YSR EBC Nestham: నేడు మార్కాపురంకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి-chief minister jaganmohan reddy will visit markapuram of prakasam district today ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ysr Ebc Nestham: నేడు మార్కాపురంకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

YSR EBC Nestham: నేడు మార్కాపురంకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Apr 12, 2023 06:20 AM IST

YSR EBC Nestham:రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన 4,39,068 మంది పేదలకు వైఎఎస్సార్‌ ఈబీసీ నేస్తాన్ని నేడు విడుదల చేయనున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే కార్యక్రమంలో లబ్దిదారులకు ముఖ్యమంత్రి నిధులు బదిలీ చేయనున్నారు.

నేడు మార్కాపురంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
నేడు మార్కాపురంలో పర్యటించనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

YSR EBC Nestham: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ సామాజిక వర్గాలకు చెందిన వారికి అమలు చేస్తున్న వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకం నిధులు నేడు విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 4,39,068 మంది పేద మహిళలకు రూ. 658.60 కోట్ల ఆర్ధిక సాయాన్ని ప్రకాశం జిల్లా మార్కాపురంలో జరిగే కార్యక్రమంలో సిఎం జగన్మోహన్ రెడ్డి లబ్దిదారుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు.

వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా 45 నుండి 60 ఏళ్ళలోపు ఉన్న రెడ్డి, కమ్మ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ, క్షత్రియ, వెలమలతో పాటు ఇతర ఓసీ వర్గాలకు చెందిన పేద మహిళలకు ఏటా రూ. 15,000 చొప్పున 3 ఏళ్ళలో మొత్తం రూ. 45,000 ఆర్ధిక సాయం చేశారు. ఈ నిధులతో మహిళలు సొంత వ్యాపారాలు చేసుకుని వారి కాళ్ళ మీద వారు నిలబడేట్టుగా తోడ్పాటు అందిస్తున్నారు.

మేనిఫెస్టోలో చెప్పిన 98.44 శాతం హామీలు నెరవేర్చడంతో పాటు, మేనిఫెస్టోలో చెప్పకపోయినా ప్రతి పేద అక్కచెల్లెమ్మకు మంచి జరగాలని, వారి కుటుంబాలు బాగుండాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం వైఎస్సార్‌ ఈబీసీ నేస్తాన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం చెబుతోంది.

నేడు లబ్దిదారులకు విడుదల చేస్తున్న రూ. 658.60 కోట్లతో కలిపి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా అందించిన మొత్తం సాయం రూ. 1,257.04 కోట్లుగా ఉంది. ఒక్కో మహిళకు ఇప్పటివరకు రూ. 30,000 వరకు ఆర్ధిక సాయం అందించారు.

వివిధ పథకాల ద్వారా గత 46 నెలల్లో రూ. 2,25,991.94 కోట్ల రుపాయల ప్రత్యక్ష నగదు బదిలీ, పరోక్ష బదిలీ పథకాలతో లబ్ది చేకూర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు రాష్ట్రంలో వలంటీర్‌ ఉద్యోగాలను 2.65 లక్షల మందికి ఇస్తే వీరిలో 1.33 లక్షల మంది మహిళలు ఉన్నారని, 1.34 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో 51 శాతం మహిళలే ఉన్నారని ప్రభుత్వం చెబుతోంది.

రాష్ట్రంలో నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టుల్లో చట్టం చేసి 50 శాతం మహిళలకే కేటాయించామని, నామినేటెడ్‌ కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌లుగా 51 శాతం మహిళలకు దక్కాయని, డైరెక్టర్, మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్‌పర్సన్, రాజకీయ నియామకాల్లో 50 శాతంపైగా పదవులు మహిళలకు ఇచ్చామని ప్రభుత్వం చెబుతోంది.

శాసనమండలిలో తొలిసారిగా డిప్యూటీ చైర్‌పర్సన్‌గా మహిళకు అవకాశం కల్పించారని, కేబినెట్‌లో ఉప ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన మహిళలకు అవకాశం ఇచ్చినట్లు ఏపీ సర్కారు చెబుతోంది. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్, వైస్‌ చైర్‌పర్సన్, మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు మెంబర్, మున్సిపల్‌ చైర్‌పర్సన్, సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జెడ్పీటీసీ పదవుల్లో 50–60 శాతం పైగా మహిళలకు దక్కాయంటున్నారు.

Whats_app_banner