AP Free Gas Cylinders: అక్టోబర్31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఏర్పాట్లు, 29 నుంచి బుకింగ్, విధివిధానాలు ఖరారు
AP Free Gas Cylinders: ఆంధ్రప్రదేశ్‌లో ఉచిత రేషన్ కార్డుల పంపిణీకి విధివిధానాల ఖరారు చేశారు. వైట్ రేషన్ కార్డుతో పాటు గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత సిలిండర్ అందించాలని నిర్ణయించినట్టు మంత్రి నాదెండ్ల తెలిపారు.
AP Free Gas Cylinders: ఏపీలో ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకి విధివిధానాలను ఖరారు చేశారు. ఏటా మూడు సిలిండర్లను లబ్దిదారులకు అందిస్తారు. ఉచిత సిలిండర్ అందుకోడానికి వైట్ రేషన్‌కార్డుతో పాటు, ఆధార్ కార్డు, గ్యాస్ కనెక్షన్ కలిగి ఉండాలి. సూపర్ సిక్స్‌లో భాగంగా మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లను నెలాఖరు నుంచి ప్రారంభిస్తున్నట్టు మంత్రి నాదెండ్ల ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 1.55కోట్ల గ్యాస్ కనెక్షన్లలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి పథకాన్ని వర్తింప చేస్తామని చెప్పారు.
ప్రజలపై ఆర్థిక భారం ఉండకుండా, ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక వెసులుబాటు ప్రతి కుటుంబానికి అందాలని, జాతీయ స్థాయిలో గ్యాస్ కంపెనీలతో చర్చించి విధివిధానాలు ఖరారు చేసినట్టు చె్పారు.
సివిల్ సప్లైస్ శాఖ నుంచి ప్రతికుటుంబానికి వీలైనంత త్వరగా పథకాన్ని చేర్చాలని నిర్ణయించి జీవో జారీ చేస్తున్నట్టు తెలిపారు.
అక్టోబర్ 31 నుంచి ప్రారంభం
అక్టోబర్ 31నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల డెలివరీ ప్రారంభం కానుంది. మొదటి సిలిండర్‌ను అక్టోబర్31 నుంచి ఎప్పుడైనా అందుకోవచ్చు. మొదటి సిలిండర్ మార్చి 31లోపు ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు. ఎవరైనా ఖాళీ సిలిండర్ ఉంటే బుక్ చేసుకోవచ్చని రేషన్ కార్డు , గ్యాస్ కనెక్షన్, ఆధార్ కార్డు ఉండాలని మంత్రి నాదెండ్ల పేర్కొన్నారు.
ఎల్‌పిజి కనెక్షన్, తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ అందిస్తామని చెప్పారు. ఆయిల్ కంపెనీలతో ఉన్న డేటా బేస్‌తో పోల్చుకుని సిలిండర్లను అందిస్తామని చెప్పారు.
అక్టోబర్ 29 నుంచి బుకింగ్..
ఉచిత గ్యాస్ సిలిండర్లకు అక్టోబర్ 29 నుంచి బుకింగ్స్ ప్రారంభం అవుతాయి. 29 ఉదయం 10గంటల నుంచి బుకింగ్స్ ప్రారంభిస్తే 31వ తేదీ నుంచి డెలివరీ ప్రారంభిస్తారు. అర్హత ఉన్న వారికి బుకింగ్ ఖరారు కాగానే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ఎంఎస్ అందుతుంది. ఎప్పుడు డెలివరీ అవుతుందో ధృవీకరణ అందుతుంది. 24 గంటల నుంచి 48గంటల్లో డెలివరీ అందిస్తామని ఆయిల్ కంపెనీలు హామీ ఇచ్చినట్టు మంత్రి చెప్పారు.
గ్యాస్ డెలివరీ చేయడానికి రూ. 894.92కోట్ల రుపాయల నగదును అక్టోబర్ 29వ తేదీన అడ్వాన్సుగా ఆయిల్ కంపెనీలకు చెల్లించనున్నారు. కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్రాల్లో డిబిటి రూపంలో నగదు చెల్లిస్తున్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. సీఎం సైతం కేంద్ర మంత్రికి వినతి ఇచ్చారని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నేరుగా నగదు చెల్లింపులు జరుగుతాయని చెప్పారు. అక్టోబర్ 31 నుంచి మార్చి 31 వరకు ఎప్పుడైనా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చని తెలిపారు. ఈ ఆర్దిక సంవత్సరంలో ఎప్పుడైనా మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చన్నారు.
ఏప్రిల్ 1 నుంచి నేరుగా చెల్లింపులు..
ఏప్రిల్ 1 నుంచి జులై 31 లోపు రెండో సిలిండర్ అందిస్తామని తెలిపారు. ఆగస్టు 1 నుంచి నవంబర్ 31 వరకు, మూడో సిలిండర్ డిసెంబర్ 1 మార్చి 31 మధ్య కాలంలో అందిస్తమన్నారు.
ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు కోసం రూ.2684.75కోట్ల రుపాయలు ఏటా ఖర్చు చేయనున్నారు. ఎవరికైనా ఇబ్బందులు ఉంటే 1967- టోల్ ఫ్రీ నంబరులో ఫిర్యాదు చేయొచ్చని వివరించారు. 31 తర్వాత ఎవరికైనా సమస్య ఉంటే 1967 టోల్ ఫ్రీ నంబరు ద్వారా గ్యాస్ కనెక్షన్లు బుక్ చేసుకోవచ్చని చెప్పారు.
గ్యాస్ బుక్ చేసుకున్నపుడు ఆయిల్ కంపెనీలు నుంచి అందించే ఇన్వాయిస్ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం లబ్దిదారులకు చెల్లిస్తుందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాష్ట్రంలో కోటి 45లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉన్నాయని మంత్రి నాదెండ్ల తెలిపారు. కోటిన్నర రేషన్ కార్డుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉన్న కనెక్షన్లు 9.65లక్షలు మాత్రమేనని మిగిలిన వాటికి రాష్ట్ర ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు వివరించారు.
మరోవైపు కాకినాడలో 52వేల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని గుర్తించగా అందులో 29వేల మెట్రిక్ టన్నుల పిడిఎస్ బియ్యాన్ని గుర్తించి 11మందిపై క్రిమినల్ కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్టు మంత్రి నాదెండ్ల వివరించారు. రేషన్ బియ్యం అక్రమ రవాణాను ఉపేక్షించమని చెప్పారు.