YS Bhaskar reddy: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి బెయిల్ మంజూరు..-cbi court granted bail to ys bhaskar reddy due to ill health ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Bhaskar Reddy: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి బెయిల్ మంజూరు..

YS Bhaskar reddy: వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి బెయిల్ మంజూరు..

HT Telugu Desk HT Telugu
Sep 21, 2023 07:09 AM IST

YS Bhaskar reddy: వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వైఎస్‌.భాస్కర్‌ రెడ్డికి సిబిఐ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. వివేకాహత్య కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్‌ రెడ్డికి 12రోజుల పాటు ఎస్కార్ట్‌తో కూడిన బెయిల్ మంజూరైంది.

వైఎస్ భాస్కర్ రెడ్డికి  బెయిల్ మంజూరు
వైఎస్ భాస్కర్ రెడ్డికి బెయిల్ మంజూరు

YS Bhaskar reddy: వివేకా హత్య కేసులో వైఎస్‌ భాస్కర్‌రెడ్డికి ఎస్కార్ట్‌‌తో కూడిన బెయిల్‌ మంజూరు అయ్యింది. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో సాక్ష్యాలను మాయం చేయడంతో పాటు హత్యకు కుట్ర పన్నారనే అభియోగాలతో వైఎస్‌ భాస్కర్‌ రెడ్డికి రిమాండ్‌లో ఉన్నారు. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలని కోరడంతో 12 రోజుల ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. అనారోగ్య కారణాల రీత్యా 15 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కోరుతూ భాస్కర్‌రెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

భాస్కర్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై చంచల్‌గూడ జైలు అధికారులు న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. నివేదిక పరిశీలించిన సీబీఐ కోర్టు భాస్కర్‌రెడ్డికి సెప్టెంబరు 22 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు 12 రోజుల పాటు ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. హైదరాబాద్‌ విడిచి వెళ్లరాదని ఆదేశించింది. వివేకా హత్యకేసులో ఏ5 నిందితుడిగా ఉన్న భాస్కర్‌రెడ్డి.. ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు.

మరోవైపు వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శివశంకర్‌రెడ్డి కూడా బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. శివశంకర్‌ రెడ్డి పిటిషన్ సిబిఐ ప్రత్యేక కోర్టు కొట్టివేసింది. వైఎస్ వివేకా హత్య కేసులో A5గా ఉన్న శివశంకర్‌రెడ్డి బెయిల్‌ కోసం పలు మార్లు ప్రయత్నించారు. తాజాగా శివశంకర్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కొట్టివేస్తూ సీబీఐ కోర్టు తీర్పు వెలువరించింది.

ఇదే కేసులో నిందితుడు సునీల్ యాదవ్‍కు కూడా తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. సునీల్ యాదవ్‍కు బెయిల్ దరఖాస్తును తెలంగాణ హైకోర్టు గతంలో తోసిపుచ్చింది. సునీల్ యాదవ్ పిటిషన్‌లో సరైన వాదనలు లేవంటూ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసింది.

Whats_app_banner