AP Home Minister : మద్యం మత్తులోనే హత్య.. తాడేపల్లి ఘటనపై హోంమంత్రి-ap home minister taneti vanita slams opposition parties on tadepalli incident ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Home Minister : మద్యం మత్తులోనే హత్య.. తాడేపల్లి ఘటనపై హోంమంత్రి

AP Home Minister : మద్యం మత్తులోనే హత్య.. తాడేపల్లి ఘటనపై హోంమంత్రి

HT Telugu Desk HT Telugu
Feb 14, 2023 06:06 PM IST

AP Home Minister : తాడేపల్లి ఘటన బాధాకరమని ఏపీ హోంమంత్రి తానేటి వనతి అన్నారు. ఘటన జరిగిన గంటసేపట్లోనే నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారని తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో హత్య చేస్తే..... గంజాయి మత్తులో చేశాడని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.

ఏపీ హోంమంత్రి తానేటి వనిత
ఏపీ హోంమంత్రి తానేటి వనిత (facebook)

AP Home Minister : ఆంధ్రప్రదేశ్ లో నేరం ఎవరు చేసినా వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వం ఉపేక్షించబోదని హోంమంత్రి తానేటి వనిత స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళల భద్రతకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఫిబ్రవరి 12న అర్ధరాత్రి తాడేపల్లిలో మైనర్ బాలిక హత్యోదంతంపై నిందితుడిని గంటసేపట్లోనే పోలీసులు అరెస్ట్ చేశారని వివరించారు. తప్పు ఎవరు చేసినా, ఎంతటి వారైనా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహిళలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లో కూడా ఇలాంటి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోవడం లేదన్నారు.

తాడేపల్లిలో మైనర్‌ బాలిక హత్యకు గురవ్వడం బాధాకరమన్న హోంమంత్రి వనిత... పోలీస్ శాఖ త్వరితగతిన చర్యలు తీసుకుని నిందితుడిని అరెస్టు చేసిందని చెప్పారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారాన్ని సీఎం జగన్‌ ప్రకటించారని తెలిపారు. నిందితుడు మద్యం మత్తులో హత్య చేస్తే..... గంజాయి మత్తులో చేశాడని విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని మంత్రి తానేటి వనిత మండిపడ్డారు.

వైఎస్ఆర్సీపీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న టీడీపీ నేతలు.. వాళ్ల హయాంలో మహిళల భద్రత కోసం ఏం చేశారో చెప్పాలన్నారు.. మంత్రి వనిత. చంద్రబాబు హయాంలో పంచాయతీలు పెట్టి నిందితులకు కొమ్ము కాయడం తప్ప బాధితులకు అండగా నిలబడలేదన్నారు. రిషితేశ్వరి ఆత్మహత్య చేసుకుంటే సకాలంలో చర్యలు తీసుకోలేదని.. ఎమ్మార్వో వనజాక్షిపై టీడీపీ ఎమ్మెల్యే దాడి చేస్తే చంద్రబాబు సెటిల్మెంట్‌ చేశారని విమర్శించారు.

సీఎం జగన్‌ ప్రభుత్వం గంజాయి మీద ఉక్కుపాదం మోపిందన్న హోంమంత్రి.. ఎప్పుడూ లేనివిధంగా 2 లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నామని చెప్పారు. ఏజెన్సీలో గంజాయి సాగును ధ్వంసం చేసి, గంజాయి పండించేవారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలపై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారని తెలిపారు. ఆపరేషన్‌ పరివర్తన్‌ కార్యక్రమంతో మార్పు తీసుకువచ్చామని వివరించారు. సీఎం జగన్ నాయకత్వంలో పోలీస్‌ శాఖ సమర్థవంతంగా పనిచేస్తుంటే.. కావాలనే ప్రభుత్వం మీద నిందలు వేయడానికి, ఏదో ఒక రాతలు రాయడం, మాటలు మాట్లాడటం కరెక్ట్‌ కాదన్నారు.

రాజమండ్రిలో పుష్కరాల షూటింగ్‌కు వెళ్లి 29 మందిని పొట్టనబెట్టుకున్నప్పుడు చంద్రబాబు ఎందుకు రాజీనామా చేయలేదని హోంమంత్రి వనిత ప్రశ్నించారు. ఇటీవల కందుకూరు, గుంటూరులో 11 మందిని పొట్టనబెట్టుకున్న చంద్రబాబు తన ఎమ్మెల్యే పదవికి ఎందుకు రాజీనామా చేయలేదని నిలదీశారు. క్రైమ్‌రేట్‌ తగ్గించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో ప్రతిపక్షం తెలుసుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కదా అని ఏదిపడితే అది మాట్లాడటం మంచిది కాదని హోంమంత్రి తానేటి వనిత హితవు పలికారు.

Whats_app_banner