AP Govt : ఆ 21 కులాలు ఇకపై రాష్ట్రమంతటా బీసీలే, భౌగోళిక పరిమితులు తొలగింపు
AP Govt : భౌగోళిక పరిమితుల కారణంగా కొన్ని ప్రాంతాలకే బీసీలుగా పరిగణిస్తు్న్న 21 కులాలు, ఉపకులాలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రాంతంతో సంబంధం లేకుండా వారందరినీ బీసీలుగా పరిగణిస్తామని ప్రకటించింది.
AP Govt : ఏపీ ప్రభుత్వం బీసీ ఉపకులాలకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రమే బీసీలుగా పరిగణించే 21 కులాలు, ఉపకులాలకు భౌగోళిక పరిమితులను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ప్రాంతం, భౌగోళిక పరిమితులు లేకుండా ఆ 21 కులాలు, ఉపకులాలను రాష్ట్ర వ్యాప్తంగా బీసీలుగా పరిగణించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఏపీలో 138 కులాలను వెనుకబడిన తరగతులుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. వీటిలో 21 కులాలపై భౌగోళిక పరిమితులు ఉన్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల వారీగా ఈ 21 కులాలను బీసీలుగా పరిగణిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో బీసీలుగా పరిగణించడంలేదు.
ఇకపై బీసీ సర్టిఫికేట్
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ 21 కులాలకు ప్రాంతం, భౌగోళిక పరిమితిని తొలగించాలని నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రమంతటా వీరిని బీసీలుగా గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ 21 కులాలు, ఉపకులాలకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని అన్ని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది. అయితే రాయలసీమ ప్రాంతంలో కల్లుగీతపై ఆధారపడిన శెట్టి బలిజ కులానికి మాత్రం ఇది వర్తించదని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వ నిర్ణయంపై ఆయా వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతుంది.
ఆ 21 కులాలివే!
- బీసీ-ఏ గ్రూపులో ఆరు కులాలు, వాటి ఉపకులాలకు భౌగోళిక పరిమితులు తొలగించారు. పాల ఏకరీ, ఏకిల, వ్యాకుల, కురకుల, పొండర, సామాంతుల (సామంత, సౌంటియా), ఏకిరి, నయనివారు, పాలేగారు, తొలగరి, కవలి, ఆసాదుల, కెవుట (కెవుటో, కెవిటి) కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
- బీసీ-బి గ్రూపులో నాలుగు కులాలు, వాటి ఉపకులాలను చేర్చారు. గౌడ (ఈడిగ, గౌడ, గమల్లా), అచ్చుకట్లవాండ్లు, కలాలీ, గౌండ్ల, శెట్టి బలిజ (రాయలసీమలో తప్ప), కుంచిటి వక్కలింగ (వక్కలింగ, కుంచిటిగ), గుడ్ల కులాలను బీసీ జాబితాలో చేర్చారు.
- బీసీ-డి గ్రూపులో 11 కులాలు, వాటి ఉపకులాలు చేర్చారు. మున్నూరు కాపు, పోలినాటి వెలమ, సదర, అరవ, నగరాలు, అయ్యరక, ముదలర్, ముదిలియర్, బెరి వైశ్య (బెరి శెట్టి), అతిరాస, కుర్మి, కలింగ వైశ్య కులాలను బీసీ లిస్ట్ లో చేర్చారు.