Sudan Crisis: సూడాన్ నుంచి ప్రవాసాంధ్రుల తరలింపు..స్వస్థలాలకు చేర్చిన రాష్ట్ర ప్రభుత్వం
Sudan Crisis: సూడాన్ అంతర్యుద్ధంలో చిక్కుకుపోయిన ప్రవాసాంధ్రుల్ని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటి వరకు 65మందిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చారు.
Sudan Crisis: సుడాన్‌లో తిరుగుబాటు దారులు, ప్రభుత్వ దళాలకు మధ్య జరుగుతున్న అంతర్యుద్ధంలో చిక్కుకున్న వారిలో 65 మంది ఆంధ్రప్రదేశ్ వాసుల్ని విదేశాంగ సహకరాంతో స్వస్థలాలకు చేరుస్తున్నారు.
గత 20 రోజులుగా సుడాన్ లో జరుగుతున్న అంతర్యుద్డంతో అన్ని దేశాల ప్రభుత్వాలు తమ ప్రజలను స్వదేశాలకు రప్పిస్తున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం “ఆపరేషన్ కావేరి” ద్వారా భారతీయులను స్వదేశానికి తీసుకోస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం డిల్లీలో ఏపీ భవన్ అధికారులు, ప్రవాసాంధ్రుల విభాగం, జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారులు సమన్వయంతో రాష్ట్రానికి చెందిన వారిని ఆయా విమానాశ్రయాల నుండి స్వస్థలాలకు చేరుస్తున్నారు.
ఇప్పటి వరకు సుడాన్ లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 71 మంది చిక్కుకుపోయినట్లు గుర్తించారు. వీరిలో 65మంది ఇప్పటికే భారతదేశం చేరుకున్నారు. రావలసిన ఆరుగురిలో ఒకరు జెడ్డా, మరొకరు పోర్ట్ ఆఫ్ సుడాన్ కు చేరుకున్నారు. మిగతా నలుగురు పోర్ట్ ఆఫ్ సుడాన్‌కు చేరువలో ఉన్నారు. మొత్తం 71 మంది ప్రవాసాంధ్రుల్లో భారత రాయబార కార్యాలయంతో రిజిష్టర్ చేసుకున్న 58 మందిలో 52 మంది ఇప్పటికే భారతదేశం చేరుకున్నారు.
స్వదేశానికి వచ్చిన వారిలో ఒకరికి ఎల్లో ఫీవర్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ లేకపోవడంతో ఢిల్లీలో ఉండిపోయారు. కొచ్చిలో నలుగురు క్వారంటైన్ లో ఉండగా మిగిలిన 47 మంది ఏపీ లోని వారి స్వస్థలాలకు చేరుకున్నారు. ఎలాంటి రిజిస్ట్రేషన్ లేకుండా నేరుగా తిరిగొచ్చిన వారు కూడా వారి స్వస్థలాలకు చేరుకున్నారు.
సూడాన్ నుంచి వచ్చిన వారిని న్యూఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కొచ్చి విమానాశ్రయాల నుంచి ఏపీకి చేరుస్తున్నారు. 24 మందికి రాష్ట్ర ప్రభుత్వ ఖర్చుతో ప్రయాణ, ఇతర సదుపాయాల ఏర్పాట్లు చేసి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతికి విమానాలు మరియు రోడ్డు మార్గాల ద్వారా స్వస్థలాలకు చేర్చారు. విజయవాడ, విశాఖపట్నం విమానాశ్రయాల నుంచి జిల్లా అడ్మినిస్ట్రేషన్ అధికారుల సహకారంతో బాధితులను స్వస్థలాలకు చేరుస్తున్నారు. మిగిలినవారు, వారు పనిచేస్తున్న సంస్థలు ఏర్పాటు చేసిన సౌకర్యాలతో వారి ఇళ్ళకు చేరుకున్నారు.
సుడాన్ లో ఇంకా ఎవరైనా ప్రవాసాంధ్రులు మిగిలి ఉంటే వారి కుటుంబ సభ్యులు APNRTS 24/7 హెల్ప్ లైన్ నంబర్లను 0863 2340678, 85000 27678 (WhatsApp) లలో సంప్రదించాలని సూచిస్తున్నారు. helpline@apnrts.com కు ఇమెయిల్ చేసినా వారిని రాష్ట్రానికి తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.
సుడాన్ నుండి ఏపీ చేరుకున్న వారు ప్రాణాలతో తిరిగి స్వదేశానికి తిరిగి వస్తామో లేదో అన్న భయం ఉండేదని,కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఒకవైపు, విమానాశ్రయాల నుండి స్వస్థలాలకు చేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవ వల్ల క్షేమంగా ఇళ్ళకు చేరుకున్నామని ప్రవాసులు చెబుతున్నారు.