Bharat Jodo Yatra: మళ్లీ ‘భారత్ జోడో యాత్ర’.. త్వరలో గుజరాత్ నుంచి ప్రారంభించనున్న రాహుల్ గాంధీ
Bharat Jodo Yatra: రెండో విడత ‘భారత్ జోడో యాత్ర’ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి విడతలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగిన విషయం తెలిసిందే.
Bharat Jodo Yatra: రెండో విడత ‘భారత్ జోడో యాత్ర’ కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర తొలి విడతలో కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. రెండో విడతలో ఈ భారత్ జోడో యాత్ర గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయ వరకు కొనసాగనుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే వెల్లడించారు. రెండో విడత భారత్ జోడో యాత్రకు సమాంతరంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పాద యాత్ర నిర్వహిస్తుందని ఆయన తెలిపారు.
రెండో విడత యాత్ర
రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రను చేపట్టనున్నారన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రామ్ రమేశ్ వెల్లడించారు. ఈ యాత్ర గుజరాత్ లో మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్ బందర్ నుంచి ప్రారంభమవుతుందని, అరుణాచల్ ప్రదేశ్ లోని పాసిఘాట్ వరకు ఈ యాత్ర కొనసాగుతుందని ఆయన గతంలో ప్రకటించారు. అయితే, రెండో విడత పాదయాత్రపై ఆ తరువాత పార్టీ నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఇప్పుడు కూడా పార్టీ అగ్ర నాయకత్వం నుంచి కాకుండా, మహారాష్ట్ర లో కాంగ్రెస్ నాయకుడు నానా పటొలే నుంచి ఈ సమాచారం బయటకు రావడం విశేషం. అయితే, ఈ యాత్ర ఎప్పుడు ప్రారంభమవుతుంది?, ఏ రాష్ట్రాల నుంచి వెళ్తుంది?, ఎక్కడ ముగుస్తుంది? అనే వివరాలు ఇంకా వెల్లడికాలేదు. ఈ వివరాలతో పాటు పాద యాత్ర రూట్ మ్యాప్ పై కాంగ్రెస్ పార్టీలో కసరత్తు కొనసాగుతున్నట్లు సమాచారం.
తొలివిడత యాత్ర
తొలి విడత భారత్ జోడో యాత్ర గత సంవత్సరం సెప్టెంబర్ లో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల గూండా 130 రోజులకు పైగా 4 వేల కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర కొనసాగింది. చివరకు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది. ఈ యాత్రలో వివిధ ప్రాంతాలు, వర్గాలు, సామాజిక నేపథ్యాలున్న ప్రజలతో రాహుల్ గాంధీ మమేకమయ్యారు
రాహుల్ యాత్రకు స్వాగతం..
గుజరాత్ నుంచి రాహుల్ గాంధీ తన రెండో విడత భారత్ జోడో యాత్ర ను ప్రారంభించాలని కోరుతున్నామని, ఆయనకు స్వాగతం చెబుతున్నామని సోమవారం గుజరాత్ కాంగ్రెస్ నాయకులు ప్రకటించారు. మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్ ల గడ్డ నుంచి ఈ యాత్ర ప్రారంభం కావాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ‘రెండో విడత యాత్ర గుజరాత్ నుంచే ప్రారంభం కావాలి. ఈ విషయంపై పార్టీ అగ్ర నాయకత్వం కసరత్తు చేస్తోంది’ అని గుజరాత్ కాంగ్రెస్ నేత అమిత్ చావ్డా వెల్లడించారు.