AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణ షురూ, కసరత్తు ప్రారంభం..-ap government begins restructuring of village and ward secretariats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణ షురూ, కసరత్తు ప్రారంభం..

AP Sachivalayalu: ఏపీలో గ్రామ-వార్డు సచివాలయాల పునర్ వ్యవస్థీకరణ షురూ, కసరత్తు ప్రారంభం..

Bolleddu Sarath Chandra HT Telugu
Dec 03, 2024 06:24 AM IST

AP Sachivalayalu: సమర్థవంతంగా పౌర సేవలు అందించడంలో విఫలమవుతున్న గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. పేరుకు 15వేల సచివాలయాలు ఉన్నా వాటితో ప్రజలకు అందుతున్న పౌర సేవలు అంతంత మాత్రంగానే ఉండటంతో వాటిని పునర్‌ వ్యవస్థీకరించేందుకు రెడీ అవుతోంది.

సచివాలయాల ప్రక్షాళన యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
సచివాలయాల ప్రక్షాళన యోచనలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

AP Sachivalayalu: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ప్రభుత్వం పాలనా యంత్రాంగంలో కొత్తగా జొప్పించిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను పునర్‌ వ్యవస్థీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ప్రజలకు సమర్థవంతమైన సేవలు అందించేలా తీర్చిదిద్దే అంశంపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే సచివాలయాల నుంచి అందుతున్న పౌర సేవలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో వాటిలో అందించే సేవలు, ప్రభుత్వ శాఖలతో సమన్వయం, సచివాలయాల బాధ్యతలు, అధికారాలపై ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షించారు.

గ్రామ - వార్డు సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువచ్చి, మరింత అర్థవంతంగా, పటిష్టంగా ఈ వ్యవస్థను తయారు చేసి ప్రజలకు ఉపయోగకరంగా నిలపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. ఇందులో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థపై తన నివాసంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.

గ్రామాల్లోనూ - ఇటు పట్టణ, నగర ప్రాంతాల్లోనూ సచివాలయాలు ప్రజలకు మరింత చేరువై, మెరుగైన సేవలు అందించాలనే దానిపైన ముఖ్యమంత్రి ప్రధానంగా చర్చించారు. సచివాలయ వ్యవస్ధ పునర్ వ్యవస్థీకరణ ప్రధాన అజెండాగా జరిగిన మొదటి మీటింగ్ లో వ్యవస్థ పనితీరు, ప్రజలకు అందుతున్న సేవలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. సచివాలయాల నేరుగా పౌరసేవలు అందుతున్నాయా లేదో ముఖ్యమంత్రి ప్రశ్నించారు.

ఈ వ్యవస్థ ద్వారా అత్యుత్తమ ప్రజాసేవలు అందించడంతోపాటు సచివాలయ ఉద్యోగులకు కూడా ఒక క్రమబద్ధమైన ఉద్యోగ బాధ్యతలు కల్పించి ఈ వ్యవస్ధను సమర్థవంతంగా ఉపయోగించుకునే అంశంపై చర్చించారు. మానవ వనరులను సక్రమంగా వినియోగించుకోవడంతో పాటు, ఉద్యోగుల అవసరాలు, సౌకర్యాలపైనా చర్చించారు.

సచివాలయ ఉద్యోగుల్లో కొందరికి ఎక్కువ పని, మరికొందరికి తక్కువ పని ఉండటం సరికాదని.. అందరికీ సమానమైన పని బాధ్యత ఉండేలా చూడాలనే ఆలోచనపై అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రభుత్వ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులను సర్థుబాటు చేయడంతో పాటు వారికి శాఖపరమైన శిక్షణ ఇవ్వాలని సమావేశంలో చర్చించారు.

పంచాయతీలు ఎక్కువ – సచివాలయాలు తక్కువ

ప్రస్తుతం రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు 13,291 ఉండగా గ్రామ సచివాలయాలు మాత్రం కేవలం 11,162 సచివాలయాలు మాత్రమే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 15,004 గ్రామ-వార్డు సచివాలయాలు ఉండగా వీటిలో 1,19,803 మంది ఉద్యోగులను నేరుగా నియమించారు. ఇతర విభాగాల వారిని కూడా కలుపుకుంటే 1,27,175 మంది గ్రామ-వార్డు సచివాలయాల్లో ఉద్యోగులుగా ప్రస్తుతం పనిచేస్తున్నారు.

వీరిలో గ్రామ సచివాలయాల్లో 95,533 మంది, వార్డు సచివాలయాల్లో 31,592 మంది ఉన్నారు. వీరిలో 18 నుంచి 27 సంవత్సరాల వయసున్న ఉద్యోగులు 50,284 (39.54%) మంది, 28 నుంచి 37 సంవత్సరాల వయసున్న ఉద్యోగులు 54,774 (43.07%) మంది ఉన్నారు.

సచివాలయ ఉద్యోగుల్లో పీజీ, పీహెచ్ డీ, ఇంజినీరింగ్‌, వైద్య విద్య చదివిన వాళ్లు కూడా ఉన్నారు. పీజీ, ఆపైన చదివిన ఉద్యోగులు 14 శాతం, వృత్తి విద్యా కోర్సులు చదివిన వాళ్లు 31 శాతం ఉన్నారు. యువత అధికంగా ఉండే ఈ వ్యవస్ధను ఏ విధంగా వినియోగించుకోవాలనే అంశంపై సమావేశంలో చర్చించారు. మొదటి సమావేశంలో వ్యవస్ధ పనితీరుతో పాటు పలు అంశాలపై చర్చించారు. రానున్న రోజుల్లో మరింత కసరత్తు జరిపి ప్రభుత్వం ఈ విభాగంపై ముందడుగు వేయనుంది. సచివాలయ వ్యవస్థను సమూలంగా మార్పులు చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.

Whats_app_banner

సంబంధిత కథనం