బాలికల పూర్తి చదువు - దేశ భవితకు వెలుగు: 7 వారాల క్యాంపెయిన్ ప్రారంభించిన CRY-cry launches poori padhai desh ki bhalai campaign aimed at full schooling for all girls in india ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  బాలికల పూర్తి చదువు - దేశ భవితకు వెలుగు: 7 వారాల క్యాంపెయిన్ ప్రారంభించిన Cry

బాలికల పూర్తి చదువు - దేశ భవితకు వెలుగు: 7 వారాల క్యాంపెయిన్ ప్రారంభించిన CRY

HT Telugu Desk HT Telugu
Jun 24, 2024 05:01 PM IST

బాలికల విద్య పట్ల సామాజిక వైఖరిని మార్చడానికి, అవగాహన పెంపొందించడానికి CRY - చైల్డ్ రైట్స్ అండ్ యు (CRY - Child Rights and You) దేశ వ్యాప్తంగా ఏడు వారాల 'పూరీ పఢాయీ దేశ్ కి భలాయీ' క్యాంపెయిన్ను ప్రారంభించింది.

దేశ వ్యాప్తంగా ఏడు వారాల 'పూరీ పఢాయీ దేశ్ కి భలాయీ' క్యాంపెయిన్ ప్రారంభించిన క్రై
దేశ వ్యాప్తంగా ఏడు వారాల 'పూరీ పఢాయీ దేశ్ కి భలాయీ' క్యాంపెయిన్ ప్రారంభించిన క్రై

అమరావతి, జూన్ 24, 2024: దేశ వ్యాప్తంగా ఇప్పటికీ లక్షలాది మంది బాలికలు పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. చాలా మంది బాలికల చదువు 10వ తరగతిలోపే ఆగిపోతోంది. ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి వరకు చేరుకోలేకపోతున్నారు.

ఈ నేపథ్యంలో భారతదేశపు ప్రముఖ బాలల హక్కుల స్వచ్ఛంద సంస్థ క్రై - చైల్డ్ రైట్స్ అండ్ యు ఏడు వారాల దేశవ్యాప్త అవగాహన, కార్యాచరణ క్యాంపెయిన్ 'పూరీ పఢాయీ దేశ్ కీ భలాయీ'ని ప్రారంభించింది.

బాలికలు పూర్తిగా చదువుకోవాల్సిన ఆవస్యకత గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించడం, ఈ అంశంపై సమాజంలో ఉన్న వైఖరులను మార్చడంతో పాటు.. ప్రతి బాలికను పాఠశాల లేదా కళాశాలలోకి తీసుకురావడానికి సమిష్టి కృషి చేయడం, తద్వారా వారు ఉన్నత మాధ్యమిక విద్యను పూర్తి చేసేలా చూడటం ఈ క్యాంపెయిన్ లక్ష్యం.

ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, కృష్ణా, అన్నమయ్య, తిరుపతి - నాలుగు జిల్లాల్లో సోమవారం ఈ క్యాంపెయిన్ ప్రారంభమైంది. అలాగే భారతదేశంలోని 20 రాష్ట్రాల్లో CRY ప్రాజెక్టులు కొనసాగుతున్న జిల్లాల్లోనూ క్యాంపెయిన్ మొదలైంది.

భారతదేశంలో చిన్నారులందరికీ 14 సంవత్సరాల వయస్సు వరకు సార్వత్రిక విద్యను అందించడానికి ఉద్దేశించిన ఉచిత నిర్బంధ విద్యా హక్కు (RTE) చట్టం అమలులోకి వచ్చి ఈ ఏడాది ఏప్రిల్‌ నెలకు 15 ఏళ్లు అయింది. సమాన విద్య సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (SDG లక్ష్యం - 4) అనుగుణంగా 2030 నాటికి సార్వత్రిక, ఉచిత, నాణ్యమైన విద్యను బాలబాలికల 18 సంవత్సరాల వయస్సు వరకు విస్తరించాలని జాతీయ విద్యా విధానం 2020 లక్ష్యంగా పెట్టుకుంది.

అయితే, ఇప్పటికీ చాలా మంది పిల్లలు, ముఖ్యంగా బాలికలు మాధ్యమిక (సెకండరీ), ఉన్నత మాధ్యమిక (హయ్యర్ సెకండరీ) విద్యకు దూరంగా ఉన్నారు. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ (UDISE +) 2021-22 నివేదిక గణాంకాల ప్రకారం.. భారతదేశంలోని ప్రతి ఐదుగురు బాలికలలో ముగ్గురు మాత్రమే ఉన్నత మాధ్యమిక స్థాయికి చేరుకున్నారు.

ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలి

ఈ సమస్యలను అధిగమించడానికి, CRY ఈ ఏడాది జూన్ 24న 'పూరీ పఢాయీ దేశ్ కీ భలాయీ' క్యాంపెయిన్ ప్రారంభించింది. భారత స్వాతంత్య్ర దినోత్సవం ఆగస్టు 15 వరకు ఈ క్యాంపెయిన్ కొనసాగుతుంది. విద్యలో లింగ అసమానతలను పరిష్కరించడానికి భాగస్వాములందరినీ కార్యోన్ముఖులను చేయడానికి ఈ క్యాంపెయిన్ ప్రయత్నిస్తుంది.

ఈ క్యాంపెయిన్ ప్రాధాన్యతను CRY సీఈఓ పూజా మార్వాహా వివరించారు. ‘‘బాలికలకు ఉన్నత మాధ్యమిక (హయ్యర్ సెకండరీ) విద్య లభించేలా చూడడం వారి సాధికారతకు మాత్రమే కాదు, దేశాభివృద్ధికీ చాలా కీలకం. ప్రాథమిక విద్య తర్వాత కూడా బాలికల చదువు కొనసాగేలా మద్దతు ఇవ్వడానికి నిర్దిష్ట కార్యాచరణ, లక్షిత జోక్యాలు అవసరం. బాలికల విద్యకు తగినన్ని నిధులు కేటాయించడం, ఆర్థిక ప్రోత్సాహకాలు అదించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంతో పాటు.. సమాజం పాలుపంచుకునేలా చేయాల్సి ఉంటుంది. బాల్య వివాహ నిరోధక చట్టాలను కూడా పటిష్టంగా అమలు చేయాలి. అయితే, బాలికల సంపూర్ణ విద్యకు సంబంధించి సామూహిక అవగాహన పెంపొందకుండా, దాని ఆవశ్యకత సామాజికంగా ప్రతిధ్వనించకుండా ఇవేవీ సాధ్యం కావు." అని పేర్కొన్నారు.

బాలికలు ఉన్నత పాఠశాల, ఇంటర్మీడియట్ చదువు పూర్తి చేయడం వల్ల సానుకూల ప్రభావాలను పూజ మార్వాహా నొక్కిచెప్పారు. ‘‘బాలికలకు ఉన్నత మాధ్యమిక విద్యను అందించడం వల్ల.. వారికి బాల్యవివాహాలు జరగవు. ఆ తర్వాత పెళ్లయి, తల్లయినపుడు.. ఆ తల్లీబిడ్డల ఆరోగ్యాలు మెరుగుగా ఉంటాయి. అంతేకాదు దీర్ఘకాలంలో అధిక ఆర్థిక రాబడులు లభిస్తాయి. ఇంకా, బాలికలు అదనంగా చదువుకునే ప్రతి ఒక్క విద్యా సంవత్సరం.. సంఘటిత రంగంలో బారి ఉత్పాదక భాగస్వామ్యాన్ని పెంచుతుంది. వారి ఉద్యోగ అవకాశాలను మెరుగుపరుస్తుంది. తద్వారా తరాలతరబడి కొనసాగుతున్న పేదరిక చట్రం విచ్ఛిన్నమవుతుంది’’ అని వివరించారు.

అధిగమించాల్సిన అడ్డంకులు

చదువులో బాలికలు ముందుకుసాగడానికి ఆటంకం కలిగిస్తున్న అడ్డంకుల గురించి CRY సౌత్ రీజనల్ డైరెక్టర్ జాన్ రాబర్ట్స్ వివరించారు. ‘‘సామాజిక-ఆర్థిక సవాళ్లు, సాంస్కృతిక కట్టుబాట్లు, లింగ వివక్ష, బాల్య వివాహాలు, పాఠశాల సదుపాయాల కొరత, దూరం ప్రయాణించాల్సి రావడం, బాలికల భద్రత సమస్యలు.. ఇవన్నీ బాలికలు చదువు పూర్తి చేయకుండా అవరోధాలు కల్పిస్తున్నాయి. ఈ అడ్డంకులు అధిక డ్రాప్ అవుట్ రేట్ పెరగడానికి దారితీస్తాయి. బాలికలు బాల కార్మికులుగా మారడానికి, వారి బాల్య వివాహాలకు, టీనేజ్ గర్భాలకు తోడ్పడతాయి. బాలికల దోపిడీకి, వారిపై అకృత్యాలకు, అక్రమ రవాణాకు కూడా ఎక్కువ అవకాశం కల్పిస్తాయి’’ అని పేర్కొన్నారు.

CRY ప్రారంభించిన ‘‘పూరీ పఢాయీ దేశ్ కీ భలాయీ’’ క్యాంపెయిన్ లక్ష్యాలను జాన్ రాబర్ట్స్ వివరించారు. “CRY తన భాగస్వామి సంస్థలతో కలిసి మా కార్యాచరణ ప్రాంతాలలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, మాధ్యమిక, మాధ్యమికోన్నత విద్యలో బాలికల నమోదు పెంచడానికి, ఆయా తరగతుల్లో వారు కొనసాగేలా చూడటానికి కృషి చేస్తుంది. పిల్లలు, వారి తల్లిదండ్రులు, కుటుంబాలు, విద్యావేత్తలు, సమాజంలోని సభ్యులు, ప్రభావశీలురు, ప్రభుత్వ అధికారులు, వివిధ స్థాయిల్లోని విద్యార్థులు, మీడియా సంస్థలు, కార్పొరేట్ సంస్థలతో పాటు.. ప్రజలందరినీ నిమగ్నం చేయడం ద్వారా బాలికల సంపూర్ణ విద్య ఆవస్యకతపై విస్తృతమైన అవగాహన కల్పించాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని వివరించారు.

WhatsApp channel