APCC : షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే మాకు బలమే - ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు-apcc president gidugu rudraraju reaction about ys sharmila to join in congress ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Apcc : షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే మాకు బలమే - ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు

APCC : షర్మిల కాంగ్రెస్‌లోకి వస్తే మాకు బలమే - ఏపీసీసీ అధ్యక్షుడు రుద్రరాజు

Maheshwaram Mahendra Chary HT Telugu
Sep 05, 2023 05:00 PM IST

APCC president Gidugu Rudra Raju:రాహుల్ జోడో యాత్రతో మంచి రోజులు వచ్చాయన్నారు ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు. ఈనెల 7వ తేదీన రాష్ట్రవ్యాప్త యాత్రలు చేపడుతామని చెప్పారు. వైఎస్ షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తామన్నారు.

ఏపీసీసీ ముఖ్య నేతలు
ఏపీసీసీ ముఖ్య నేతలు

APCC President Gidugu Rudra Raju: రాహుల్ గాంధీ ఏడాది క్రితం చేపట్టిన భారత్ జోడో యాత్రతో దేశంలోని ప్రజలకు మంచి రోజులు వస్తున్నాయని ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. విజయవాడలోని ఆంధ్ర రత్న భవన్ లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ…. రాహుల్ జోడో యాత్ర చేపట్టి సెప్టెంబర్ 7వ తేదీకి సంవత్సరం పూర్తయిందన్నారు. మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల ప్రధాన కేంద్రాల్లో ర్యాలీలు చేపడుతామని వెల్లడించారు. ప్రతి జిల్లాలో సంబంధిత ముఖ్య నేతలు, వర్కింగ్ కమిటీ సభ్యులు, ఎన్ ఎస్ యు ఐ, యూత్ కాంగ్రెస్, సేవా దళ్, ఇతర కాంగ్రెస్ అనుబంధ విభాగాలు యాత్రలో పాల్గొంటాయని, ఎంతో ముఖ్యమైన ఈ కార్యక్రమానికి మీడియా సహకారం కూడా కావాలని ఆయన విజ్నప్తి చేశారు.

దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా….

దేశ రాజకీయ చరిత్రలో ఇంత వరకు ఏ నాయకుడూ చేయని విధంగా కన్యాకుమారిలోని సముద్ర తీరం నుంచి కాశ్మీర్ లోని హిమాలయ పర్వతాల వరకు 136 రోజుల్లో 4081 కిలోమీటర్ల అతిపెద్ద యాత్రను రాహుల్ పూర్తి చేశారని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు వివరించారు. ఈ యాత్ర సందర్భంగా కోట్లాది మంది ప్రజలతో రాహుల్ మమేకమయ్యారని, వారి అభిప్రాయాలు, సమస్యలు తెలుసుకున్నారని తెలిపారు. 12 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలు, 75 జిల్లాలు, 74 లోక్ సభ నియోజక వర్గాల మీదుగా సాగిన జోడో యాత్రలో 100 సార్లకుపైగా రాహుల్ సమావేశాలు నిర్వహించారని, 278 సార్లు వివిధ గ్రూపులతో మాటామంతి నిర్వహించారని చెప్పారు. అదే విధంగా 13 పెద్ద బహిరంగ సభలు, 12 సార్లు జాతీయ స్థాయి మీడియా మిత్రులతో సంభాషించారని వెల్లడించారు. బీజేపీ పాలనలో దళితులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. మణిపూర్ లాంటి దుర్ఘటనలు జరిగినా కనీసం ప్రధాని స్థాయి వ్యక్తి కూడా స్పందించ లేదని దుయ్యబట్టారు. త్వరలో ఎన్నికలు జరగబోయే చత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్, తెలంగాణ, రాజస్థాన్ లలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు. ఆంధ‌్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయని ఆయన తెలిపారు. సంక్షేమం, అభివ్రుద్ధి కాంగ్రెస్ పార్టీకి రెండు కళ్లు అని పేర్కొన్నారు.

భావ సారూప్యత కలిగిన పార్టీలతో కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఇండియా కూటమితో దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి రావడం లాంఛనమే అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ, జనసేనలు ఒక తానులో ముక్కలే అన్నారు. ప్రజలు కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారన్న ఆయన… రాష్ట్ర ప్రజలకు మేలు చేసే విధంగా ఏఐసీసీ ఆదేశాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ మేనిఫేస్టోని సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అదే విధంగా హైదరాబాద్ లో ఈ నెల 16, 17 తేదీల్లో సీ డబ్ల్యు సీ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.

షర్మిల కాంగ్రెస్ లోకి వస్తే స్వాగతిస్తాం

మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే మనస్పూర్తిగా స్వాగతిస్తామని పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. షర్మిల్ కాంగ్రెస్ లోకి రావడం తమకు బలంగానే భావిస్తున్నామన్నారు. పీసీసీ అధ్యక్షునిగా షర్మిలకు అన్ని విధాలా సహకరిస్తామని తెలిపారు. అదే విధంగా జగన్ తో షర్మిల వివాదాలపై ఒక ప్రశ్నకు సమాధానంగా స్పందించిన ఆయన, కుటుంబ వ్యవహారాలు వేరు... రాజకీయాలు వేరు అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ అంటేనే మానిఫ్యాక్చరింగ్ పార్టీ అని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులు కూడా తమ రాజకీయ జీవితాలను కాంగ్రెస్ తోనే ప్రారంభించారని రుద్రరాజు గుర్తు చేశారు.

ఏపీ రైతు సంఘం మాజీ అధ్యక్షులు వెంకటరామిరెడ్డి ఆయన మిత్రులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో మంగళవారం, వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఉభయ ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటరామిరెడ్డితో పాటు రాజేష్ కుమార్, మస్తాన్ వలి, రామిరెడ్డి, నజీర్ లు కూడా పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ మీడియా విభాగం ఛైర్మన్ తులసిరెడ్డి, కార్యనిర్వహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం