MunicipalSchools: ఉపాధ్యాయులు మాత్రమే విలీనం.... స్కూళ్లు, ఆస్తులు కాదన్న బొత్స-ap govt merges teachers into uniform service rules ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ap Govt Merges Teachers Into Uniform Service Rules

MunicipalSchools: ఉపాధ్యాయులు మాత్రమే విలీనం.... స్కూళ్లు, ఆస్తులు కాదన్న బొత్స

HT Telugu Desk HT Telugu
Jun 06, 2022 01:07 PM IST

ఆంధ్రప్రదేశ్‌ మునిసిపల్‌ పాఠశాలల విలీనంపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారని, మునిసిపాలిటీలు, మునిసిపల్ కార్పొరేషన్ల పరిధిలో పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల్ని మాత్రమే ఉమ్మడి సర్వీసు పరిధిలోకి తీసుకువస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి స్పష్టం చేవారు. రాష్ట్రంలోని 44,780 ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై 2095 మునిసిపల్ పాఠశాలలు కూడా భాగం అవుతాయని స్పష్టం చేశారు. మునిసిపాలిటీల ఆస్తులు వాటికే చెందుతాయన్నారు.

మంత్రి బొత్స సత్యనారాయణ
మంత్రి బొత్స సత్యనారాయణ

ఆంధ్రప్రదేశ్‌లోని మునిసిపల్ స్కూళ్లను ప్రభుత్వంలో విలీనం చేయడంపై జరుగుతున్న రగడకు మంత్రి వివరణ ఇచ్చారు. ఉమ్మడి సర్వీసు నిబంధనల్లోకి మాత్రమే ఉపాధ్యాయులు వస్తారని, మునిసిపాలిటీలు, జిల్లా పరిషత్‌ పాఠశాలలకు వేర్వేరుగా నిబంధనలు ఉండటంపై ఉపాధ్యాయ సంఘాలు , ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు వేరు వేరుగా తనను కలిసి పలుమార్లు విజ్ఞప్తి చేశారని మంత్రి స్పష్టం చేశారు. మునిసిపల్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలోనే ఒకే గొడుగు కిందకు ఉపాధ్యాయుల్ని తీసుకురావాలని ఉపాధ్యాయ సంఘాలు కోరడంతోనే ఈ ప్రతిపాదన తీసుకొచ్చామని చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాది మునిసిపల్ స్కూళ్ల అంశం ప్రభుత్వ దృష్టిలోకి వచ్చిందని, జడ్పీ స్కూళ్లనుఎలా మానిటర్ చేస్తున్నారో అదే విధంగా మునిసిపల్ స్కూళ్ల కు ఇకపై పాలసీలు వర్తిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా ఒకే గొడుగు కిందకు తీసుకువస్తే ఉపాధ్యాయులకు ఉపయోగంగా ఉంటుందనే సదుద్దేశంతో పాఠశాలల్ని విలీనం చేస్తున్నామన్నారు. మునిసిపాలిటీల్లోని పాఠశాలల్లో కమిషనర్లు మాత్రమే స్కూళ్లను పర్యవేక్షిస్తున్నారని, జిల్లా పరిషత్‌ స్కూళ్లలో కనీసం ఎంఈవోలు ఉంటున్నారని ఉపాధ్యాయ సంఘాలు విజ్ఞప్తి ేచేశారని చెప్పారు. పాఠశాలల్ని విలీనం చేయాలనేది కోవిడ్ రాకముందే చర్చ జరిగిందన్నారు.ఈ విషయంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు సైతం తనకు వినతి పత్రాలు ఇచ్చిన తర్వాతే విద్యాశాఖ మొత్తాన్ని ఒకే గొడుగు కిందకు తీసుకురావాలని ప్రతిపాదించామన్నారు. 

మునిసిపాలిటీ ఆస్తులు మొత్తం మునిసిపాలిటీలకే చెందుతాయని, పరిపాలనా వ్యవహారాలు మాత్రమే విద్యాశాఖ చేపడుతుందని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మునిసిపల్ స్కూల్స్‌ 2095 ఉన్నాయని, మొత్తం ప్రభుత్వ 44,780 ప్రభుత్వ పాఠశాలల్లో 2095 మునిసిపల్ స్కూళ్లు ఉన్నాయన్నారు. ఉపాధ్యాయుల్ని ఒకే శాఖలో తీసుకువస్తున్నామని, ఆస్తుల కోసం పాఠశాలల విలీనం చేయట్లేదని స్పష్టం చేశారు. పత్రికల్లో చేస్తున్న దుష్ప్రచారం మాత్రమేనని, ఉపాధ్యాయులు ఆందోళన చెందొద్దని మంత్రి సూచించారు. పాఠశాలలు, ప్లే గ్రౌండ్స్‌ అమ్ముకుంటారనే వార్తలు ప్రభుత్వం మీద బురద చల్లడానికి అని ఆరోపించారు.

IPL_Entry_Point

టాపిక్