Amaravati Housing Sites: అమరావతిలో పేదలకు ఇళ్ళ స్థలాల పంపిణీ
Amaravati Housing Sites: గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన పేదలకు రాజధాని ప్రాంతంలో శుక్రవారం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. రెండు జిల్లాల్లోని ఆరేడు నియోజక వర్గాల పరిధిలో దాదాపు 50వేల మందికి ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు.
Amaravati Housing Sites: రాజధానిలో జగనన్న కాలనీల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహిస్తున్నారు. రాజధాని ఆర్5 జోన్‌లో జగనన్న కాలనీల్లో పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం జగన్మోహన్ రెడ్డి పాల్గొననున్నారు.
ఉదయం 9.50 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి ముఖ్యమంత్రి బయలుదేరి వెంకటపాలెం చేరుకుంటారు. అక్కడ ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రసంగించిన అనంతరం,జగనన్న కాలనీల్లోని పేదలకు ఇంటి స్ధలాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
పేదల సొంతింటి కలను సాకారం చేస్తు 26 వ తేదిన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వెంకటపాలెంలో సెంటు స్థలం పట్టాలను పేదలకు అందచేయనున్నారు. ఇదే వేదిక నుంచి ఇప్పటికే పూరైన టిట్కో గృహాలను కూడా లభ్ధిదారులకు అందచేస్తారు.
నిడమర్రు, నవులూరు గ్రామాలలో ఉన్న గృహాలను కూడా లబ్దిదారులకు అందచేయనున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇళ్ళు నిర్మాణం, మౌలిక సదుపాయాలు కల్పించిన ప్రభుత్వం అర్హత కలిగిన పేద వర్గాల ప్రజలకు టిడ్కో గృహాలను, సెంటు స్థలాన్ని లబ్దిదారులకు అంద చేయనున్నారు. మరోవైపు వై.యస్.ఆర్.జగనన్న గృహ పథకం లో భాగంగా సి.ఆర్.డి.ఎ. టిడ్కో ఇళ్లు కేటాయించిన లబ్దిదారులకు గృహ ప్రవేశాలకు అనుకూలంగా కావాల్సిన అన్ని సౌకర్యాలతో పూర్తి చేసినట్లు ప్రకటించారు.
శుక్రవారం ముఖ్యమంత్రి చేతులు మీదుగా ఇంటి విక్రయ దస్తావేజు అప్పగించనున్నట్లు వెల్లడించారు. మీ ఇంటి విక్రయ దస్తావేజు మరియు ఇతర సంబంధిత పత్రాలు చూపించి గృహ ప్రవేశాలు చేసుకోవాలని సిఆర్‌డిఏ ప్రకటించింది.
సీఎం చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ..
అమరావతిలో శుక్రవారం నిరుపేదలకు ఇళ్ల పట్టాభిషేకం జరగబోతోందని మంత్రి జోగి రమేష్ చెప్పారు. రాష్ట్ర చరిత్రలో నిల్చిపోయే ఒక అపురూప ఘట్టమని నిరుపేదలకు ఇళ్ల పట్టాలతో పాటు, ఇళ్ల పంపిణీ జరుగుతుందని వివరించారు. 50వేల మందికి పైగా లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలుపంపిణీ చేయబోతున్నట్లు చెప్పారను.
యుద్ధంలో పేదలదే గెలుపు..
ఇళ్ల స్థలాల పంపిణీ కోసం యుద్ధమే జరిగిందని నిరుపేదలు.. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పక్షాన నిలబడిన సీఎం, వారి కోసం న్యాయపోరాటం చేశారన్నారు.పెత్తందార్ల పక్షాన చంద్రబాబు.. అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. పేదలకూ సొంత ఇళ్లు ఉండాలని, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తపిస్తున్న ప్రభుత్వం తమదని, ఎట్టి పరిస్థితుల్లోనూ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వరాదని అడ్డుకున్న దుర్మార్గులు చంద్రబాబు అండ్ కో అని విమర్శించారు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి జిల్లా కోర్టులు మొదలు హైకోర్టు.. చివరకు సుప్రీంకోర్టు వరకు వెళ్లారని, పేదల పక్షాన పోరాడిన ప్రభుత్వం తన సంకల్పాన్ని సాధించుకుందన్నారు.
అమరావతిలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తే, సామాజిక సమతుల్యం (డెమొగ్రఫిక్ బ్యాలెన్స్) దెబ్బ తింటుందన్నారని అలా సామాజిక అంటరానితనం వస్తుందని ఎద్దేవా చేశారు. అంటే అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు నివసిస్తే రాజధానిలో అంటరానితనం వస్తుందంటే ఎంత దారుణమన్నారు.
చంద్రబాబు సమర్థిస్తున్న పెత్తందార్లకు పాలేర్లు కావాలి. పని వాళ్లు కావాలి కాని ఆ పని వాళ్లు అక్కడ ఉండకూడదన్నారు. ఆ పాలేర్లు రాజధానికి దూరంగా బతకాలన్నది చంద్రబాబు వైఖరి అన్నారు. అందుకే బాబుకు రాజకీయాల్లో ఉండే అర్హత ఏ మాత్రం లేదన్నారు.