Canara Aspire: సేవింగ్స్ బ్యాంక్ ఖాతాతో ఉచితంగా ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులు.. ఎలా అంటే…
Canara Aspire: యూత్ కోసం కెనరాా బ్యాంక్ కొత్త పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఖరీదైన ఆన్‌లైన్ కోర్సుల్ని ఉచితంగా పూర్తి చేసే వీలు కల్పిస్తోంది. కెనరా అస్పైర్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ప్రొడక్ట్‌తో ఉచితంగా సేవింగ్స్ అకౌంట్‌తో పాటు ఆన్‌లైన్ కోర్సులు పూర్తి చేయొచ్చు.
Canara Aspire: యువత కోసం ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్ కొత్త ప్రొడక్ట్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్‌ను ప్రారంభించడం ద్వారా విద్యార్థులు, యువతకు బోలెడు ప్రయోజనాలు అందిస్తోంది.
ఇందుకోసం ఆన్‌లైన్ కోర్సుల్ని అందించే కోర్సెరాతో ఒప్పందం కుదుర్చుకుంది. కెనరా బ్యాంకులో సేవింగ్స్ బ్యాంకు ఖాతాను ప్రారంభించే 18-28 ఏళ్ల మధ్య వయసున్న యువతకు ఆన్లైన్ కోర్సుల్ని ఉచితంగా పూర్తి చేసే అవకాశం కల్పిస్తోంది.
బ్యాంకు ఖాతాను ప్రారంభిస్తే రెండు ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సులను పూర్తి చేయొచ్చు. విద్యార్ధులు కోర్సెరా అందించే ఏదైనా రెండు సర్టిఫికెట్ కోర్సులను ఆన్‌లైన్ పూర్తి చేయొచ్చు. ఈ ఖాతాలను జీరో బ్యాలెన్స్‌తో నిర్వహించుకోవచ్చు. కోర్సులను పూర్తి చేసే సమయంలో ఖాతాదారులు మూడు నెలల కనీస బ్యాలెన్స్ రూ.5వేలు ఖాతాలో ఉండాలి. ఈ మొత్తాన్ని ఖాతాదారులు తర్వాత విత్ డ్రా చేసుకోవచ్చు.
18-28ఏళ్ల మధ్య విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండే యువతకు ఉపయోగపడే ఆన్‌లైన్ సర్టిఫికెట్ కోర్సుల్ని ఈ సేవింగ్స్ ఖాతా ద్వారా ఎంచుకోవచ్చు. ఇక ఈ ఖాతాతో విద్యా రుణం తీసుకునే వారికి వడ్డీపై 0.50శాత్ రాయితీ కూడా ఇస్తారు. ఏటిఎం కార్డును కూడా జారీ చేస్తారు.
డెబిట్ కార్డు ద్వారా ఎయిర్ పోర్ట్ లాంజ్, అమెజాన్, బుక్ మై షో, గానా, స్విగ్గీ వంటి సంస్థల ఆఫర్లను కూడా అందిస్తారు. విద్యార్థులు భవిష్యత్తులో ఈ ఖాతాలను ప్రీమియం ఖాతాలుగా అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కూడా కల్పిస్తారు. పూర్తి వివరాలకు కెనరా బ్యాంకు బ్రాంచిలలో సంప్రదించవచ్చు.