాతో పోల్చితే ఈ సారి మహాలక్ష్మి పథకం అమలు వల్ల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని, గతంలో మాదిరిగానే ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. రద్దీని బట్టి ప్రత్యేక బస్సులను అందుబాటులో ఉంచాలన్నారు.
బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ప్రజలకు రవాణాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందని, ఈ పండుగలకు 5304 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 15వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని వివరించారు. ఈ ప్రత్యేక బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు చెప్పారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి రాష్ట్రం నలుమూలలతో పాటు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు వివరించారు.
ఏపీఎస్ఆర్టీసీ 6100 ప్రత్యేక బస్సులు
దసరా పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ప్రకటించింది. ఏపీలోని ఇతర జిల్లాలు, తెలంగాణ, చెన్నై, బెంగళూరు ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు పేర్కొంది. అక్టోబర్ 4 నుంచి 20వ తేదీ వరకు మొత్తంగా 6,100 బస్సులు నడపనున్నట్లు తెలిపింది.
అక్టోబర్ 4 నుంచి 11 వరకు దసరాకు ముందు 3,040 బస్సులు, అక్టోబర్ 12 నుంచి 20 వరకు దసరా తర్వాత మరో 3,060 బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ ఓ ప్రకటనలో పేర్కొంది. ప్రయాణికులపై ఎలాంటి భారం పడకుండా ఈ ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ ఛార్జీలే ఉంటాయని తెలిపింది. ముందస్తు రిజర్వేషన్ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇరువైపులా టికెట్ బుకింగ్ చేసుకున్న వారికి టికెట్ ధరలో 10 శాతం రాయితీ ఇస్తామని తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, తిరుపతి మధ్య నడిచే ఏసీ బస్సుల్లోనూ టికెట్ ఛార్జీలపై 10 శాతం రాయితీ అమలు చేస్తామన్నారు.