Monecy Circulation Scam : చీటీలంటూ జనాలకు టోపీ…విశాఖలో బోర్డు తిప్పేసిన వ్యాపారి-business man cheats local for lacs of rupees with money circulation scheme in visakha patnam ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Monecy Circulation Scam : చీటీలంటూ జనాలకు టోపీ…విశాఖలో బోర్డు తిప్పేసిన వ్యాపారి

Monecy Circulation Scam : చీటీలంటూ జనాలకు టోపీ…విశాఖలో బోర్డు తిప్పేసిన వ్యాపారి

HT Telugu Desk HT Telugu
Dec 11, 2022 09:39 AM IST

Monecy Circulation Scam అధిక వడ్డీలపై జనం అత్యాశ, పెట్టుబడులపై భారీ లాభాలు జనం కొంప ముంచాయి. విశాఖపట్నంలో ఓ వ్యాపారి నిత్యావసర వస్తువులపై లాభాలంటూ జనాన్ని ముంచేశాడు. డబ్బులు కట్టిన వాళ్లు సరుకులు అందక, డబ్బులు పొందక లబోదిబోమంటూ పోలీసుల్ని ఆశ్రయించారు.

విశాఖలో మనీసర్క్యలేషన్ స్కాం....
విశాఖలో మనీసర్క్యలేషన్ స్కాం.... (HT_PRINT)

Monecy Circulation Scam మనీ సర్క్యులేషన్ స్కీంలు ఎన్ని రకాలుగా జనాల్ని మోసం చేయాలో అన్ని రకాల మోసాలు వెలుగు చూస్తున్నా, జనం మాత్రం కొత్త స్కాముల్లో చేతులు కాల్చుకుంటూనే ఉన్నారు. జనం అత్యాశ ఆసరాగా రకరకాల మోసాలు వెలుగు చూస్తున్నాయి. విశాఖలో పప్పులు, సరుకుల మీద లాభాలంటూ చిట్టీలు వసూలు చేసిన జనాలకు టోపీ పెట్టాడో వ్యాపారి. పప్పుల చీటీలంటూ వినియోగదారులను ఆకట్టుకుని, డబ్బులు వసూలు చేసి ఆ తర్వాత మాయమైపోయాడు. దీంతో న్యాయం చేయాలంటూ పోలీసుల్ని ఆశ్రయించారు.

విశాఖపట్నం పూర్ణామార్కెట్‌కు చెందిన మణికుమార్‌ పదేళ్ల క్రితం స్థానికంగా 9 స్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ రైస్‌, ఆయిల్‌ హోల్‌సేల్‌ దుకాణం ప్రారంభించాడు. బియ్యం, పప్పులు, నూనెలను తక్కువ ధరలకిస్తూ స్థానికుల విశ్వాసం చూరగొన్నాడు. దుకాణానికి వచ్చే శాశ్వత వినియోగదారులు పెరగడంతో చీటీలను ప్రారంభించారు.

నెలకు రూ.500 చొప్పున చెల్లిస్తే ఏడాదికి జమ అయ్యే రూ.6 వేలకు మరో రూ.2వేలు కలిపి రూ.8వేల విలువైన సరకులను వినియోగదారులకు అందచేస్తానని ప్రచారం చేశాడు. ఈ కార్యక్రమానికి సంక్రాంతి, దసరా, వినాయక చవితి పప్పుల చీటీలుగా పేరు పెట్టి, చైన్‌ తరహాలో పథకాన్ని అమలు చేశాడు. చిట్టీలు కట్టిన వినియోగ దారుడు తన తరఫున ఎవరినైనా పథకంలో చేర్పిస్తే వారికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేవాడు. దీంతో పూర్ణ మార్కెట్‌లో పనిచేసే కూలీలు, ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, గృహిణులు, కూరగాయల విక్రేతలు, సన్నకారు రైతులు, మధ్య తరగతి ప్రజలు వందల మంది స్కీంలో చేరి స్కాం పాలయ్యారు. కొంతమంది అధిక వడ్డీ లభిస్తోందని నాలుగైదు చీటీలు కూడా కట్టారు.

ఏడాది నుంచి మణికుమార్ చెల్లింపుల క్రమం తప్పింది. గత ఏడాది మణికుమార్‌ గుండెకు శస్త్రచికిత్స జరిగింది. దీంతో దుకాణానికి రావడం తగ్గించాడు. చీటీలు వేసిన వారికి పండుగలకు సరకులనూ కూడా ఇవ్వలేదు. దాంతో కొందరు సభ్యత్వాన్ని విరమించుకున్నారు. తమ డబ్బులనూ వెంటనే చెల్లించాలని మిగిలిన వారంతా ఒకేసారి ఒత్తిడి తెచ్చారు.

శనివారం అందరికీ సరకులు లేదంటే డబ్బులు చెల్లిస్తానని వారం రోజుల క్రితం మణికుమార్‌ హామీ ఇచ్చాడు. శనివారం 60 మంది వరకు దుకాణం వద్దకు చేరుకున్నారు. మణికుమార్‌ దుకాణానికి రాకపోవడంతో మోసపోయినట్లు గ్రహించారు. దీనిపై విశాఖ వన్ టౌన్‌ పోలీసులకు పిర్యాదు చేశారు. మణికుమార్‌ గతంలోనూ ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో తేలిందని సిఐ రేవతి తెలిపారు. పూర్ణా మార్కెట్‌లో బాధితుల నుంచి రూ.60-70 లక్షల వరకు వసూలు చేసి ఉంటాడని అంచనా వేశారు. నిందితుడి అచూకీ కోసం గాలిస్తున్నారు.

Whats_app_banner