Minig and PCB Files: విజయవాడలో మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దగ్ధం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు-burning of mining and pollution control board files blocked tdp ranks ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Minig And Pcb Files: విజయవాడలో మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దగ్ధం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

Minig and PCB Files: విజయవాడలో మైనింగ్, కాలుష్య నియంత్రణ మండలి దస్త్రాల దగ్ధం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులు

Sarath chandra.B HT Telugu
Jul 04, 2024 06:40 AM IST

Minig and PCB Files: కాలుష్యనియంత్రణ మండలి మాజీ ఛైర్మన్ ఆదేశాలతో పెద్ద ఎత్తున ఫైల్స్ తగులబెట్టిన వ్యవహారం విజయవాడలో కలకలం రేపింది. బుధవారం రాత్రి కృష్ణాకరకట్టపై బస్తాల్లో ఫైల్స్ దగ్ధం చేస్తుడంటంతో టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు.

కృష్ణా కరకట్టపై దగ్ధం చేసిన మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్‌
కృష్ణా కరకట్టపై దగ్ధం చేసిన మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఫైల్స్‌

Minig and PCB Files: మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్‌ బోర్డులకు చెందిన రికార్డులను గుట్టు చప్పుడు కాకుండా ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి కృష్ణా కరకట్టపై పెద్ద ఎత్తున బస్తాల్లో తీసుకొచ్చిన ఫైల్స్‌, దస్త్రాలను డ్రైవర్లు దగ్ధం చేస్తుండగా టీడీపీ కార్యకర్తలు గుర్తించారు.

యనమలకుదురు ‌కట్ట మీద రోడ్డు వెంట బస్తాల్లో తెచ్చిన రికార్డుల్ని తగుల బెడుతుండటంతో గుర్తించిన స్థానికులు వారిని ప్రశ్నించారు. ఇప్పటికే మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, ఇసుక తవ్వకాల వ్యవహారంపై స్థానికులకు అవగాహన ఉండటంతో వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో ఫైల్స్ దగ్ధం చేస్తున్న వారు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించడంతో వారిని వెంటపడి పట్టుకున్నారు.

మైనింగ్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు చెందిన పత్రాలు, హార్డ్ డిస్క్‌లు దగ్ధమయ్యాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ ఆదేశాలతో పత్రాలను దగ్దం చేశామని డ్రైవర్ వివరించాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మాజీ ఛైర్మన్ సమీర్ శర్మ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న నాగరాజు మరొకరితో కలిసి ఫైల్స్‌ దగ్ధం చేసినట్టు గుర్తించారు.

గత ప్రభుత్వంలో సిఎంఓలో పనిచేసిన రేవు ముత్యాల రాజుకు ఓఎస్‌డిగా ఉన్న సాయి గంగాధర్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో సీనియర్ ఎ.ఎమ్‌గా కూడా విధులు నిర్వర్తించాడు. సిఎంఓతో పాటు మైనింగ్‌ శాకలో కూడా సాయి గంగాధర్ విధులు నిర్వర్తించినట్టు తెలుస్తోంది. మైనింగ్ శాఖ హెడ్ ఆఫీసులో సెక్షన్ హెడ్ శ్రీనివాస్, సమీర్ శర్మ ఒఎస్‌డి రామారావుల‌ సూచనతో ఫైల్స్‌ తరలించినట్టు డ్రైవర్ నాగరాజు పోలీసులకు వివరించాడు.

సమీర్ శర్మ ఆదేశాలతో కార్యాలయంలో ఉన్న డాక్యుమెంట్లు, హార్డ్ డిస్క్ లు గోను సంచుల్లో దాచిపెట్టామని, ఆ తర్వాత వాటిని కారుల్లో ఎక్కించుకుని తెచ్చి దగ్ధం చేసినట్లు వివరించాడు. కాలుష్య నియంత్రణ మండలి, ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థలకు చెందిన బస్తాల కొద్దీ దస్త్రాలు ఈ ఘటనలో కాలిపోయాయి. గత ప్రభుత్వ హయంలో ఇసుక తవ్వకాలు, అమ్మకాలకు సంబంధించిన వివరాలతో పాటు అనధికారిక చెల్లింపుల వివరాలు బయట పడకుండా వ్యవహరించే క్రమంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది.

బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఏపీ16 ఈఎఫ్‌ 2596 నంబరు ఇన్నోవా కారులో ఫైల్స్ తరలించారు. వాహనంపై ప్రభుత్వ వాహనం అనే స్టిక్కర్‌ ఉంది. పెనమలూరు మండలం పెదపులిపాక సమీపంలోని శ్రీనగర్‌ కాలనీ వద్ద కారు నిలిపి, అందులో ఉన్న బస్తాల్లోని దస్త్రాలను కరకట్టపై తగలబెట్టారు. ఆ దస్త్రాలపై మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కాలుష్య నియంత్రణ మండలి మాజీ ఛైర్మన్‌ సమీర్‌శర్మ చిత్రాలు ఉండడంతో వాటిని చూసిన వారు పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ నేతలకు సమాచారం అందించారు.

దీంతో వారు అక్కడకు చేరుకున్నారు. ఈ లోపు ఇన్నోవా వాహనంలో వచ్చిన వారు అక్కడి నుంచి పరారయ్యారు. యనమలకుదురులో టీడీపీ నేతలు ఆ వాహనం అడ్డుకుని ప్రశ్నించడంతో విషయం బయటపడింది. డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు.

Whats_app_banner