Bjp Somu Veerraju : సెప్టెంబర్ 19 నుంచి ఏపీలో బీజేపీ బహిరంగ సభలు
Bjp Somu Veerraju సెప్టెంబర్ 19 నుంచి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో స్ట్రీట్ మీటింగ్‌ల నిర్వహణకు సిద్ధమవుతున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. మోడీ పరిపాలన, సంక్షేమ పధకాల పై ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ప్రజా పోరు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ వైఫల్యాలను ఎండగడతామన్నారు.
ఏపీలో ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో విస్తృత ప్రచారం నిర్వహిస్తామని ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు. ప్రజా పోరు యాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లి వైసీపీ వైఫల్యాలను ఎండగడతామన్నారు. కేంద్రం కోవిడ్ సమయంలో ప్రారంభించిన ఉచిత బియ్యం పథకాన్ని రెండేళ్లు అమలు చేసి జగన్ ప్రభుత్వం చేతులు ఎత్తేసిందని ఎద్దేవా చేశారు. బీజేపీ పోరాటం తరువాత పంపిణీ చేస్తున్నారని, అది కూడా కొన్ని జిల్లాలో కొంతమందికే పరిమితం చేశారని ఆరోపించారు.
రాష్ట్రంలో నిర్మాణ రంగ ముడి సరకు ధరలు బాగా పెరిగిపోయాయని, చంద్ర బాబు హయాంలో ఇసుక దోపిడీ అని ఆరోపించినన జగన్, ఇప్పుడు దానినే ప్రధాన ఆదాయ వనరుగా చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇసుక ధర రెట్టింపు చేసి ప్రజల నుంచి దోచుకుంటున్నారని, జగన్ విధానాల వల్ల లక్షల మంది కార్మికులు పనులు లేక పస్తులు ఉంటున్నారని ఆరోపించారు. మనకి ఎదురుగా కనిపించే ఇసుక ధర లారీ ఇరవై వేలను దాటిపోయందని మండిపడ్డారు. తక్కువ ధరకే ఇసుకను ఎందుకు ఇవ్వలేక పోతున్నారో సిఎం సమాధానం చెప్పాలన్నారు. రాజకీయ రాబందులు అన్నీ ఇసుక మీద పడి, ప్రజలను దోచుకుంటున్నాయని ఆరోపించారు.
కేంద్రం ఇచ్చిన డబ్బులతో ఇళ్లు కట్టి, జగనన్న ఇళ్లుగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ప్రజల వద్దకు బిజెపి నేతలు వెళ్లి విజ్ఞాపన పత్రాలు తీసుకుంటారని, ప్రతి ప్రధాన కూడలిలో సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల్లో జగన్, రాష్ట్ర ప్రభుత్వ వాటా డబ్బులు ఇవ్వకుండానే ఆయన పేరు ఎలా పెట్టుకుంటారని ప్రశ్నించారు. తోపుడు బండ్ల మీద కూడా పేటీఎం ఉన్నా, జగన్ అమ్మే మద్యం దుకాణాల్లో కనిపించవని ఎద్దేవా చేశారు. డిజిటల్ లావాదేవీలను వైసీపీ వారి స్వార్ధం కోసం చంపేశారని ఆరోపించారు.
మద్యం ద్వారా వచ్చే డబ్బంతా ఎక్కడకి వెళుతోందని, ఆ లెక్కల్లో రహస్యం ఎందుకో చెప్పాలన్నారు. రాష్ట్రంలో చక్కెర కర్మగారాలు, జూట్ మిల్లులను అమ్మేస్తున్నారని, పోలవరం జపం చేసే టిడిపి, వైసిపి నాయకులు రాష్ట్రం లో ఇతర ప్రాజెక్టు లపై ఎందుకు మాట్లాడరన్నారు. పోలవరం ప్రాజెక్టుకు వేలకోట్లు ఇస్తే పంచుకుని తిందామనే వారి ఆలోచనగా ఉందని ఆరోపించారు.
పోలవరం గురించి రాసే పత్రికలు.. హైడ్రో పవర్ ప్రాజెక్ట్ గురించి రాయాలని సోము వీర్రాజు సూచించారు. పోలవరం కోసం కేంద్రం ఇచ్చిన డబ్బులు అన్నీ ఎటు వెళ్లిపోయాయో చెప్పాలన్నారు. కేంద్రం స్థానిక సంస్థల కోసం ఇచ్చిన నిధులు కూడా మళ్లించేశారని, సర్పంచ్‌లు నిధుల కోసం అడుక్కునే పరిస్థితి ఉందన్నారు.సెప్టెంబర్17నుండి రెండు వరకు దేశ వ్యాప్తంగా బిజెపి వివిధ కార్యక్రమాలు చేపడుతుందని, రాష్ట్రంలో కూడా 5వేల స్ట్రీట్ మీటింగ్‌లు నిర్వహించనున్నట్లు చెప్పారు.
టాపిక్