Mekapati Gautham Reddy | ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం-ap minister mekapati gautham reddy dies of heart attack ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mekapati Gautham Reddy | ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

Mekapati Gautham Reddy | ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం

HT Telugu Desk HT Telugu
Feb 21, 2022 03:27 PM IST

ఆంధ్రప్రదేశ్‌ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో మరణించారు. ఆయన వయసు 49 సంవత్సరాలు.

<p>మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం దగ్గర కుటుంబ సభ్యులు</p>
మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతికకాయం దగ్గర కుటుంబ సభ్యులు

హైదరాబాద్‌: ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి హఠాన్మరణం చెందారు. సోమవారం ఉదయం ఆయన గుండెపోటు రావడంతో హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయనను ఆసుపత్రికి తరిలించే లోపే మృతి చెందినట్లు అపోలో ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల కిందటే ఆయన దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చారు. వారం రోజుల పాటు అక్కడ జరిగిన ఎక్స్‌పోలో గౌతమ్‌రెడ్డి పాల్గొన్నారు. అక్కడే ఆయన చివరిసారి ఖలీజ్‌టైమ్స్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన హఠాన్మరణం రాజకీయ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. గౌతమ్‌ రెడ్డి మృదుస్వభావి అని, సీఎం జగన్మోహన్‌రెడ్డికి ఇష్టమైన మంత్రి అని సహచరులు గుర్తు చేసుకుంటున్నారు.

గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు బుధవారం నెల్లూరులో జరగనున్నాయి. ప్రస్తుతం ఆయన కుమారుడు అమెరికాలో ఉన్నాడు. అతడు వచ్చిన తర్వాతే గౌతమ్‌రెడ్డి అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. సోమవారం రాత్రి హైదరాబాద్‌ నుంచి నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతిక కాయాన్ని తరలించనున్నారు. మంగళవారం అభిమానుల సందర్శనార్థ గౌతమ్‌రెడ్డి భౌతికకాయాన్ని ఉంచుతారు.

మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి తనయుడే గౌతమ్ రెడ్డి. ఆయన స్వగ్రామం నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లి. 1972, నవంబర్‌ 2న మేకపాటి గౌతమ్‌రెడ్డి జన్మించారు. హైదరాబాద్‌లోని భద్రూకా కాలేజీలో డిగ్రీ, లండన్‌లో ఎమ్మెస్సీ టెక్స్‌టైల్స్‌ చేశారు. 1997లో కేఎంసీ కన్‌స్ట్రక్షన్స్‌తో తన బిజినెస్‌ మొదలుపెట్టారు. 2014లోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టిన ఆయన.. తొలిసారే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనకు భార్య శ్రీకీర్తి, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు.

2014, 2019లలో నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనను మంత్రి పదవి వరించింది. 2019, జూన్ 8న ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఐటీ శాఖ మంత్రిగా ఆయన తనదైన ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ మధ్యే దుబాయ్ లో జరిగిన ఎక్స్‌పోలో ఆయన రాష్ట్రంలో పెట్టుబడుల పెట్టేలా వివిధ కంపెనీలను ప్రోత్సహించారు.

<p>మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్</p>
మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి నివాళులు అర్పించిన ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్

గౌతమ్‌రెడ్డి హఠాన్మరణంపై ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తీవ్రంగా కలచి వేసిందన్న జగన్‌.. గౌతమ్‌రెడ్డితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయానికి వైయస్‌.జగన్, భారతి దంపతులు నివాళులు అర్పించారు. గౌతమ్‌ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

అటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా మంత్రి గౌతమ్‌రెడ్డి మృతిపై విచారం వ్యక్తం చేశారు. ఆయన ఎంతో సౌమ్యులు, సంస్కారవంతులని అన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి కూడా గౌతమ్‌రెడ్డి మృతికి సంతాపం వ్యక్తం చేశారు. చిన్న వయసులోనే ఆయన మరణం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు కూడా తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మంత్రులు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, వివిధ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. 

<p>తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో గౌతమ్ రెడ్డి (ఫైల్ ఫొటో)</p>
తండ్రి, మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డితో గౌతమ్ రెడ్డి (ఫైల్ ఫొటో)
Whats_app_banner