Ongole Anarchy: దర్శిలో దారుణం.. సోదరుడి కులాంతర ప్రేమ వివాహంతో.. యువతిపై హత్యాయత్నం-attempted murder of young woman due to brothers inter caste marriage ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ongole Anarchy: దర్శిలో దారుణం.. సోదరుడి కులాంతర ప్రేమ వివాహంతో.. యువతిపై హత్యాయత్నం

Ongole Anarchy: దర్శిలో దారుణం.. సోదరుడి కులాంతర ప్రేమ వివాహంతో.. యువతిపై హత్యాయత్నం

HT Telugu Desk HT Telugu
Aug 16, 2023 06:44 AM IST

Ongole Anarchy: ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం జరిగింది. జిల్లాకు చెందిన ఓ దళిత యువకుడు ప్రేమ వివాహం చేసుకోవడంతో అతడి అక్కపై హత్యాయత్నం చేశారు. యువతి తల్లిదండ్రులు బాధితురాలిని వివస్త్రను చేసి తగులబెట్టేందుకు ప్రయత్నించారు.

ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం
ప్రకాశం జిల్లా దర్శిలో దారుణం

Ongole Anarchy: కాసేపట్లో ఊరంత స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు చేసుకోడానికి సిద్ధమవుతుంటే ప్రకాశం జిల్లాలోని పల్లెలో మాత్రం కుల దురంహకారం జడలు విప్పింది. గ్రామానికి చెందిన ఓ యువతీయువకులు ప్రేమ వివాహం చేసుకోవడమే దీనికి కారణం. ఊరు విడిచిపోయిన జంట అచూకీ చెప్పాలంటూ యువకుడి అక్కను హింసించారు. పెట్రోల్ పోసి తగులబెట్టేందుకు సిద్ధమయ్యారు.

ప్రకాశం జిల్లా దర్శిలో సభ్యసమాజం తలదించుకునే ఘటన చోటు చేసుకుంది. మానవత్వాన్ని మంటగలిపేలా ఉన్మాదంతో వ్యవహరించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ యువతిపై దారుణంగా దాడి చేసి హింసించారు. ప్రకాశం జిల్లా దర్శి మండలంలానికి చెందిన గ్రామంలో వితంతువైన దళిత మహిళపై నిర్దాక్షణ్యంగా దాడి చేశారు.

ప్రేమ పెళ్లితో కక్ష కట్టి…

ప్రేమ పేరుతో తమ కుమార్తెను యువకుడు లోబరచుకుని ఊరు నుంచి తీసుకు పోయాడని కక్షకట్టిన యువతి కుటుంబం.. అతడి సోదరిని లక్ష్యంగా చేసుకుంది. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో పొడిచి క్రూరంగా హింసించారు. ఆమెను వివస్త్రను చేసి అవమానించారు. అయినా వారి ఆగ్రహం చల్లారలేదు. బాధితురాలి ఒంటిపై పెట్రోల్‌ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. ఘటనా స్థలానికి సకాలంలో పోలీసులు చేరుకోవడంతో ప్రాణాలను రక్షించారు.

దర్శి మండలంలోని ఎస్సీ కాలనీకి చెందిన దంపతులకు కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుటుంబ పెద్ద కాలం క్రితమే చనిపోయారు. వారి కుమార్తెకు పదేళ్ల క్రితం వివాహం కాగా రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయారు. నర్సింగ్ శిక్షణ తీసుకుని ఓ ప్రైవేట్‌ వైద్యశాలలో పని చేసుకుంటోంది. యువతి సోదరుడు గ్రామానికి చెందిన గంగిరెడ్డి బ్రహ్మారెడ్డి కుమార్తె ప్రేమించుకున్నారు.

ఈ క్రమంలో గత మార్చిలో గ్రామం నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటనను పరువు తక్కువగా భావించిన యువతి తల్లిదండ్రులు బ్రహ్మారెడ్డి, పుల్లమ్మలు యువకుడి ఇంటిపై దాడి చేసి అతడి తల్లి, సోదరిని కులం పేరుతో దూషించి తీవ్రంగా కొట్టారు. కుమార్తెను తెచ్చి తమకు అప్పగించకపోతే చంపేస్తామని బెదిరించారు. అప్పట్లో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్శి పోలీసులు వారిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు. కొద్ది రోజుల్లోనే బెయిల్‌ రావటంతో నిందితులు తాజాగా మరోసారి దాడికి ప్రయత్నించారు.

గొడవల తర్వాత బాధితురాలి తల్లి గ్రామంలో ఒంటరిగా ఉంటోంది. బాధితురాలు తల్లిని చూడడం కోసం పుట్టింటికి వచ్చారు. అర్ధరాత్రి వీధి కుళాయి నీరు విడవడంతో పట్టుకోడానికి బయటకు వచ్చింది. ఆ సమయంలో నిందితులు బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ ఆమెపై దాడి చేశారు. కళ్లలో కారం చల్లి.. కత్తులతో విచక్షణరహితంగా దాడి చేసి గాయపరిచారు. వీధిలో ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వివస్త్రను చేసి యువతి అచూకీ కోసం హింసించారు. తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి పెట్రోలు పోసి నిప్పంటించడానికి ప్రయత్నించారు.

స్పందించిన పోలీసులు

అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. మహిళపై జరుగుతున్న దాడిని గమనించిన గ్రామస్థులు రాత్రి ఒంటిగంటకు డయల్‌-100కు ఫోన్‌ చేసి సమాచారం ఇచ్చారు. జిల్లా కేంద్రం నుంచి అందిన సమాచారంతో 1.20 గంటలకు పోలీసులు అక్కడకు వచ్చారు. బ్రహ్మారెడ్డి ఇంట్లో బందీగా ఉన్న బాధితురాలిని గుర్తించారు.

తీవ్రంగా గాయపడి బాధితురాలి కట్లు విప్పి.. వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై జిల్లా ఎస్పీ మలికా గార్గ్‌ ఆదేశాల మేరకు అపహరణ, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదు చేశారు. నిందితులు బ్రహ్మారెడ్డిని, అతడి భార్య పుల్లమ్మను అరెస్టు చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ట్రైనీ ఐపీఎస్‌ అధికారిణి అంకిత సురానా పరామర్శించి ధైర్యం చెప్పారు.

Whats_app_banner