Chandrababu Campaign: నెలాఖరు నుంచి బాబు బస్సు యాత్రలు?
Chandrababu Campaign: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మళ్లీ జనంలోకి వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే నెలాఖరు నుంచి చంద్రబాబు తిరిగి ప్రజల్లోకి వచ్చేందుకు కసరత్తు చేస్తున్నారు.
Chandrababu Campaign: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఏపీలో విస్తృతంగా పర్యటించేందుకు రెడీ అవుతున్నారు. అన్నీ అనుకూలిస్తే నెలాఖరు నుంచి బాబు యాత్రలు ప్రారంభం కావొచ్చని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దాదాపు రెండున్నర నెలలుగా స్తబ్దుగా ఉన్న టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం తెచ్చేందుకు చంద్రబాబు సిద్ధం అవుతున్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసుతో పాటు చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వం పలు కేసులు నమోదు చేసింది. వీటిలో పలు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. మరికొన్ని కేసుల్లో బెయిల్ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ తీర్పు వెలువడాల్సి ఉంది.
సెప్టెంబర్ 9న చంద్రబాబు నాయుడిని ఏపీ సిఐడి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్ట్ చేశారు. 10వ తేదీన ఏసీబీ కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. 53రోజుల పాటు రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న తర్వాత చంద్రబాబుకు ఆరోగ్య కారణాలతో బెయిల్ మంజూరైంది. మరోవైపు చంద్రబాబు రిమాండ్‌లో ఉన్న సమయంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కూడా నిలిచిపోయింది. నవంబర్ 24వ తేదీ నుంచి పాదయాత్రను పునరుద్ధరించేందుకు ఇప్పటికే నిర్ణయించారు.
చంద్రబాబు ఎదుర్కొంటున్న కేసులు నవంబరు నెలాఖరుకు కొలిక్కి వస్తాయని టీడీపీ బలంగా నమ్ముతోంది.కొన్ని కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరైంది. స్కిల్ కేసులో సాంకేతికంగా చంద్రబాబుకు ఎలాంటి ఆంక్షలు లేని బెయిల్ కంటే, కేసు నుంచి నిరపరాధిగా బయటపడటానికే బాబు లీగల్ టీమ్ ప్రయత్నిస్తోంది. బెయిల్ లేదా క్వాష్ పిటిషన్లలో ఏదొక ఊరట ఖచ్చితంగా నవంబర్ 28లోగా లభిస్తుందని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి ఊరట దక్కిన వెంటనే ప్రజల్లోకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
ఓ వైపు ఏపీలో అధికార పార్టీ రకరకాల కార్యక్రమాల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. జగన్న ఆరోగ్య సురక్ష, సామాజిక బస్సు యాత్రలతో పాటు, ఇంటింటికి పార్టీ చేపట్టిన ప్రగతిని వివరించేలా పలు కార్యక్రమాలను రూపొందించారు. జనవరి చివరి వరకు దాదాపు మూడు నెలలకు సరిపడ షెడ్యూల్‌ను వైసీపీ ఇప్పటికే స్టార్ట్ చేసింది.ఇంటింటి ప్రచార కార్యక్రమాల షెడ్యూల్‌ను ఆ పార్టీ ఇప్పటికే ఖరారు చేసింది.
ఇటు టీడీపీలో మాత్రం చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాజకీయంగా స్తబ్దత నెలకొంది. పార్టీని నడిపించే నాయకుడు అందుబాటులో లేకపోవడంతో మిగిలిన వాళ్లు ఏమి చేయలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయం టీడీపీ ఎదుర్కొన్న గడ్డు పరిస్థితికి అడ్డు పట్టింది. ఆంక్షలు, అడ్డంకులు, రాజకీయ ఇబ్బందులను అధిగమించి నాయకులందర్నీ ఒక్క తాటిపై నడిపించే శక్తి కొరవడటం స్పష్టమైంది.
దీంతో చంద్రబాబు వీలైనంత త్వరగా పార్టీని యాక్టివేట్ చేయాలని భావిస్తున్నారు. నెలాఖరు నుంచి కుప్పం నుంచి చంద్రబాబు రాజకీయ యాత్రను ప్రారంభించాలని భావిస్తున్నారు. తొలి దశలో విజయవాడ వరకు దీనిని చేపడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
జనసేనతో ఇప్పటికే టీడీపీ పొత్తు ఖాయం కావడంతో గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో ప్రచారం బాధ్యతలు పవన్ కళ్యాణ్‌కు అప్పగించే ఆలోచన చేస్తున్నారు. రెండు పార్టీలు కలిసి ఉమ్మడి ప్రచారాన్ని నిర్వహించేందుకు వీలుగా సమన్వయంతో ముందుకు సాగాలని ఇప్పటికే అవగాహనకు వచ్చారు. ప్రచారం విషయంలో కూడా రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తకుండా జాగ్రత్త పడుతున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించాల్సి ఉండటంతో డిసెంబర్ మొదటి వారంలో పవన్ షెడ్యూల్‌పై స్పష్టత వస్తుందని చెబుతున్నారు.