Jagan vs Sharmila : ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే అరిష్టం.. బాలినేని ఆసక్తికర వ్యాఖ్యలు
Jagan vs Sharmila : జగన్, షర్మిల మధ్య ఆస్తి పంపకాల వివాదం ఇంకా కొనసాగుతోంది. ఈ వ్యవహారంపై టీడీపీ, వైసీపీ నేతలు వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ ఇష్యూపై స్పందించారు. సమస్య పరిష్కారం కోసం విజయమ్మ ముందుకు రావాలని సూచించారు.
వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదంపై మాజీమంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి స్పందించారు. జగన్, షర్మిల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షేర్ల బదిలీ జరిగితే ఇంత రాద్దాంతం ఎందుకు అని ప్రశ్నించారు. ఇద్దరిపై కోర్టుకు వెళ్లడం బాధగా ఉందన్న బాలినేని.. మీ ఆస్తులతో కూటమికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. ఆడపడుచు కన్నీళ్లు ఇంటికే అరిష్టం అని బాలినేని వ్యాఖ్యానించారు. ఇప్పటికైన పరిష్కారం కోసం విజయలక్ష్మి ముందుకురావాలని.. విజయలక్ష్మి తప్ప ఎవరూ జోక్యం చేసుకోకూడదని బాలినేని స్పష్టం చేశారు.
వైసీపీ కీలక నేత విజయసాయిరెడ్డి కూడా ఈ ఇష్యూపై ఘాటుగా స్పందించారు. 'జగన్ రాజకీయ ప్రత్యర్థుల కుట్రలో వైఎస్ షర్మిల పావుగా మారారు. షర్మిలకు కన్నీళ్లకు విలువలేదు. ఆమెను ప్రజలు నమ్మే స్థితిలో లేరు. జగన్ పై అనేక కేసులు మోపిన కాంగ్రెస్ పార్టీతో పాటు.. కుట్రలు చేసిన చంద్రబాబుతో చేతులు కలుపుతారా.. జగన్ కు వ్యతిరేకంగా షర్మిలను చంద్రబాబు పావుగా వాడుకుంటున్నారు. జగన్ కు రాసిన లేఖ టీడీపీ చేతికి ఎలా చేరింది' అని షర్మిలను విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
తనపై విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు షర్మిల స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 'మీరు కూడా జగన్ మోచేతి నీళ్లు తాగిన వాళ్లే. రాజకీయంగా, ఆర్థికంగా జగన్ వల్ల బలపడిన వాళ్లే. మీరు ఇలా కాకపోతే ఎలా మాట్లాడుతారులే. వైఎస్ఆర్ మరణానికి కాంగ్రెస్ ముమ్మాటికీ కారణం కాదు. రెండు సార్లు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చింది వైఎస్ఆర్. బంగారు బాతును ఎవరు చంపుకోరు. సొంత కళ్లను ఎవరు పొడుచుకోరు. వైఎస్ఆర్ మరణానికి చంద్రబాబు కారణం అయితే.. మీరు అధికారంలో ఉండి 5 ఏళ్లు గాడిదలు కాశారా ? ఎందుకు ఒక్క ఎంక్వైరీ కూడా వెయ్యలేదు? ఇది మీ చేతకానితనానికి నిదర్శనం కాదా' అని షర్మిల ప్రశ్నించారు.
'చంద్రబాబుతో నాకు ఎటువంటి వ్యక్తిగత సంబంధాలు లేవు. వైఎస్ఆర్ తన బిడ్డ పెళ్లికి చంద్రబాబును పిలిచారు. అలాగే నేను కూడా పిలిచాను. ప్రతిపక్ష నేతను పెళ్లికి ఆహ్వానిస్తే.. నా చీర గురించి కూడా విపరీత అర్థాలు తీసే మీలాంటి వాళ్లకు సంస్కారం ఉందని ఎలా అనుకోవాలి ? జగన్ కు ఇంకా చంద్రబాబు పిచ్చి వీడలేదా? ఇప్పటికీ అద్దంలో చూసుకున్నా.. చంద్రబాబే కనిపిస్తున్నారేమో. చంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడటానికో.. ఆయన బ్రాండింగ్ ను ఫాలో అవ్వడానికో.. ఆయన్ను ఇంప్రెస్ చేయడానికో, పని చేయాల్సిన అవసరం వైఎస్ఆర్ బిడ్డకు ఎన్నటికీ రాదని మాట ఇస్తున్నా' అని షర్మిల వ్యాఖ్యానించారు.