DSC 1998 Latest: నేటి నుంచి డిఎస్సీ 98 అభ్యర్ధుల రిజిస్ట్రేషన్
DSC 1998 Latest: సుదీర్ఘ కాలంగా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న డిఎస్సీ 98 అభ్యర్ధుల నియామకాలకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్ధులు తమ వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
DSC 1998 Latest: ప్రభుత్వ ఉద్యోగం కోసం పోరాడి దాదాపు పాతికేళ్లుగా ఎదురు చూస్తోన్న డిఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్ధుల రిజిస్ట్రేషన్ ప్రక్రియను విద్యాశాఖ చేపట్టింది. దాదాపు 24ఏళ్లుగా ఉద్యోగాల కోసం ఎదురు చూపుల్లోనే చాలామంది కాలం చేశారు. 24ఏళ్ల క్రితం ఉద్యోగాల కోసం పోరాటాలు ప్రారంభించిన సమయంలో 17వేల మంది ఉపాధ్యాయులు ఉంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వేల మంది మిగిలారు.
రాష్ట్ర ప్రభుత్వం మినిమం టైం స్కేల్ చెల్లింపుతో వారందరికి ఉద్యోగాలు ఇవ్వడానికి అంగీకరించింది. కాంట్రాక్టు ప్రాతిపదిన ఉపాధ్యాయుల నియామకం చేపట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. డిఎస్సీ 98 క్వాలిఫై అయిన వారి వివరాలను విద్యాశాఖ సేకరించడం ప్రారంభించింది. మంగళవారం నుంచి అభ్యర్ధులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు.
ప్రభుత్వాలు మారుతూ వచ్చినా 98లో క్వాలిఫై అయిన అభ్యర్ధులకు నియామకాలు చేపట్టకపోవడంపై పట్టు వీడకుండా పోరాడుతూ వచ్చారు. మొదట రెగ్యులర్ ప్రతిపాదికన ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించినా తర్వాత వారిని కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్‌గా, గెస్ట్ ఫ్యాకల్టీలుగా మోడల్ స్కూల్స్, కస్తుర్బాగాంధీ పాఠశాలల్లో నియమిస్తారని చెప్పారు.
చివరకు ప్రభుత్వం మినిమం టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. ఏడాదిలో పది నెలల పాటు వీరికి జీతాలు చెల్లిస్తారు. జులై 26 నుంచి ఆగష్టు 1వరకు 1998 డిఎస్సీ అర్హత సాధించిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. అభ్యర్ధులు తమ వివరాలను పాఠశాల విద్యాశాఖ వెబ్‌సైట్ https://cse.ap.gov.in లో నమోదు చేయాల్సి ఉంటుంది. 98 డిఎస్సీలో అర్హత సాధించిన వారిలో ఎంత మంది ఉద్యోగాలు చేయడానికి ముందుకు వస్తారనేది ఆసక్తికరంగా మారింది. గతంలో కొంతకాలం సిఆర్పీలుగా పనిచేసిన వారు కూడా వేతనాలు చాలకపోవడంతో ప్రత్యామ్నయ ఉద్యోగాల వైపుకు మళ్లారు. ఇప్పుడు మినిమం టైం స్కేలుతో నెలకు రూ.28వేల వరకు వారికి ప్రభుత్వం వేతనం చెల్లించనుంది.
టాపిక్