Flood Compensation: ప్రహసనంగా మారిన బుడమేరు వరద నష్టం లెక్కింపు… సచివాలయ సిబ్బందే కారణమా…?
Flood Compensation: బుడమేరు వరద బాధితుల చుట్టూ కొత్త రాజకీయం మొదలైంది. బుడమేరు ఉగ్రరూపంతో సర్వం కోల్పోయిన బాధితుల్ని ఉదారంగా ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంటే అందులో రాజకీయ జోక్యంతో అసలు లక్ష్యం పక్కదారి పడుతోంది.
Flood Compensation: బుడమేరు వరద బాధితుల్ని ఉదారంగా ఆదుకోడానికి ఏపీ ప్రభుత్వం జీవో జారి చేసింది. వరదల్లో ముంపుకు గురైన ప్రతి ఇంటికి రూ.25వేల పరిహారం ప్రకటించింది. మొదటి, రెండో అంతస్తుల్లో ఉంటున్న వారికి కూడా పరిహారాన్ని చెల్లించేలా మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు గత రెండ్రోజులు వరద బాధితుల జాబితాలను సచివాలయాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ క్రమంలో పలు ప్రాంతాల్లో బాధితులు తమ పేర్లు గల్లంతయ్యాయని ఆందోళనకు దిగడం కలకలం రేపుతోంది.
ఆగస్టు 30,31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలతో సెప్టెంబర్ 1 తెల్లవారుజామున బుడమేరుకు గండ్లు పడటంతో వరద నీరు విజయవాడను ముంచెత్తింది. ఆదివారం ఉదయం 10గంటల్లోపు సగరం నగరం నీట మునిగిపోయింది. వరద ముంపును రెవిన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మునిసిపల్ సిబ్బంది ఏ మాత్రం ఊహించకపోవడంతో లక్షలాది మంది ప్రజలు వరదల్లో చిక్కుకున్నారు. మొదటి రెండు రోజులు కనీసం నగరంలో ఎంత భాగం మునిగిపోయిందో కూడా అంచనా వేయలేకపోయారు.
ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా విజయవాడలో మకాం వేసి వరద సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. రాష్ట్రం నలుమూలల నుంచి అధికారుల్ని విజయవాడకు రప్పించి బాధ్యతలు అప్పగించారు. సెప్టెంబర్ 10-12 తేదీల వరకు నగరంలోని పలు ప్రాంతాలు వరద ముంపులోనే ఉన్నాయి. ఈ క్రమంలో వరద నష్టాన్ని వేగంగా అంచనా వేసి బాధితుల్ని ఆదుకోడానికి 48గంటల్లో నష్టం లెక్కించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి రప్పించిన 1700మంది సిబ్బందితో ఇంటింటికి వెళ్లి నష్టాన్ని గణించారు.
అప్పటికి వరద తీవ్రత తగ్గకపోవడంతో చాలామంది బాధితులు తమ ఇళ్లకు చేరుకోలేదు. ప్రధానంగా బుడమేరు పరివాహక ప్రాంతాల్లో ఉన్న లక్షలాది మందికి పేర్లను ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన అధికారులు గణించలేదు. మొదట చేపట్టిన నష్ట గణన తర్వాత సచివాలయ సిబ్బందితో మరోసారి బాధితుల్ని గుర్తించారు. ఈ క్రమంలో స్థానిక వాలంటీర్ల సేవల్ని కూడా అక్కడక్కడ వినియోగించుకున్నారు.
ఆ తర్వాత కూడా వరద బాధితుల లెక్కింపు ప్రక్రియ కొనసాగింది. గత ఆది, సోమవారాల్లో బాధితుల జాబితాలను నగరంలోని 179 సచివాలయాల్లో ప్రదర్శించారు. ఆ జాబితాల్లో బాధితుల పేర్లు పెద్ద సంఖ్యలో గల్లంతయ్యాయి. ముఖ్యమంత్రి ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబానికి పరిహారం ఇస్తామని ప్రకటించడంతో చాలా మ్యాపింగ్‌లో లేని కుటుంబాలు గల్లంతయ్యాయి. కొద్ది నెలలుగా అద్దెలకు వచ్చిన వారు, నగరంలో ఉంటూ సొంతూళ్లలో మ్యాపింగ్ చేసుకున్న వారి పేర్లు పరిహారం జాబితాలో లేకుండా పోయాయి. దీంతో గందరగోళం నెలకొంది.
సచివాలయ సిబ్బంది ఉదాసీనతే అసలు కారణం…
వరద సహాయక చర్యల్లో సచివాలయ సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వరద నష్టం లెక్కించడంలో అన్ని డివిజన్లలో నష్టం లెక్కింపు పూర్తైందని భావించారు. ముఖ్యమంత్రి ప్రకటించిన పరిహారం వచ్చే వరకు నమ్మకం లేదంటూ కొన్ని చోట్ల సచివాలయ సిబ్బందే ప్రచారం చేశారు. వరద నష్టం అన్యూమరేషన్ తప్పనిసరి కాదంటూ మభ్య పెట్టారు. దీంతో చాలామంది దానిని పట్టించుకోలేదు. మరోవైపు గత నాలుగు నెలలుగా జీతాలు లేని వాలంటీర్లు వరద బాధితుల నమోదును సీరియస్‌గా పట్టించుకోలేదు. సెప్టెంబర్ 25న పరిహారం చెల్లిస్తామని ప్రకటించేసరికి ప్రజల్లో అలజడి మొదలైంది.
మొదట్లో వరద బాధితులు తమ ఇళ్ళకు సర్వేకు ఎవరు రాలేదని చెప్పినా సచివాలయం సిబ్బంది సర్వేతో ఏమి రాదని ప్రచారం చేశారు. అనవసరంగా హైరానా పడకండి అని జనాన్ని మభ్య పెట్టారు. మొదట్లో నష్టం గణన విషయంలో బాదితుల నుంచి ఫిర్యాదులు రావడంతో మళ్ళీ రెండో సారి సచివాలయం ఉద్యోగులకు బాధ్యత అప్పగించారు. అప్పుడు కూడా వాళ్ళు మొదట చేసిన వాళ్ళు పని పూర్తి చేసేసి ఉంటారని పట్టించుకోలేదు. వరద ముంపులో సర్వం కోల్పోయిన బాధితుల వివరాలు నమోదు చేయడంలో మెజార్టీ సచివాలయం ఉద్యోగుల నిర్లక్ష్యంగా వ్యవహరించారు.
వరదల్లో మునిగిన 179 సచివాలయాల పరిధిలో వాలంటీర్లతో మూడో సారి సర్వే చేసారు. వాళ్ళేమో తమకు నాలుగు నెలల నుంచి జీతాలు లేవని పట్టించుకోలేదు. దాని ఫలితమే జనం తమ పేర్లు లేవని గగ్గోలు పెడుతున్నారు.
వరదలు లేని ప్రాంతాల్లో ఆందోళనలు…?
మరోవైపు విజయవాడలో బుడమేరు వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో దాదాపు పదిరోజుల పాటు నీటి ముంపు కొనసాగింది. నగరంలోని ఔట్ ఫాల్ డ్రెయిన్ల నుంచి మురుగు నీటి ప్రవాహం లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో కార్పొరేషన్ డ్రెయిన్లు పొంగాయి. బుడమేరు వరద బాధితులతో సమానంగా తమకు కూడా పరిహారం చెల్లించాలని మంగళవారం కొందరు ఆందోళనకు దిగారు.
బుడమేరు వరద ముంపుకు గురైన ప్రాంతంలో బాధితులు పది రోజుల పాటు నీటిలో ఉండాల్సి వచ్చింది. అదే సమయంలో కృష్ణానదికి వచ్చిన వరదల్లో కరకట్ట దిగువన కొన్ని ప్రాంతాల్లో రెండు, మూడు రోజులు వరద నీరు వచ్చింది. వారికి కూడా రూ.10వేల పరిహారాన్ని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో వరద ముంపు లేని ప్రాంతాల్లో కూడా ముంపు పరిహారం కోసం ఆందోళనలు జరిగాయి. వీటి వెనుక రాజకీయ కారణాలు ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి వెనుక భాగంలో ఉండే కొండ ప్రాంత ప్రజలు, వరద ముంపు తాకని ప్రాంతాల్లో కూడా పరిహారం కోసం ఆందోళనలు జరుగుతున్నాయని పోలీసులు గుర్తించారు. మరోవైపు కృష్ణా నది వరదల్లో మునిగిన బాధితుల లెక్కింపులో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
సంబంధిత కథనం