AP TET DSC 2024 Updates : ఏపీ 'టెట్'కు ప్రిపేర్ అవుతున్నారా..? తాజా 'సిలబస్' ఇదే-ap tet syllabus for july notification 2024 and exam pattern check here ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Tet Dsc 2024 Updates : ఏపీ 'టెట్'కు ప్రిపేర్ అవుతున్నారా..? తాజా 'సిలబస్' ఇదే

AP TET DSC 2024 Updates : ఏపీ 'టెట్'కు ప్రిపేర్ అవుతున్నారా..? తాజా 'సిలబస్' ఇదే

Maheshwaram Mahendra Chary HT Telugu
Jul 05, 2024 04:41 PM IST

AP TET 2024 Syllabus: ఏపీ టెట్(జూలై 2024) దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సారి విడుదలైన నోటిఫికేషన్ కు సంబంధించిన సిలబస్ తో పాటు పరీక్షా విధానం వివరాలను ఇక్కడ చూడండి…..

ఏపీ టెట్ సిలబస్ 2024
ఏపీ టెట్ సిలబస్ 2024

AP TET Syllabus 2024: ఏపీలో కొత్తగా టెట్(జులై) నోటిఫికేషన్ వచ్చేసిన సంగతి తెలిసిందే. జూలై 4వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. జులై 17వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.పేపర్-1ఎ, పేపర్-1బి, పేపర్-2ఎ, పేపర్-2బి వేర్వేరుగా పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. 

అర్హత కలిగిన అభ్యర్థులు https://aptet.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. ఇక ఫిబ్రవరి నోటిఫికేషన్ ప్రకారం ఉన్న సిలబస్సే ఈసారి కూడా ఉంటుందని విద్యాశాఖ మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు. ఎలాంటి మార్పులు లేవని చెప్పారు.

టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఈ నేపథ్యంలో టెట్ 2024 పరీక్ష విధానమేంటి..? సిలబస్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి...? అర్హత మార్కుల కటాఫ్ వివరాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి….

ముఖ్య వివరాలు :

  • టెట్‌ను పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిల పేరుతో మొత్తం నాలుగు పేపర్లుగా నిర్వహించనున్నారు.
  • పేపర్‌–1ఎ చూస్తే ఒకటి నుంచి అయిదో తరగతి వరకు ఉపాధ్యాయులుగా బోధించాలనుకునే వారు రాయాల్సిన పరీక్ష.. కాగా పేపర్‌–1బి అనేది ఒకటి నుంచి 5వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా పనిచేయాలనుకునే వారు రాయాల్సి ఉంటుంది.
  • స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ స్కూల్స్‌లో టీచర్లకు ఈ పేపర్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అనే ఎన్‌సీటీఈ నిబంధనలకు అనుగుణంగా దీన్ని ప్రవేశ పెట్టారు. ఇక పేపర్‌–2ఎ చూస్తే….. ఆరు నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధించాలనుకునే వారు ఉత్తీర్ణత సాధించాల్సిన పేపర్‌ ఇది.
  • ఇక పేపర్‌–2బి చూస్తే ఆరు నుంచి 8వ తరగతి వరకు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ టీచర్స్‌గా బోధించాలనుకునే వారు అర్హత సాధించాల్సి ఉంటుంది.

ఏపీ టెట్ సిలబస్, పరీక్షా విధానం….

టెట్‌ పేపర్‌–1ఎ, 1బి, పేపర్‌–2ఎ, 2బిలను 150 మార్కులకు నిర్వహిస్తారు. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్‌ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఏపీ టెట్‌లోని అన్ని పేపర్లలోనూ అభ్యర్థులు తప్పనిసరిగా కనీస ఉత్తీర్ణత మార్కులు పొందాలి. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.

పేపర్‌–2ఎ చూస్తే… ఇందులో చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి నుంచి 30 మార్కులు వస్తాయి. ఇక లాంగ్వేజ్ 1 నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ నుంచి 30 మార్కులు, సంబంధిత సబ్జెక్ట్ నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకు గానూ పరీక్ష నిర్వహిస్తారు.నాలుగో విభాగంగా నిర్వహించే సంబంధిత సబ్జెక్ట్‌ విషయంలో..మ్యాథమెటిక్స్‌ అండ్‌ సైన్స్‌ టీచర్స్‌ అభ్యర్థులు మ్యాథ్స్, సైన్స్‌ విభాగాన్ని, సోషల్‌ టీచర్లు సోషల్‌ స్టడీస్‌ విభాగాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది.

పేపర్‌–2బిలో(AP TET Syllabus) చూస్తే చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పెడగాజి నుంచి 30 మార్కులు, లాంగ్వేజ్‌1 నుంచి 30, గ్వేజ్‌ 2(ఇంగ్లిష్‌)-30, డిజేబిలిటీ స్పెషలైజేషన్‌ సబ్జెక్ట్‌ అండ్‌ పెడగాజి నుంచి 60 మార్కులు ఇస్తారు. మొత్తం 150 మార్కులకుగానూ పరీక్ష నిర్వహిస్తారు. పేపర్‌–2బిలో నాలుగో విభాగంలో అభ్యర్థులు స్పెషల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సులో చదివిన సబ్జెక్ట్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది.

ఏపీ టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి….

  • టెట్ రాసేందుకు అర్హత ఉన్న అభ్యర్థులు https://aptet.apcfss.in/  వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
  • హోం పేజీలో కనిపించే Application అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • పేమెంట్ పూర్తి చేసిన సమయంలో జనరేట్ అయిన Candidate IDతో పాటు పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
  • లాగిన్ పై నొక్కితే మీకు అప్లికేషన్ ఫారమ్ ఓపెన్ అవుతుంది.
  • మీ పూర్తి వివరాలను ఎంట్రీ చేయాలి. ఫొటో, సంతకం కూడా అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
  • చివరగా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ను జాగ్రత్తగా ఉంచుకోవాలి. హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకునే సమయంలో ఉపయోగపడుతుంది.

ఏపీ టెట్ ఆన్‌లైన్‌ మాక్‌ టెస్టులు త్వరలోనే అందుబాటులో రానున్నాయి. https://aptet.apcfss.in  వెబ్ సైట్ లోకి వెళ్లి అభ్యర్థులు ఈ మాక్ టెస్టులను రాసుకోవచ్చు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం… ఆగస్టు 5వ తేదీ నుంచే పరీక్షలు ప్రారంభమై… 30వ తేదీన ఫలితాలు రావాల్సి ఉంటుంది. కానీ అభ్యర్థులతో పాటు పలు విద్యార్థి యువజన సంఘాల నుంచి వచ్చిన విజ్ఞప్తుల నేపథ్యంలో… ఏపీ టెట్, డీఎస్సీ సన్నద్ధత కోసం సమయాన్ని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటన చేసింది.

ప్రిపేర్ అయ్యేందుకు సమయం కావాలని అభ్యర్థులు కోరడంతో టెట్ కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల సమయం ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు అభ్యర్థులకు తగిన సమయమివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

త్వరలోనే డీఎస్సీ, టెట్ కొత్త తేదీలు ప్రకటిస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే మొత్తం ప్రక్రియ 6 నెలల్లోగా పూర్తి చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది. డిసెంబర్ చివరి నాటికి మెగా డీఎస్సీని పూర్తి చేయాలని సర్కార్ డెడ్ లైన్ పెట్టుకుంది. ఈలోపే టెట్ తో పాటు అన్ని పరీక్షలను నిర్వహించి ఫలితాలను ప్రకటించాల్సి ఉంటుంది.

Whats_app_banner