Minor Girl Rape: ముదినేపల్లిలో దారుణం, తల్లితో సహజీవనం చేస్తూ, కూతురిపై అత్యాచారం, నిందితుడి అరెస్ట్
Minor Girl Rape: పశ్చిమ గోదావరి జిల్లాలో తల్లితో సహజీవనం చేస్తూ...కూతురిపై అత్యాచారం చేసిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
Minor Girl Rape: తల్లితో సహజీవనం చేస్తూ...ఆమె కుతురుపైన అత్యాచారానికి ఒక ప్రబుద్ధుడు పాల్పడ్డాడు. ఈ ఘనట పశ్చిమ గోదావరి జిల్లా ముదినేపల్లి మండలంలో ఒక గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.
పశ్చిమ గోదావరి జిల్లా ముదినేపల్లి మండలంలో ఒక గ్రామంలో ఒక మహిళను తన భర్త వదిలేశాడు. దీంతో పదేళ్ల కుతురు, ఏడేళ్ల కుమారుడితో కలిసి ఆ మహిళ జీవనం సాగిస్తుంది. కూలీ పని చేసుకుంటూ ఆ కుటుంబం బతుకు సాగిస్తుంది. అయితే ఏడాది క్రితం హైదరాబాద్‌కు చెందిన ఎం. ఉదయ్ కుమార్‌తో ఆ మహిళలకు పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం కాస్తా సహజీవనంగా మారింది. ఆ మహిళను నమ్మించి రూ.2.20 లక్షల నగదు ఆమె వద్ద నుంచి ఉదయ్ కుమార్ తీసుకున్నాడు. అయితే మహిళ పనికి వెళ్లినప్పుడు ఇంట్లోనే ఒంటరిగా ఉంటున్న పదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పలుసార్లు బాలికను బెదిరించి, భౌతిక దాడికి దిగి అత్యాచారం చేశాడు.
గత మే 19న అర్థరాత్రి సమయంలో బాలికపై ఆ మానవ మృగం అత్యాచారానికి ప్రయత్నిస్తుండగా, ఆ మహిళ చూసి అతడిని నిలదీసింది. ఇదేం పని అంటూ ప్రశ్నించింది. అతడి అకృత్యాలను తట్టుకోలేక నిలదీసేసరికి, ఈ విషయం ఏవరికైనా చెబితే చంపేస్తానని తల్లికూతుళ్లను బెదిరించాడు.
తల్లి, కూతుళ్లను బాగా కొట్టి అక్కడ నుంచి వెళ్లిపోయాడు. ఈ విషయం ఆ నోట, ఈ నోట తెలిసి గ్రామంలో కొంతమందికి తెలిసింది. గ్రామానికి చెందిన విజయలక్ష్మి, అశ్విని, కిశోర్, సురేష్ అనేవారు మహిళకు మద్దతుగా నిలవకుండా, నిందితుడిపై కేసు పెట్టకుండా రాజీ చేసుకోవాలని మహిళపై ఒత్తడి తెచ్చారు. అందుకు మహిళ ససేమిరా అనడంతో ఆ మహిళపై దాడి చేసి కొట్టారు.
దీంతో మహిళ సహించలేక జూన్ 16న పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోద చేశారు. బాలికను వైద్య పరీక్షలకు నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసి విచారణ చేపట్టారు. దిశ పోలీస్ స్టేషన్ డీఎస్‌పీ ఎన్. మురళీకృష్ణ, ఏలూరు డీఎస్‌పీ
శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. నిందితుడిని మంగళవారం (జూన్ 25) పోలీసులు పట్టుకున్నారు. రాజీ కోసం ప్రయత్నించి, రాజీకీ రాకపోవడంతో మహిళపై దాడి చేసిన నలుగురిని కూడా అరెస్టు చేస్తామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు.
నిందితుడిని ద్వారకా తిరుమల మండలం కన్నాపురంలో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. నిందితుడికి 14 రోజుల పాటు న్యాయస్థానం రిమాండ్ విధించింది. నిందితుడిని కైకలూరు రూరల్ సీఐ కృష్ణ కుమార్, ఎస్ఐ వెకంట్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ శంకరరావు, కానిస్టేబుల్ నాగబాబులను డీఎస్పీ శ్రీనివాసులు అభినందించారు.
(రిపోర్టింగ్ జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)